బలిపీఠంపై బక్కరైతు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పచ్చని పంట పొలాలతో అలలాడుతూ సిరులొలికించాల్సిన జిల్లాను కరువు మేఘం కాటేసింది. వరుణుడు పగపట్టడం.. కాలం కాలిసిరాకపోవడం.. రుణాలు ఇచ్చే వారు లేకపోవడం.. సమయానికి భరోసా కల్పించే వారు కానరాకపోవడం కుభేరుడిగా ఉండాల్సిన రైతు కుచేలుడిగా మారుతున్నాడు. గత ఖరీఫ్‌ను అతివృష్టి ముంచితే.. ఈ ఖరీఫ్‌లో అనావృష్టి కన్నీరు పెట్టించింది.
రెండు.. మూడు సార్లు విత్తనాలు విత్తినా భూమిలోనే కుళ్లిపోవడం.. కాత వచ్చే సమయంలో విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోవడం.. వెరసి రైతన్న ఆత్మహత్యకు పాల్పడుతున్నాడు. అనుకున్న దిగుబడి రాక.. చేసిన అప్పులు తీర్చే మార్గం లేక.. మట్టిలోనే కలిసిపోతున్నాడు. ఖరీఫ్ సీజన్ ప్రారంభమైన వంద రోజుల్లో 31 మంది రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు.
తగ్గిన సాగు.. తప్పని కరెంటు కష్టాలు..
జిల్లాలో ఈ ఏడాది 6.50 లక్షల హెక్టార్లలో వివిధ రకాల పంటలు సాగవుతాయని వ్యవసాయ శాఖ అ ధికారులు అంచనా వేశారు. కానీ.. సకాలంలో వర్షా లు లేక అంచనాలు తగ్గాయి. 5.43 లక్షల హెక్టార్లు మాత్రమే సాగైంది. జూన్, జూలైలో కురవాల్సిన వర్షాలు ఆలస్యంగా ఆగస్టు చివరలో కురియడంతో ఆ మాత్రం పంటలు సాగు చేశారు. ప్రస్తుతం పూత, కాత దశలో ఉన్న పంటలకు నీటితడి అవసరం ఉంది.
నెలన్నరగా వరుణుడు మొఖం చాటేయడంతో పంటలు ఆశించిన స్థాయిలో ఎదగలేదు. దీనికితోడు నీటి సౌకర్యం ఉన్న రైతులు స్ప్రింక్లర్ల ద్వారా నీరందించాలనుకుంటున్నా కరెంటు సహకరించడంలేదు. అధికారికంగానే మూడు గంటల త్రీఫేజ్ సరఫరా చేస్తామని ప్రకటిస్తే ఇక అనధికారికంగా ఎంత కరెం టిస్తారో అర్థం చేసుకోవచ్చు. అనధికారికంగా కోతలు తీవ్రం కావడంతో గంట కూడా కరెంటు ఉండని పరిస్థితి నెలకొంది.
అందని రుణాలు..
రుణ మాఫీ విషయంలో ప్రభుత్వం కాలయాపన చే స్తుండడంతో అన్నదాతలకు భరోసా లేకుండా పో యింది. ఆ తర్వాత విడతల వారీగా రుణ మాఫీ చేస్తామని ప్రకటించడంతో రైతులు ఆందోళన చెందారు. కేవలం 25 శాతం రైతులకు మాత్రమే రుణాలు మాఫీ చేయడంతో అన్నదాత అయోమయంలో పడ్డాడు. పూర్తిస్థాయిలో రుణ మాఫీ అవుతుందని ఆశ పెట్టుకున్న వారికి ప్రభుత్వం నిరాశకు గురిచేసింది. ఇదిలా ఉండగా ఈ ఏడాది ఖరీఫ్ రుణ లక్ష్యం రూ.2,228 కోట్లు, 3.50 లక్షల మందికి ఇవ్వాలని నిర్ణయించారు. గతేడాది కంటే రూ.600 కోట్లు పెంచినా, ఖరీఫ్ కాలం ముగుస్తున్నా బ్యాంకర్లు మాత్రం సగం కూడా పూర్తి కాలేదు. కేవలం ఇప్పటి వరకు 1,32,311 మంది రైతులకు రూ.602 కోట్లు రుణాలు అందజేశారు.
ఇప్పటివరకు రుణ మాఫీ కాని రైతులు దిగాలు చెందుతున్నారు. ప్రతిసారీ బ్యాంకర్లు ఖరీఫ్ ప్రారంభంలో పంట రుణాలు అందిస్తారు. కానీ.. ఈసారి ఖరీఫ్ ముగుస్తున్నా రుణాలు పూర్తిస్థాయిలో ఇవ్వని పరిస్థితి. ఈసారి వర్షాలు లేక రెండు మూడుసార్లు విత్తనాలు విత్తి రైతులు సుమారు లక్ష 80 వేల ఎకరాల్లో విత్తనాలు మొలకెత్తక నష్టపోయారు. ఎకరానికి సుమారు 4 వేల నుంచి రూ.6 వేల వరకు నష్టం వాటిల్లింది. అన్నిరకాల పంటలు కలిపి విత్తన దశలోనే జిల్లాలో సుమారుగా రూ.2 కోట్ల పంట నష్టం జరిగిం ది. దీంతో నష్ట పరిహారం అందక.. పంటలు మొలకెత్తక, మొలకెత్తిన పంటలు కరెంట్ కోతలతో ఎండిపోవడంతో రైతులు అత్మహత్యకు పాల్పడుతున్నారు.
తగ్గిన వర్ష పాతం..
ఈ ఏడాది సాధారణ స్థాయి వర్షపాతం కంటే తక్కువగా కురిసింది. జిల్లాలో ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం 1037.7 మిల్లీమీటర్లు కురవాల్సి ఉంది. కానీ.. 717.0 మిల్లీమీటర్లు పడింది. 31 లోటుగా ఉంది. గతేడాది ఈ సమయానికి 1326.9 మిల్లీమీటర్లు అధికంగా వర్షపాతం కురిసింది. జిల్లాలో అధికంగా 80 శాతం వర్షాధారంగానే పంటలు సాగు చేస్తున్నారు. 52 మండలాలకు గాను సిర్పూర్(టి)లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదైంది. వరి సాగు సగానికి తగ్గింది.
ఈ ఖరీఫ్‌లో ఇప్పటి వరకు అత్మహత్యలు..
జిల్లాలో వంద రోజుల్లో 31 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. జూలైలో పది మంది, ఆగస్టులో 15 మంది, సెప్టెంబర్‌లో 11 మంది, ఈనెలలో ఇప్పటి వరకు నలుగురు రైతులు బలవన్మరణాలకు పాల్పడ్డారు. పంట సాగు కోసం చేసిన అప్పులు తీర్చలేక తనువు చాలించారు. ప్రైవేటు వడ్డీ వ్యాపారుల వద్ద అప్పుల భారం పెరిగిపోయి.. వాటిని తీర్చలేక ప్రాణాలు కోల్పోయారు.