‘కోవలెంట్’పై జనం కన్నెర్ర | peoples fire on Kovalent industry | Sakshi
Sakshi News home page

‘కోవలెంట్’పై జనం కన్నెర్ర

Published Thu, Dec 4 2014 11:39 PM | Last Updated on Sat, Sep 2 2017 5:37 PM

‘కోవలెంట్’పై జనం కన్నెర్ర

‘కోవలెంట్’పై జనం కన్నెర్ర

‘కోవలెంట్’ పరిశ్రమ జల, వాయు కాలుష్యంతో ఇప్పటికే చస్తూ బతుకున్నామని, ఇపుడు పరిశ్రమను విస్తరిస్తే గ్రామం శ్మశానమవుతుందని గుండ్లమాచునూర్ గ్రామస్తులు ఆందోళనకు దిగారు. గురువారం హత్నూర మండలం గుండ్లమాచునూర్ గ్రామ పరిధిలోని కోవలెంట్ లేబరేటరీస్ ప్రైవేట్ లిమిటెడ్ యూనిట్-1 పరిశ్రమను విస్తరించేందుకు గాను ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. జాయింట్ కలెక్టర్ డాక్టర్ శరత్ అధ్యక్షతన జరిగిన సభలో జనమంతా ‘కోవలెంట్’ పరిశ్రమ యాజమాన్యంపై నిప్పులు చెరిగారు. కాలుష్యంతో తమను కబలిస్తోన్న పరిశ్రమ విస్తరణను తాము ఒప్పుకోమంటూ కరాఖండీగా తేల్చిచెప్పారు.
 
నర్సాపూర్/ హత్నూర: ‘కోవలెంట్’ పరిశ్రమ విస్తరణ ప్రజాభిప్రాయ సేకరణ రసాభాసగా మారింది. స్థానికులంతా కంపెనీకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కోవలెంట్ పరిశ్రమ హఠావో..గుండ్లమాచునూర్ బచావో అంటూ ప్లకార్డులు ప్రదర్శించారు.  కాలుష్యాన్ని వెదజల్లుతున్న కంపెనీని విస్తరించవద్దని గ్రామ సర్పంచ్ మన్నె ఈశ్వరమ్మ, జెడ్పీటీసీ సభ్యురాలు పల్లెజయశ్రీతోపాటు పలువురు వార్డు సభ్యులు జాయింట్ కలెక్టర్ శరత్‌కు వినతిపత్రం అందజేశారు. గ్రామస్తులతో కలిసి ర్యాలీగా వచ్చిన వారు కంపెనీ విస్తరించకూడదని పంచాయతీ సభ్యులందరూ ఏకగ్రీవంగా తీర్మానం చేశారని జేసీకి   వెళ్లడించారు. అంతేకాకుండా తీర్మాన ప్రతిని జేసీకి అందజేశారు. ఈ సందర్భంగా జెడ్పీటీసీ సభ్యురాలు జయశ్రీ మాట్లాడుతూ, పారిశ్రామిక అభివృద్ధికి తాము వ్యతిరేకం కాదని, అయితే ఆ పరిశ్రమల కోసం జనం ప్రాణాలను ఫణంగా పెట్టలేమన్నారు.

కోవలెంట్ పరిశ్రమ వెదజల్లే కాలుష్యంతో ఇప్పటికే జనమంతా అల్లాడిపోతున్నారని, ఇపుడు కంపెనీని విస్తరిస్తే స్థానికుల బతుకులు ఆగమవుతాయన్నారు. కాలుష్యంతో గుండ్లమాచునూర్‌లో చాలా మంది పురుషులు చనిపోవడంతో మహిళలు యుక్త వయస్సులోనే వితంతువులవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. పల్పనూర్, గుండ్లమాచునూర్, బోర్పట్ల గ్రామాలతోపాటు చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కాలుష్యంతో అనారోగ్యానికి గురవుతున్నారని ఆమె చెప్పారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాలుష్యాన్ని అదుపు చేయాలని ఆమె సూచించారు. ప్రజలకు ఇబ్బంది కలిగిస్తున్న ఈ కంపెనీని విస్తరణను వెంటనే ఆపివేయాలని ఆమె డిమాండ్ చేశారు.

అనంతరం గుండ్లమాచునూర్  ఉపసర్పంచ్ నర్సింహారెడ్డి మాట్లాడుతూ, కోవలెంట్ పరిశ్రమ నుంచి వస్తున్న వివిధ రకాల కాలుష్య కారకాలతో తమ గ్రామంలోని మహిళలకు గర్భ స్రావాలు అవుతున్నాయని, అందువల్ల కంపెనీని విస్తరించవద్దని జేసీకి వినతిపత్రం అందజేశారు. యువజన సంఘాల నాయకుడు బద్రేశ్ మాట్లాడుతూ, కోవలెంట్ కంపెనీ నుంచి వెలువడుతున్న కాలుష్యంతో తాము చస్తూ బతుకుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. కంపెనీ కాలుష్యంతో గాలి, నీరు కలుషితమై రోగాలబారిన పడుతున్నామన్నారు. కాలుష్యం కారణంగా పంట భూములన్నీ బీళ్లుగా మారాయన్నారు.  పల్పనూర్ సర్పంచ్ బంటు శ్రీనివాస్ మాట్లాడుతూ, పల్పనూర్ గ్రామం చుట్టూ ఉన్న కంపెనీల నుంచి వస్తున్న కాలుష్యంతో తమ గ్రామ పరిధిలోని భూములలో గడ్డి మొలవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

తమ గ్రామ పరిధిలో కంపెనీలు లేకపోయినా, చుట్టుపక్కల గ్రామాల్లో ఉన్న కంపెనీల నుంచి వెలువడే కాలుష్యంతో  తమ గ్రామానికి చెందిన వారంతా అనారోగ్యానికి గురవుతున్నారని, ఆయా కంపెనీల నుంచి వచ్చే కాలుష్యాన్ని అదుపు చేయాలని అధికారులను కోరారు. అనంతరం పటాన్‌చెరుకు చెందిన పర్యావరణ ప్రేమికుడు చిదంబరం మాట్లాడుతూ, రసాయన పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యంతో రాబోయే తరాలకు విపత్తేనని ఆందోళన వ్యక్తం చేశాడు. తాను పరిశ్రమల ఏర్పాటుకు వ్యతిరేకం కాదని, పరిశ్రమల నుంచి వచ్చే కాలుష్యానికి వ్యతిరేకమన్నారు. గుండ్లమాచనూర్ మాజీ సర్పంచ్ న ర్సింహ్మ, గ్రీన్‌కాప్ సొసైటీ అధ్యక్షుడు సైదిరెడ్డి మాట్లాడుతూ, కంపెనీల యాజమాన్యాలు లాభాలనే చూస్తూ,  ప్రజల సంక్షేమాన్ని విస్మరించారని మండిపడ్డారు. గ్రామాల్లో ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కంపెనీ విస్తరణ ప్రజాభిప్రాయం ఎలా నిర్వహిస్తారంటూ నిలదీశారు.  

కాలుష్య వ్యతిరేక పోరాట సమితి అధ్యక్షుడు యాదగిరి, బీఎస్‌పీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్‌చార్జి శాంతకుమార్‌లు మాట్లాడుతూ, కాలుష్యం వెదజల్లే పరిశ్రమలను సారవంతమైన భూముల్లో ఎలా పెడతారని ప్రశ్నించారు. ప్రజల జీవితాలతో ఆడుకుంటున్న కోవలెంట్ పరిశ్రమకు అధికారులు మద్దతు తెలుపుతున్నారని రిపబ్లికన్ పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడు మొగులయ్య ఆరోపించారు. కార్యక్రమంలో ఆర్డీఓ నగేష్, హత్నూర తహశీల్దార్ ప్రతాప్‌రెడ్డి, గ్రామానికి  చెందిన కృష్ణ, సాయిలు,హెస్సేన్, నగేష్, శంకర్‌రెడ్డి, గౌసోద్దీన్, సర్దార్, జితేందర్‌రెడ్డి,  తదితరులు పాల్గొని కంపెనీని విస్తరించవద్దని కోరారు.

భారీ పోలీసు బందోబస్తు

గుండ్ల మాచునూర్ గ్రామ శివారులో ఉన్న కోవలెంట్ లేబరేటరీస్ పరిశ్రమ విస్తరణ  కోసం గురువారం చేపట్టిన ప్రజాభిప్రాయ సేకరణను భారీ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏఎస్‌పీ రవీందర్‌రెడ్డి ఆధ్వర్యంలో నలుగురు డీఎస్పీలు, 10 మంది సీఐలు, 20 మంది ఎస్‌ఐలతో పాటు వందలాది మంది కానిస్టేబుళ్లు, ప్రత్యేక పోలీసు దళాలను కూడా  ఏర్పాటు చేశారు. ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమానికి గ్రామాల్లో సైతం ముందస్తుగా పోలీసులను మోహరించడంతోపాటు సభాస్థలి వద్ద కూడా పెద్ద ఎత్తున పోలీసు పహార ఏర్పాటు చేశారు. స్థానిక ప్రజాప్రతినిధులను ప్రజాభిప్రాయ సేకరణ వద్దకు వెళ్లనీయకుండా పోలీసులు అడ్డుకోవడంతో  స్వల్ప ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. వెంటనే జేసీ శరత్ కల్పించుకుని  స్థానిక ప్రజాప్రతినిధులు సమావేశ వేదిక వద్దకు ప్రజాప్రతినిధులను పంపాలని సూచించడంతో పోలీసులు వారిని వదిలారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement