ఆ మిల్లులపై చర్యలకు ఆదేశాలివ్వండి | pil on mills to take action againist chemicals releasing in to water | Sakshi
Sakshi News home page

ఆ మిల్లులపై చర్యలకు ఆదేశాలివ్వండి

Published Sun, Feb 8 2015 1:19 AM | Last Updated on Sat, Sep 2 2017 8:57 PM

pil on mills to take action againist chemicals releasing in to water

 సాక్షి, హైదరాబాద్ : మహబూబ్‌నగర్ జిల్లా, గద్వాల మండల, మునిసిపాలిటీ పరిధిలో ఎలాంటి అనుమతులు లేకుండా పెద్ద ఎత్తున కాటన్ జిన్నింగ్ మిల్లులు నడుస్తున్నాయని, ఈ కంపెనీలు పత్తి నుంచి పత్తి విత్తనాలను వేరు చేసే ప్రక్రియలో సల్ఫ్యూరిక్ యాసిడ్‌ను వాడుతున్నాయని, దీని వల్ల చుట్టపక్కల ప్రాంతాల్లో నీరు కలుషితం అవుతోందని, వీటిపై అధికారులు చర్యలు తీసుకోవడం లేదంటూ హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలైంది. ఈ వ్యాజ్యాన్ని గద్వాల మునిసిపల్ కౌన్సిల్ చైర్‌పర్సన్ జి.పద్మావతి మరికొందరు దాఖలు చేశారు. గద్వాల మునిసిపాలిటీ చుట్టుపక్కల 18 కాటన్ జిన్నింగ్ మిల్లులు ఉన్నాయని, పత్తి నుంచి పత్తి విత్తనాలను వేరు చేసే సందర్భంగా వాడే రసాయనాల వల్ల నీటి వనరులన్నీ కలుషితమై, వినియోగానికి పనిరాకుండా పోతున్నాయని పిటిషనర్లు వివరించారు. దీనిపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ప్రయోజనం లేదని, అందుకే హైకోర్టును ఆశ్రయించామని పిటిషనర్లు వివరించారు. సల్ఫ్యూరిక్ యాసిడ్ నీటిలో కలవడం వల్ల ఈ నీటిని ఉపయోగించిన వారు క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతున్నారని పిటిషనర్లు తెలిపారు. ఈ పరిశ్రమలకు అసలు చట్టపరమైన అనుమతులు లేవన్నారు. రసాయనాలను నిల్వ చేసేందుకు ఏర్పాటు చేయాల్సిన సివరేజి ట్యాంకులను నిర్మించలేదని, మొత్తం వ్యర్థ రసాయనాలను చెరువులు, నీటికుంటల్లోకి విడిచిపెడుతున్నారని, ఈ వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని వారు కోర్టును కోరారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement