కరీంనగర్ : బంగారు తెలంగాణ నిర్మాణానికి ప్రభుత్వం పకడ్బందీ ప్రణాళికలు రూపొందిస్తోంది. గ్రామస్థా యి నుంచి పక్కా ప్రణాళికలుంటేనే అభివృద్ధి సాధ్యమని సోమవారం హైదరాబాద్‌లో కలెక్టర్లు, ఉన్నతాధికారులతో నిర్వహించిన మేథోమధనంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు వెల్లడించిన అభిప్రాయాల మేరకు జిల్లా అధికార యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. మన రాష్ట్రం -మన ఊరు - మన ప్రణాళిక అనే లక్ష్యంతో నవ తెలంగాణ నిర్మాణంలో గ్రామస్థాయి నుంచి ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థలు, అధికారులనందరినీ భాగస్వాములు చేస్తూ ప్రణాళిక రూపొందించేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. బుధవారం కలెక్టరేట్ కార్యాలయంలో కలెక్టర్ అధ్యక్షతన ఆర్డీవోలు, తహశీల్దార్లతో సమావేశం నిర్వహించనున్నారు.
ముఖ్యమంత్రి వెల్లడించిన అభిప్రాయాలను ఈ సమావేశంలో వివరించనున్నారు. అభివృద్ధికి ప్రణాళిక రూపకల్పనలో గ్రామస్థాయిలో చేపట్టాల్సిన అంశాలపై చర్చించనున్నారు. గ్రామస్థాయిలోనే పథకాల రూపకల్పన జరిగి వాటి అమలులో చిత్తశుద్ధితో వ్యవహరించేందుకు జిల్లా, మండలం, గ్రామానికి ప్రత్యేకాధికారులను నియమించనున్నారు. మొదటగా ఈ నెల 12 నుంచి 17 వరకు గ్రామ ప్రణాళికలు తయారు చేసి, గ్రామసభ నిర్వహిస్తారు. 17 నుంచి 22 వరకు మండలస్థాయి ప్రణాళిక, 22 నుంచి 27 వరకు జిల్లాస్థాయి ప్రణాళిక రూపొందిస్తారు.
ప్రణాళిక రూపకల్పనలో సహకరించేందుకు కలెక్టర్‌కు ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని ఏర్పాటు చేస్తారు. ఆగస్టు 1 నుంచి 10 వరకు రాష్ట్రస్థాయిలో వర్క్‌షాప్ నిర్వహించి రాష్ట్రస్థాయి ప్రణాళిక రూపొందిస్తారు. గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి వచ్చిన ప్రణాళికలను శాఖల వారీగా క్రోడీకరించి బడ్జెట్‌కు రూపకల్పన చేయనున్నారు.10 నుంచి 20 వరకు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రూపొందించనున్నారు. ప్రణాళిక అమలులో భాగంగా ప్రజాప్రతినిధులకు హైదరాబాద్‌లో వివిధ కేంద్రాల్లో శిక్షణ శిబిరాలు నిర్వహిస్తారు. 19న సర్పంచులకు, 22న మండలాధ్యక్షులకు , 27న జెడ్పీటీసీ సభ్యులకు శిక్షణ ఉంటుంది.
ప్లాన్ పక్కా
Published Wed, Jul 9 2014 2:57 AM | Last Updated on Wed, Aug 15 2018 7:50 PM
Advertisement