కరీంనగర్ అగ్రికల్చర్: జెడ్పీ ప్రత్యేక సర్వసభ్య సమావేశంలో పాల్గొన్న ఎమ్మెల్యేలు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు క్షేత్రస్థాయిలో రైతు సంక్షేమ, అభివృద్ధి పథకాలను విస్తృతం చేయాలని మంత్రికి విన్నవించారు. వ్యవసాయ అనుబంధ శాఖ లో ఖాళీలను భర్తీ చేయాలని పెద్దపెల్లి ఎమ్మెల్యే మనోహర్‌రెడ్డి కోరారు. ఉద్యాన శాఖ ద్వారా అమలు చేస్తున్న 70 శాతం సబ్సిడీతో ఇస్తున్న పాలీహౌస్‌ను జిల్లాలోనూ వర్తింపజేయాలని కరీంనగర్ జెడ్పీటీసీ ఎడ్ల శ్రీను విజ్ఞప్తి చేశారు.
సోలార్ పంపుసెట్లను ఉచితంగా అందజేయాలని ఆయన కోరగా ప్రభుత్వం పరిశీలిస్తోందని, 2015-16 నుంచి పాలీహౌస్ పథకాన్ని అన్ని జిల్లాల్లో వర్తింపజేస్తామని మంత్రి సమాధనం ఇచ్చారు. మానకొండూర్ జెడ్పీటీసీ సుగుణాకర్.. పంటల బీమా రైతులకు ధీమానివ్వడం లేదని, ఇన్‌పుట్ సబ్సిడీ రైతుల ఖాతాలకు చేరడం లేదని తెలిపారు. మంత్రి స్పందిస్తూ.. పంటల బీమా లోపభూయిష్టంగా ఉందని, త్వరలో రైతు యూనిట్ పంటల బీమా అమలుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు.
యాంత్రీకరణలో రూ.30 వేలు దాటిన పరికరాలకు పూర్తిస్థాయిలో డీడీ చెల్లించినప్పుడే పరికరాలు మంజూరు ఇబ్బం దికరమని, నిబంధనలు సడలించాలని బోయినిపల్లి జెడ్పీటీసీ లచ్చిరెడ్డి కోరారు. రూ.లక్ష విలువ చేసే పరికరాల వరకు సబ్సిడీ మినహాయించి ఇచ్చేలా చర్యలు తీసుకుంటున్నామని మంత్రి వివరించారు. వరి, పత్తికి బదులుగా ప్రత్నామ్నాయంగా సోయాబీన్, కూరగాయల సాగును ప్రోత్సహించి మార్కెటింగ్ సౌకర్యాలు పెంచాలని ధర్మారం జెడ్పీటీసీ నార బుచ్చయ్య, రామగుండం జెడ్పీటీసీ కందుల సంధ్యారాణి కోరారు. మత్స్యకార్మిక సహకార సంఘాల్లో దళారులు మత్య్సకారుల పొట్టగొడుతున్నారంటూ ఎల్లారెడ్డిపేట జెడ్పీటీసీ ఆగయ్య అన్నారు. జిల్లాను పూర్తిగా కరువు మండలంగా ప్రకటించాలని కో-ఆప్షన్ మెంబర్ జమీలొద్దీన్ విన్నవించారు.
ప్రజాప్రతినిధులకు విశ్రాంతి భవనం..
నిత్యం జిల్లా కేంద్రానికి వచ్చే ప్రజాప్రతినిధులైన సర్పంచులు, ఎంపీటీసీలు, ఎంపీపీలు, జెడ్పీటీసీల కోసం కరీంనగర్‌లో విశ్రాంతి భవనం నిర్మించాలని ఎమ్మెల్సీ భానుప్రసాద్ కోరారు. అందుకోసం జిల్లా కేంద్రంలో 15 గుంటల స్థలం కేటాయిస్తే తన ఫండ్ నుంచి రూ.కోటి నిధులు కేటాయిస్తానన్నారు. ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్పందిస్తూ జిల్లా కేంద్రంలో 20 గుంటల స్థలం మంజూరుకు కలెక్టర్ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
కార్డులు.. పింఛన్లు
వ్యవసాయంపై ఏర్పాటు చేసిన సమావేశం లో ఆహారభద్రత కార్డులు, పింఛన్లు అందలేదంటూ సభ్యులు లేవనెత్తారు. ప్రతీ మండలంలో రెండు వందల మందిని ఆసరాకు అర్హులుగా పెంచాలని సభ్యులు కోరారు. మంత్రి ఈటెల రాజేందర్ ఆహారభద్రత కార్డులు, విద్యార్థులకు సన్నబియ్యం భోజనపథకం అమలుపై అవగాహన కల్పించారు.
డెయిరీ సామర్థ్యం పెంచాలి
కరీంనగర్ డెయిరీ ప్రతిరోజు లక్ష లీటర్ల పాల ను ఉత్పత్తి చేస్తోందని, ఆ పాలు ఇక్కడే సరిపోతాయని, మరో లక్ష లీటర్ల సామర్థ్యం పెంపునకు ప్రోత్సహించాలని ఎంపీ వినోద్‌కుమార్ ప్రభుత్వాన్ని కోరారు. వ్యవసాయంతో పాటు పశుసంపద అభివృద్ధికి కృషిచేయాలన్నారు. ప్రస్తుతం కూరగాయలు పండించే గ్రామాలకే పాలీహౌస్‌లు వర్తింపజేయాలని తెలిపారు. జెడ్పీ హాలు ఆధునికీకరణకు సహకరిస్తానన్నారు. సమావేశంలో ఎమ్మెల్యేలు పుట్టమధు, బొడిగె శోభ, కల్వకుంట్ల విద్యాసాగర్, దాసరి మనోహర్‌రెడ్డి, ఎమ్మెల్సీలు టి.భానుప్రసాద్, పాతూరి సుధాకర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
మంత్రిగారూ.. మా విన్నపం వినుడు
Published Wed, Dec 31 2014 2:14 AM | Last Updated on Sat, Sep 2 2017 6:59 PM
Advertisement