
సాక్షి, మహబూబాబాద్ రూరల్: జూబ్లీహిల్స్‌లోని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో ఇటీవల జరిగిన చోరీ కేసులో పోలీసుల దర్యాప్తు ముమ్మరమైంది. బంజారాహిల్స్ పోలీసులు శనివారం రాత్రి మహబూబాబాద్ జిల్లాలోని డోర్నకల్, మహబూబాబాద్ ప్రాంతాల్లో విచారణ కొనసాగించారు. డోర్నకల్ మండలం చిలుకోడు శివారు ఫకీరా తండాకు చెందిన ఆటో డ్రైవర్ బానోతు రమేష్ భార్య సుశీల అలియాస్ సుజాత కొంతకాలం క్రితం భర్తతో గొడవపెట్టుకొని హైదరాబాద్ వెళ్లింది. అక్కడ బంధువుల ఇంట్లో ఉన్న ఆమె.. జూబ్లీహిల్స్‌లోని సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ ఇంట్లో పనికి కుదిరింది. వారం క్రితం ఆమె ఎవరికీ చెప్పకుండా పని మానేసింది.
ఆమె కోసం ఎంత వెతికినా దొరకకపోవడంతోపాటు ఇంట్లో 30 తులాల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు లక్ష్మీనారాయణ కుటుంబ సభ్యులు గుర్తించారు. వెంటనే బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సుశీల కోసం గాలింపు చేపట్టారు. ఆమె ఫకీరా తండాలో ఉన్నట్లు గుర్తించిన బంజరాహిల్స్ ఎస్సై నర్సింహారావు మహబూబాబాద్ డీఎస్పీకి సమాచారమిచ్చి ఓ మహిళా కానిస్టేబుల్, ఓ పురుష కానిస్టేబుల్‌తో శనివారం రాత్రి అక్కడికి వెళ్లారు. చిలుకోడు సర్పంచ్ గుగులోతు కిషన్‌సాధు సహకారంతో సుజాతను అదుపులోకి తీసుకున్నారు. ఆమెను విచారించగా మహబూబాబాద్‌లోని ఓ జ్యూవెలరీ షాపులో రూ.10వేలకు బంగారు నగలను అమ్మినట్లు తెలిపింది. దాంతో వారు ఆమెతో కలిసి అర్ధరాత్రి సమయంలో మహబూబాబాద్ వచ్చారు. ఆమె చెప్పిన షాపు వద్దకు పోలీసులు వెళ్లగానే స్థానికులు గుమికూడి షాపు నిర్వాహకుడు దొంగ బంగారం కొనే వాడు కాదని స్పష్టం చేశారు. దీంతో సుజాత చెప్పిన మేరకు అడిగేందుకు మాత్రమే వచ్చామని పోలీసులు వారికి చెప్పారు. ప్రజలు గుమిగూడడంతో అటుగా వెళ్తున్న మహబూబాబాద్ జిల్లా అడిషనల్ ఎస్పీ రావుల గిరిధర్ ఆగి విషయం తెలుసుకున్నారు. అనంతరం బంజారాహిల్స్ పోలీసులు సుజాతను హైదరాబాద్ తీసుకెళ్లి విచారిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment