
సాక్షి, ముస్తాబాద్(సిరిసిల్ల): ఓ ప్రేమ కథ.. మూడు రాష్ట్రాల పోలీసులకు సవాల్‌గా మారింది. దాదాపు పదినెలలుగా జంటకోసం వారు పడరాని పాట్లు పడ్డారు. మసీదులో ముస్లిం పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పే ఓ గురువు.. సమీపంలోని యువతిని ప్రేమించాడు. వివాహం చేసుకునేందుకు మూడు రాష్ట్రాలు దాటించి వచ్చి రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో కాపురం పెట్టాడు. ‘సెల్‌ఫోన్’ ఆధారంగా ఉత్తరప్రదేశ్ పోలీసులు శుక్రవారం అదుపులోకి తీసుకున్నారు.
ఎస్సై రాజశేఖర్ కథనం ప్రకారం.. జార్ఖండ్ రాష్ట్రానికి చెందిన సాజీద్ ఉత్తరప్రదేశ్‌లోని ఆస్రాత్ జిల్లా కేంద్రంలోని మసీదులో పిల్లలకు ఖురాన్ పఠించడం, ఉర్దూ బోధించడం చేస్తున్నాడు. ఈక్రమంలో మసీదు సమీపంలో ఉండే యువతి రబియాను ప్రేమించాడు. ఆమె తల్లిదండ్రులు వీరి వివాహానికి అంగీకరించలేదు. దీంతో గతేడాది డిసెంబర్ 21న రబీయాను తీసుకుని సాజీద్ పరారయ్యాడు. తర్వాత రబీయాను వివాహం చేసుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండలం నామాపూర్ మజీద్‌కు వచ్చాడు. ఇక్కడ ఎనిమిది నెలలుగా ఖురాన్, ఉర్దూ బోధిస్తున్నాడు. తన కూతురును కిడ్నాప్ చేశాడని సాజీద్‌పై రబియా తండ్రి ఉత్తరప్రదేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
అస్రాత్‌శాకసాని పోలీస్‌స్టేషన్‌లో ఎస్సై శాంతిచరణ్ యాదవ్.. సాజీద్‌పై కిడ్నాప్ కేసు నమోదు చేశారు. నిందితుడి కోసం పదినెలలుగా గాలిస్తున్నారు. గత ఫిబ్రవరి నుంచి సాజిద్ నామాపూర్‌లోనే ఇక్కడే ఉంటున్నాడు. సాజీద్, రబియా ఆచూకీ కోసం తీవ్రం గా శ్రమిస్తున్న అక్కడి పోలీసులకు రబియా వినియోగిస్తున్న సెల్‌ఫోన్ ఆధారంగా ఆచూకీ లభించింది. తల్లిదండ్రులతో రబియా ఫోన్‌లో మాట్లాడుతుండగా.. ఎస్సై శాంతిచరణ్‌యాదవ్ ట్రాప్ చేశారు. దీనిద్వారా రబియా, సాజీద్ తెలంగాణలోని నామాపూర్‌లో ఉన్నట్లు గుర్తించారు. ముస్తాబాద్ ఎస్సై రాజశేఖర్ సహకారంతో శుక్రవారం నామాపూర్ గ్రామానికి చేరుకున్నారు. ఆ సమయంలో రబియా, సాజీద్ ముస్తాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఉన్నారు. ఫోన్ ద్వారా ఆ సమాచారం తెలుసుకున్న ఎస్సైలు.. అక్కడికి చేరుకున్నారు. అక్కడే రబి యా, సాజీద్‌కు కౌన్సెలింగ్ చేసి అదుపులోకి తీసుకున్నారు. ఎస్సై శాంతిచరణ్, రబియా తండ్రి ఆ జంటను తమ వెంట ఉత్తరప్రదేశ్‌కు తీసుకెళ్లారు.
Comments
Please login to add a commentAdd a comment