వరంగల్ : పర్వతగిరి మండలంలోని కల్లెడ శివారు కొత్త తండాలోని గుడుంబా స్థావరాలపై పోలీసులు శుక్రవారం తెల్లవారు జామున దాడి చేశారు. ఈ దాడుల్లో 1000 లీటర్ల బెల్లం పానకాన్ని ధ్వంసం చేశారు. రెండు వందల లీటర్ల నాటు సారాను పట్టుకున్నారు. ఐదుగురిపై కేసు నమోదు చేశారు. కొత్తతండాలోని పొలాల్లో, గుట్టల మధ్య ఉన్న గుడుంబా తయారీ కేంద్రాలపై దాడులు చేయడానికి పోలీసు తీవ్రంగా కృషి చేశారు.
ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ.. గ్రామీణ ప్రాంతాల్లో గుడుంబాకు యువకులు బానిసై చనిపోతున్నారని తెలిపారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు కల్లెడ గ్రామ పంచాయతీ సహకారంతో సర్పంచ్ చొరవతో గుడుంబాపై యుద్ధం చేస్తున్నట్లు తెలిపారు. గుడుంబా నియంత్రణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన పిలుపు నిచ్చారు. కల్లెడ గ్రామ సర్పంచ్ చినపాక శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్సైజ్ అధికారులకు పలు మార్లు విజ్ఞప్తి చేసినా పట్టించుకోలేదన్నారు. గుడుంబాను అమ్మేవారు, తయారుచేసేవారు ఆ వృత్తి మానేస్తే వారికి ఉపాధి హామీ పథకం కింద పని కల్పిస్తామని హామీ ఇచ్చారు.