
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ముందస్తు ఎన్నికల నేపథ్యంలో ఆగమేఘాల మీద ఐపీఎస్ అధికారుల నుంచి ఎస్సై స్థాయి అధికారుల వరకు భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. ఇంత చేసినా..ఇప్పటివరకు అధికారులు తమ బదిలీ స్థానాలకు చేరుకోలేదు. రాష్ట్రంలో వివిధ జిల్లాలకు, జిల్లాల నుంచి హైదరాబాద్ కమిషనరేట్‌కు బదిలీ అయిన ఐపీఎస్ అధికారులు ఇంతవరకు రిపోర్టు చేయలేదు. దీనిపై పోలీస్ శాఖ స్పందిస్తూ..గణేశ్ నిమజ్జనం కారణంగానే అధికారులు తమ బదిలీ స్థానాలకు చేరుకోలేదని స్పష్టం చేసింది.
హైదరాబాద్ కమిషనరేట్‌లో పనిచేస్తున్న ఏ ఒక్క అధికారిని గణేశ్ నిమజ్జనం పూర్తయ్యే వరకు రిలీవ్ చేయవద్దని ఆదేశాలు అందాయని కమిషనరేట్ వర్గాలు తెలిపాయి. శాంతి భద్రతల పర్యవేక్షణ, రూట్‌మ్యాప్ సమన్వయంపై ప్రస్తుతమున్న అధికారులకు అవగాహన ఉందని, కొత్తగా వచ్చే అధికారులకు కొంత సమయం పడుతుందని ఓ సీనియర్ ఐపీఎస్ అధికారి తెలిపారు. గణేశ్ నిమజ్జనం తర్వాత బదిలీలు చేస్తే బాగుండేది కదా అని సదరు అధికారిని ప్రశ్నించగా, ఎన్నికల కోడ్ వస్తే ఇబ్బందికరంగా ఉంటుందని..అందుకే ముందుగా బదిలీలు చేపట్టినట్లు వెల్లడించారు. కాగా, కొత్త స్థానానికి వెళ్లేందుకు అధికారులు అయిష్టతను ప్రదర్శిస్తున్నట్లు సర్వత్రా చర్చ జరుగుతోంది.
Comments
Please login to add a commentAdd a comment