ఖమ్మం కలెక్టరేట్: సార్వత్రిక ఎన్నికల అనంతరం వివిధ శాఖల బదిలీల్లో రాజకీయ జోక్యం మితిమీరింది. ఇప్పటికే ఎంపీడీ ఓల బదిలీలు పూర్తయ్యాయి. రెవెన్యూలో బదిలీలకు రాజకీయ రంగు పులుముకుంది. రెవెన్యూలో పోస్టింగులకు పైరవీలు జోరుగా సాగుతున్నాయి. నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు తహశీల్దారులు పెద్దఎత్తున లాబీయింగ్‌కు తెర తీశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో రెవెన్యూ, పంచాయతీరాజ్, పోలీస్ శాఖలలో సాధారణ బదిలీలు పెద్దఎత్తున జరిగాయి. ఎన్నికలు పూర్తవడంతో తమను యథాస్థానాలకు పంపాలని వీరు తమ ఉన్నతాధికారులను కోరారు.
ఈ నేపథ్యంలో, పంచాయతీరాజ్ శాఖలో యథాస్థానాల్లో పోస్టింగ్ ఇస్తూ ఆ శాఖ కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో, ఆ శాఖలో బదిలీల ప్రక్రియ ప్రశాంతంగా ముగిసింది. రెవెన్యూ శాఖలో బదిలీలకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తో పైరవీల జాతరకు తెర లేచింది. అనువైన చోటుకు, నియోజకవర్గ కేంద్రాలకు వచ్చేందుకు తహశీల్దారులు పోటీ పడుతున్నారు. వారు ఇప్పటికే రాజకీయ నాయకులను ఆశ్రయించారు. జిల్లా నుంచి 31మంది తహశీల్దారులు ఇతర జిల్లాలకు వెళ్తుండటంతో నచ్చిన చోట పోస్టింగ్ కోసం రాజకీయ నేతల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు.
పోస్టుకు రూ.15లక్షలు..
రెవెన్యూ శాఖలో దగ్గర మండలాలు, నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టింగ్ దక్కించుకునేందుకు తహశీల్దారులు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. తాము కోరుకున్న చోట పోస్టింగ్ ఇప్పిస్తే 15 నుంచి 20 లక్షల రూపాయల వరకు ముట్టజెబుతామని బాహాటంగాగానే ప్రకటిస్తున్నారు.
రంగంలోకి దళారులు ..
రాజకీయ నేతల అనుచరులు దళారుల అవతారమెత్తారు. ఎక్కడ పోస్టింగ్ కావాలన్నా ఇప్పిస్తామని, భారీ మొత్తంలో ఖర్చవుతుందని చెబుతున్నారు. గతంలో జిల్లాలో పనిచేసి ఎన్నికల బదిలీల్లో బాగంగా 38 మంది ఇతర జిల్లాలకు వెళ్లారు. వారిలో 31 మంది జిల్లాకు వచ్చేందుకు ప్రభుత్వం అనుమతినిచ్చింది. గతంలో ఇక్కడ పనిచేసిన వారు ఖమ్మం చుట్టుపక్కల పోస్టింగ్ దక్కించుకునేందుకు పోటీపడుతున్నారు. వీరికి దళారులు వల వేస్తున్నారు.
డిమాండున్న మండలాలు ఇవే...
ఆర్థిక వనరులు ఎక్కువగాగల మండలాలకు వెళ్లేందుకు తహశీల్దారులు ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఖమ్మం అర్బన్, ఖమ్మం రూరల్, నేలకొండపల్లి, కొణిజర్ల, మధిర, వైరా, సత్తుపల్లి, కొత్తగూడెం, భద్రాచలం, పాల్వంచ, అశ్వారావుపేట, కూసుమంచి వెళ్లేందుకు తహశీల్దారులు తహతహలాడుతున్నారు. జిల్లాలో పనిచేస్తున్న కొందరు ఇక్కడే ఉండేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. రెండు మూడు రోజుల్లో పోస్టింగ్ ఉత్తర్వులు వస్తాయనే ప్రకటనలతో హైదరాబాద్ స్థాయిలో జిల్లా అధికారుల పై ఒత్తిడి తెస్తున్నారు.
రెవెన్యూ బదిలీల్లో రాజకీయ రంగు
Published Sat, Jun 14 2014 4:28 AM | Last Updated on Sat, Jul 6 2019 1:14 PM
Advertisement
Advertisement