రాజకీయ పార్టీల అండదండలు.. అధికారుల సహకారం కబ్జాదారులు ప్రభుత్వ భూమిని యథేచ్ఛగా కబ్జాకు పాల్పడుతున్నారు. ఖాళీ జాగా కనిపిస్తే చాలు నకిలీ పత్రాలు సృష్టించడం.. ఆపై దర్జాగా పాగా వేయడం.. అనంతరం వెంచర్ల పేరిట వీటిని విక్రయించడం జరిగిపోతోంది. ఎవరైనా అడ్డు చెబితే బెదిరింపులకు పాల్పడటం పరిపాటి గా మారుతోంది.
- మెదక్ టౌన్
పట్టణ శివారులో మెదక్ - రామాయంపేట ప్రధాన రహదారి పక్కన 1983లో 30 ఎకరాల విస్తీర్ణంలో ఆంధ్రప్రదేశ్ గురుకుల బాలికల పాఠశాలను నిర్మించారు. ఎంతో ఘన చరిత్ర గల బాలికల గురుకుల పాఠశాల భూమికే ఎసరు పెట్టారు భూ బకాసురులు. రెవెన్యూ, సబ్ రిజిస్టర్, మున్సిపల్ తదితర కార్యాలయాల అధికారుల అండదండలు పుష్కలంగా ఉండడంతో కొంతమంది సిండికేట్‌గా మారి దోపిడీకి పాల్పడుతూ పబ్బం గడుపుకుంటున్నారు.
గురుకుల పాఠశాలకు సంబంధించి పట్టణ శివారులోని సర్వే నంబర్ 248/1లో 23.10 ఎకరాలు, 246/2లో 1.22 ఎకరాలు, 248/312లో 1.37 ఎకరాలు, 248/492లో 3.11 ఎకరాలు మొత్తం కలిసి 28.8 ఎకరాల భూమి ఉన్నట్లు పాఠశాల రికార్డులున్నాయి. అయితే ఇందులో నుంచి వెలుగు పాఠశాలకు సర్వేనంబర్ 248/1లో 10 ఎకరాలు, కస్తూర్బా గాంధీ పాఠశాలకు 248/1లో ఒక ఎకర స్థలాన్ని కేటాయించారు. బాలికల గురుకుల పాఠశాల క్యాంపస్ కోసం సర్వే నంబర్ 248/1లో 12.05 ఎకరాలు, మరో సర్వే నంబర్‌లోని ఐదు ఎకరాల స్థలాన్ని గురుకుల బాలికల పాఠశాల నిర్మాణాలకు ఇచ్చా రు. కాగా మిగిలిన ఖాళీ స్థలంలో మొద ట ఐదెకరాలపై కబ్జాదారుల కన్ను పడింది. విద్యార్థుల తాగునీటి కోసం పాఠశాలకు చెందిన స్థలంలో వేసిన బోరు మోటార్‌ను సైతం పగులగొట్టి ఆక్రమణదారులు కడీలు పాతి వెంచర్‌కు సిద్ధం చేశారు.
సిండికేట్ దోపిడీ
మెదక్ పట్టణంలోని అన్ని రాజకీయ పార్టీల ఖద్దరు నేతలు ఒక సిండికేట్‌గా ఏర్పడి భూ బాగోతాలను నడిపిస్తున్నట్లు ఆరోపణలున్నాయి. దీనికి అధికారుల అండదండలు తోడవ్వడంతో వీరి ఆగడాలకు అంతేలేకుండా పోతుంది. మెదక్ పట్టణంలో భూముల కొనుగోళ్లు, అమ్మకాలు, వెంచర్లు, కబ్జాలన్నీ వీరి కనుసన్నల్లోనే జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే గురుకుల బాలికల పాఠశాలకు కేటాయించిన భూమిలో సుమారు ఐదు ఎకరాల వరకు నకిలీ డాక్యుమెంట్లు సృష్టించి కబ్జాకు పాల్పడినట్లు స్పష్టమవుతోంది.
కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లిన ప్రిన్సిపాల్
సంగారెడ్డిలో కలెక్టర్ రాహుల్ బొజ్జా ఆధ్వర్యంలో బుధవారం జరిగిన ప్రధానోపాధ్యాయుల సమీక్ష సమావేశంలో పై విషయాన్ని గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ రమణమ్మ కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై స్పందించిన కలెక్టర్ వెంటనే విచారణ జరిపించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.
ఖద్దరు నేతల సిండికేట్
Published Fri, Nov 28 2014 11:24 PM | Last Updated on Sat, Sep 2 2017 5:17 PM
Advertisement
Advertisement