
'అందుకే రెండు రోజుల నిరాహార దీక్ష'
హైదరాబాద్ : జిల్లాల పునర్ వ్యవస్థీకరణ అశాస్త్రీయంగా ఉందని మాజీ మంత్రులు పొన్నల లక్ష్మయ్య, డీకే అరుణ ఆరోపించారు. శనివారం ఇందిరాపార్క్ వద్ద రెండు రోజులు నిరాహార దీక్షను వారు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... అఖిలపక్ష భేటీలో కాంగ్రెస్ లేవనెత్తిన అభ్యంతరాలకు టీఆర్ఎస్ ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు సమాధానం రాలేదని విమర్శించారు. అందుకే రెండు రోజుల నిరాహార దీక్ష చేపట్టామని వారు స్పష్టం చేశారు. రాజకీయ లబ్ధి కోసం కొత్త జిల్లాల ఏర్పాటు తగదని వారు అభిప్రాయపడ్డారు.
ఎన్నికల హామీ మేరకు జనగామ జిల్లాను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. ఇష్టానుసారంగా జిల్లాల విభజన వల్లే ప్రజల నుంచి నిరసనలు వస్తున్నాయని పొన్నాల విమర్శించారు. గద్వాల్ జిల్లా కోసం రెండు నెలలుగా పోరాడుతున్నామని ఈ సందర్భంగా డీకే అరుణ గుర్తు చేశారు. ఇప్పటికైనా సానుకూలంగా స్పందించాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.