కరీంనగర్‌పై కాంగ్రెస్‌ జెండా | Ponnam Prabhakar Comments On TRS Party | Sakshi
Sakshi News home page

కరీంనగర్‌పై కాంగ్రెస్‌ జెండా

Published Wed, Oct 17 2018 8:21 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Ponnam Prabhakar Comments On TRS Party - Sakshi

మాట్లాడుతున్న పొన్నం ప్రభాకర్‌

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: వచ్చే ఎన్నికల్లో కరీంనగర్‌పై కాంగ్రెస్‌ జెం డా ఎగురుతుందని, అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని ఆశీర్వదిస్తే కరీంనగర్‌ను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి చూపిస్తామని టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. ఇప్పటికే ఈ నియోజకవర్గంలో ఇద్దరు అభ్యర్థుల్లో ఒకరు డ బ్బుతో.. ఇంకొకరు మతపరమైన నినాదాలతో ప్రజలను మభ్యపెట్టాలని చూస్తున్నారన్నారు. కాంగ్రెస్‌ పార్టీ మాత్రం డబ్బులిచ్చి ఓట్లను కొనుక్కోవడం లేదని, మతపరమైన విద్వేషాలు రేపి ఓట్ల కోసం ప్రజల వద్దకు వెళ్లడం లేదని అన్నారు. ముందస్తు ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విజయం ఖాయమన్నారు. మంగళవారం కరీంనగర్‌లోని డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పొన్నం ప్రభాకర్‌ మాట్లాడారు.

టీఆర్‌ఎస్‌లో అధికారంలోకి వచ్చాక కరీంనగర్‌లో అభివృద్ధి కుంటుపడిందని, టీఆర్‌ఎస్‌ నాలుగేళ్ల పాలనలో కరీంనగర్‌ అన్ని రంగాల్లో వెనక్కి నెట్టి వేయబడిందన్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాను ఏడు ముక్కలు చేసి భౌగోళికంగా కళావిహీనం చేశారన్నారు. కరీంనగర్‌ చరిత్రను నాశనం చేసి ఎక్కడానికి ఎలగందల్, దూకడానికి మానేరు తప్ప ఏమీ మిగిల్చలేదన్నారు. 2014 టీఆర్‌ఎస్‌ మేనిఫెస్టోలో ఉన్న డబుల్‌ బెడ్‌ రూం ఇళ్లు ఎవరికీ కట్టించలేదని, దళితులకు మూడెకరాల భూమి అందని ద్రాక్షగానే మిగిలిందని, కేజీ టూ పీజీ ద్వారా ఎవరికి లాభం చేకూరలేదని, రైతులకు రుణమాఫీ కాలేదని, కొత్తగా పాఠశాలలేమి తీసుకురాలేదని పొన్నం ప్రభాకర్‌ అన్నారు. కరీంనగర్‌కు మెడికల్‌ కళాశాల కూడా తీసుకురాలేదని, తాము తెచ్చిన శాతవాహన యూనివర్సిటీకి కనీస ం వీసీని కూడా నియమించలేదన్నారు.

పారిశ్రామిక రంగంలో అభివృద్ధి శూన్యమని, కరీంనగర్‌కు నాలుగేళ్లలో ఒక పరిశ్రమ కూడా రాలేదని, కొత్త రేషన్‌కార్డులు కూడా ఇవ్వలేదని, అధికారంలోకి వస్తే మండల కేంద్రంలో 30 పడకల ఆసుపత్రులు కట్టిస్తామని మాట తప్పారన్నారు. కరీంనగర్‌ను లండన్‌గా మార్చుతామని ముక్కలు చేసి చూపించారన్నారు. గతంలో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలో ఉన్న అంశాలను అధికారంలోకి వచ్చాక అమలు చేసి చూపించామని, ఇప్పుడు కూడా 2018లో కాంగ్రెస్‌ మేనిఫెస్టోలను ఖచ్చితంగా అమలు చేస్తామన్నారు.

అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరమే 10 లక్షల ఇళ్లు నిర్మాణం, 5 లక్షల ఆరోగ్యశ్రీ, నిరుద్యోగలకు భృతి, మహిళా సంఘాలకు లక్ష రూపాయల రాయితీ, పింఛన్లు 58 ఏళ్ల నుంచే రెండు వేల రూపాయలు, సంవత్సానికి ఉచితంగా ఆరు సిలిండర్లు, సన్నబియ్యం ఒక్కరికి ఏడు కిలోలు, ఎస్సీ, ఎస్టీలకు 200 యూనిట్లు ఉచితం, రైతులకు 2 లక్షల రుణమాఫీ కల్పిస్తామని చెప్పారు. కరీంనగర్‌ అభివృద్ధికి పాటుపడే కాంగ్రెస్‌ను గెలిపించాలని, వివిధ రంగాల్లోని నిపుణులతో కమిటీ వేసి అభివృద్ధి చేస్తామన్నారు.

విద్యావంతులు ఆలోచించి రాజ్యాంగబద్ధమైన హక్కు అయిన ఓట్లతో గెలిచిన పదవి కేసీఆర్‌కు తృణప్రాయమైనప్పుడు అతనికి ఓటు ఎందుకు వేయడమో ఆలోచించాలని సూచించారు. రాష్ట్ర, కరీంనగర్‌ జిల్లా అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని కాంగ్రెస్‌కు ఓటు వేయాలని కోరారు. ‘అందుబాటులో ఉంటాం.. నీతిగా ఉంటాం..సమర్థవంతంగా ఉంటాం...’ ఇదే కాంగ్రెస్‌ పార్టీ స్లోగన్‌ అని.. దీంతోనే ముందుకు వెళ్తామని ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీకి పట్టం కట్టాలని పొన్నం ప్రభాకర్‌ కోరారు. టీఆర్‌ఎస్‌ పార్టీ నాయకులు ఓటమి భయంతో కాంగ్రెస్‌ పార్టీ కార్పొరేటర్లను తమ పార్టీలోకి లాగేందుకు కుట్ర చేస్తోందన్నారు.

పేరుకే స్మార్ట్‌సిటీ.. 
కరీంనగర్‌కు పేరుకే స్మార్ట్‌సిటీ వచ్చిందని, కానీ దాని దాఖలాలు ఎక్కడా కనిపించడం లేదని ఎమ్మెల్సీ టి.సంతోష్‌కుమార్‌ అన్నారు. మాజీ ఎమ్మెల్యే కమలాకర్‌ తమ వ్యాపారాలు అభివృద్ధి చేసుకున్నాడే కానీ కరీంనగర్‌ను అభివృద్ధి చేయలేదని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ జెండాను ఎగురవేస్తామన్నారు. చలిమెడ లక్ష్మీనర్సింహారావు మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ పార్టీ బలంగా ఉందని, నాయకులంతా ఐకమత్యంగా కలిసిమెలసి ఉన్నామన్నారు.

కాంగ్రెస్‌ పార్టీలో శాసన సభ అభ్యర్థి ఎవరనే అందరూ అనుకుంటున్నారు కానీ తామందరం కలిసి పొన్నం ప్రభాకర్‌ అభ్యర్థిగా ఉండాలని కోరుకుంటున్నామని, అందులో ఎలాంటి అపోహలు, అనుమానాలకు తావులేదన్నారు. టీఆర్‌ఎస్‌ నాయకులు నల్లనీరు ఇవ్వకపోతే ఓటు అడగమన్నారని, దానిని బట్టి చూస్తే  కరీంనగర్‌లో నీరు ఇవ్వలేదు కాబట్టి ఓటు హక్కు అడిగే అర్హత లేదన్నారు. సమావేశంలో మాజీ మేయర్‌ డి.శంకర్, టీపీసీసీ అధికార ప్రతినిధి గుగ్గిళ జయశ్రీ, నాయకులు కోమటిరెడ్డి నరేందర్‌రెడ్డి, కర్ర రాజశేఖర్, చాడగొండ బుచ్చిరెడ్డి, ఆమ ఆనంద్‌తోపాటు కాంగ్రెస్, అనుబంధ సంఘాల నాయకులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement