
సాక్షి, సిటీబ్యూరో: లాక్‌డౌన్‌లో తపాలా శాఖ సేవలు మరింత విస్తృతమయ్యాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పేదలకు అందిస్తున్న నగదు చేయూతను కూడా తపాలా శాఖ గమ్మం వద్దకు అందుబాటులోకి తెచ్చింది. రాష్ట్ర ఆహార భద్రత కార్డు కలిగిన పేదలకు నిత్యావసరాల కోసం బ్యాంకు ఖాతాల్లో రూ.1500 చొప్పున నగదు జమ చేసింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా నిరుపేదల జన్‌ధన్ ఖాతాలో రూ.500 చొప్పున నగదు వేసింది. బ్యాంక్ ఖాతాలో నగదు పడటంతో పేదలు వాటిని డ్రా చేసుకునేందుకు నానా తంటాలు పడుతున్నారు. బ్యాంకుల ముందు కనీసం సామాజిక దూరం పాటించకుండా బారులు తీరుతున్నారు. కాగా, తపాలా శాఖ తమ బ్యాంకింగ్ సేవల్లో భాగంగా వివిధ బ్యాంకులలోని నగదును ఇంటి గుమ్మం వద్దనే వినియోగదారులు డ్రా చేసుకునే విధంగా వెసులు బాటు కల్పించింది. మరోవైపు పోస్టాఫీసుకు వెళ్లి కూడా డ్రా చేసుకోవచ్చు. కేవలం బ్యాంకు ఖాతాతో అనుసంధానమైన ఆధార్ నెంబర్ ఆధారంగా వేలిముద్ర వేస్తే సరిపోతుంది. ఇక ఒక ప్రాంతంలో 50 మంది ఉంటే పోస్టాఫీస్‌కు వెళ్లి సమాచారం అందిస్తే చాలు. పోస్ట్‌మేన్ వారి వద్దకే వచ్చి ఆధార్ ఆధారంగా వేలిముద్ర తీసుకొని నగదు అందిస్తారు. హైదరాబాద్ మహానగరంలో రోజుకు రెండు నుంచి మూడు కోట్ల వరకు ఆధార్ అధారంగా నగదు అందిస్తున్నామని పోస్టల్ పేమెంట్ బ్యాంక్ అధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు.
మొబైల్ పోస్టాఫీసు సేవలు
లాక్‌డౌన్‌లో తపాలా శాఖ ప్రజలకు మొబైల్ పోస్టాఫీసుల ద్వారా సేవలందిస్తోంది. అత్యవసర సేవల్లో తపాలా శాఖ ఉండటంతో పూర్తి స్థాయిగా పనిచేస్తోంది. ఇంటి వద్దకు మొబైల్ పోస్టాఫీసు (మెయిల్ మోటార్ సర్వీస్) ద్వారా స్పీడ్ పోస్ట్ పార్శిల్, రిజిస్ట్రర్డ్ ఆర్టికల్, స్టాంప్ అమ్మకాలు, బ్యాంకు సేవలైన డిపాజిట్ విత్ డ్రా, ఖాతాల ప్రారంభం, ఆసరా పింఛన్ల సేవలందిస్తోంది.
రవాణా ద్వారా పార్సిల్స్ సేవలు
ఎయిర్‌కార్గో ద్వారా పార్సిల్ సేవలు అందుబాటులోకి తెచ్చారు. రవాణా ద్వారా వివిధ మందులు, శానిటైజర్లు, మాస్కులు, వెంటిలేటర్లు, వైద్య పరికరాల పార్సిల్స్, అదేవిధంగా మురికి వాడలకు, వలస కార్మిక శిబిరాలకు వస్తువులు, బియ్యం, ఆహార పదార్థాల పార్శిల్స్ చేరవేస్తోంది. తాజగా వివిధ మందుల పార్శిళ్లకు మంచి డిమాండ్ పెరిగింది. కేవలం మహా నగర పరిధిలో ప్రతి రోజు 500 నుంచి 600 తగ్గకుండా పార్శిల్స్ బుకింగ్ జరుగుతున్నట్లు పోస్టల్ అధికారి ఒకరు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment