అందని ఆసరా | Postal strike effect | Sakshi
Sakshi News home page

అందని ఆసరా

Published Fri, Mar 13 2015 12:39 AM | Last Updated on Tue, Sep 18 2018 8:19 PM

Postal strike effect

పోస్టల్ సమ్మె ఎఫెక్ట్  పండుటాకుల ఎదురుచూపు
 బీడీ కార్మికుల పింఛన్‌కు ‘కోడ్’ అడ్డంకి..

 
హన్మకొండ అర్బన్ : జిల్లాలో ‘ఆసరా’ డబ్బుల పంపిణీ జాప్యం అవుతోంది. ప్రతీనెలా ఒకటో తేదీన డబ్బుల పంపిణీ ప్రారంభం కావాల్సి ఉండగా.. ఈనెల ఇప్పటివరకు పంపిణీ కాలేదు. ప్రతీనెలా జాప్యం అవడం అనేది షరామామూలుగా మారింది. వృద్ధులు, వితంతువులు, వికలాంగులు ప్రతీనెలా మొదటివారంలో పింఛన్ డబ్బుల కోసం కేంద్రాల వద్దకు వచ్చి నిరీక్షించి  వెను తిరుగుతున్నారు. ఈ సారి ఆలస్యానికి పోస్టల్ సమ్మె కారణమైంది. ప్రస్తుతం పోస్టల్ ఉద్యోగులు సమ్మెలో ఉండటంవల్ల వారి ఖాతాల్లోకి డబ్బులు జమకాలేదు. జిల్లాలో ప్రస్తుతం 25 మండలాల్లో పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా ఖాతాలో డబ్బులు జమ అవుతున్నారుు. సమ్మె కారణంగా ఇంకా డబ్బులు జమకాలేదు.

బీడీ కార్మికులకు ‘కోడ్’ అడ్డంకి..

జిల్లాలో ప్రభుత్వం మార్చి నుంచి నూతనంగా మంజూరు ఇచ్చిన బీడీ కార్మికుల పింఛన్ల విషయంలో స్పష్టత రాలేదు. ఎన్నికల కోడ్ అమలులో ఉన్నందున కొత్త పింఛన్లు మంజూరు నిలిపివేసినట్లు సమాచారం. అయితే ఈ విషయంలో స్పష్టత కోసం జిల్లా అధికారులు ఎన్నికల కమిషన్‌కు లేఖ రాశారు. అక్కడి నుంచి అనుమతి వస్తే ఆ లస్యంగానైనా డబ్బులు మంజూరు చేసే అవకాశం ఉంది. ఎన్నికల సంఘం కొత్త పింఛన్ల మంజూరుకి సానుకూలం గా ఉండక పోవచ్చని అధికారులు భావిస్తున్నారు. ఒకవేళ అదే జరిగితే రెండు నెలల పింఛన్ కలిపి ఏప్రిల్‌లో వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ విషయంలో ఒకటి లేదా రెండు రోజుల్లో స్పష్టత రావచ్చు. తాజా లెక్కల ప్రకారం జిల్లాలో మొత్తం 20 వేల మంది వరకు బీడీ కార్మికులు ఉన్నట్లు లెక్కలు తేల్చారు. అయితే వీరిలో ఆసరా పెన్షన్ కుటంబాలు తీసేస్తే 8 వేల మంది వరకు పెన్షన్‌కు అర్హత ఉన్న బీడీ కార్మికులు ఉన్నట్లు అధికారులు లెక్కలు తేల్చారు. వీరికి ఒక్కోక్కరికి రూ.1000 చొప్పున పింఛన్ ఇవ్వాల్సి ఉంది.

3.86 లక్షల మంది

బీడీ కార్మికులు కాకుండా ఇప్పటివరకు 3.86 లక్షల పింఛన్‌దారులున్నారు. వీరికోసం ప్రభుత్వం ప్రతినెలా రూ.41.35 కోట్లు విడుదల చేస్తోంది. పింఛన్‌దారుల్లో వృ ద్ధాప్య 1,71, 756, వికలాంగ 48,932, వితంతు 1,49,618, చేనేత కార్మికుల పింఛన్లు 5,343, గీత కార్మికులు 10,494 ఉన్నారు.
 
 
పింఛన్ రాక అవస్థలు

మహబూబాబాద్ : నా పేరు జంగ వరమ్మ. మాది మహబూబాబాద్‌లోని కంకరబోడ్ కాలనీ. ఈరోజు వరకు కూడా సర్కారోళ్లు పింఛన్ ఇవ్వలేదు. పింఛనే ఆధారం. డబ్బులు వస్తేనే బీపీ, షుగర్ గోలీలు కొనుక్కోవాలి. అధికారులు ఏమి చెప్పడం లేదు. రోజు పింఛన్ ఇచ్చే సెంటర్‌కు వెళ్లి తిరిగివస్తున్నాం. సమాధానం చెప్పే వారుకూడా లేరు. ఆటో ఛార్జీలు వృథా అవుతున్నా యి. పింఛన్‌దారుల బాధను అర్థం చేసుకుని త్వరగా ఇచ్చేట్టుగా చూడాలి.
 
 డబ్బులు తొందరగా ఇవ్వాలె..

పోచమ్మమైదాన్ : నాపేరు లక్ష్మి. మాది వరంగల్ పట్టణంలోని కాశిబుగ్గ. నెలకు పది రోజులే పని దొరుకుతది. వచ్చే డబ్బులు కూడా మా రోగాలకే సరిపోతారుు. మా బాధలు అర్థం చేసుకుని కేసీఆర్ భృతి కింద నెలకు రూ.1000 ఇస్తామంటే సంతోషించాం. కానీ, ఆ డబ్బులు ఇంతవరకు రాలేదు. మండల, కార్పొరేషన్ కార్యాలయూల చుట్టూ తిరుగుతున్నాము. తొందరగా డబ్బులు ఇప్పించేట్టు చూడాలి.
 
పోస్టల్ సమ్మె వల్ల ఆలస్యం

 ప్రస్తుతం పోస్టల్ ఉద్యోగులు సమ్మెలో ఉన్నందున వారికి డబ్బులు ప్రభుత్వం నుంచి సకాలంలో అందలేదు. ప్రస్తుతం జిల్లాలో 25 మండలాల్ల్లో పింఛన్లు పోస్టాఫీస్ ద్వారా పంపిణీకి ఏర్పాట్లు చేశాం. మిగతావి పంచాయతీ కార్యదర్శుల ద్వారా ఇస్తున్నాం. ఒకటి, రెండు రోజుల్లో అందరికీ డబ్బులు అందుతాయి. పంపిణీ ప్రారంభమవుతుంది. కొడ్ వల్ల బీడీ కార్మికుల పింఛన్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.
 - వెంకటేశ్వర్‌రెడ్డి, డీఆర్‌డీఏ పీడీ
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement