వేగం పెరిగిన ‘మిషన్’
♦ 5 వేల చెరువుల్లో వంద శాతం పనులు
♦ నేటి నీతిఆయోగ్ సదస్సులో పవర్ పాయింట్ ప్రజెంటేషన్
సాక్షి, హైదరాబాద్: చెరువుల పునరుద్ధరణకు ఉద్దేశించిన ‘మిషన్ కాకతీయ’ పనుల్లో వేగం పుంజుకుంది. సమృధ్ధిగా వర్షాలు కురిసే నాటికి వీలైనన్ని చెరువులు సిద్ధంగా ఉంచే క్రమంలో పనులు జోరందుకున్నాయి. ఇప్పటికే మొదటి విడతలో చేపట్టిన 8వేలకు పైగా చెరువులకు గానూ, సుమారు 5 వేల చెరువుల్లో 100 శాతం పనులు పూర్తయ్యాయి. మిగతావి ఈ నెలాఖరు కు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టు కుంది. రెండో విడతలో మరో 8 వేలకు పైగా చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా, ఇందులో 6వేలకు పైగా టెండర్ల ప్రక్రియ ముగిసింది.
దేశ వ్యాప్తంగా పేరు తెచ్చుకున్న ‘మిషన్ కాకతీయ’ మంగళవారం జరిగే నీతి ఆయోగ్ సదస్సులో ప్రధాన అంశం కానుంది. దీనిపై సదస్సులో ప్రజెంటేషన్ ఇచ్చేందుకు నీటి పారుదల శాఖ సిద్ధమైంది. మొదటి విడతలో భాగంగా చేపట్టిన మిషన్‌లో మొత్తంగా 8,104 చెరువులకు పరిపాలనా అనుమతులు ఇవ్వగా అందులో 8,032 చెరువులను మాత్రమే చేపట్టగలాగారు. వాటిల్లో ఇప్పటివరకు రూ.957.87 కోట్ల విలువైన 4,735 చెరువుల పనులు వంద శాతం పూర్తయ్యాయి. మిగతావి ఈ నెలాఖరుకు పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం విధించింది. మొత్తంగా రూ.2 వేల కోట్లకు పైగా పనులు ఇప్పటికే నీటిపారుదల శాఖ పూర్తి చేసింది.
1,500 చెరువు పనులు షురూ...
మొదటి విడతలో మిగిలిన, రెండో విడతలో కొత్తగా తీసుకున్న లక్ష్యాలను కలిపి మొత్తంగా 10,113 చెరువులను ఈ విడతలో పునరుద్ధరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. ఇందులో ఇప్పటికే 8,368 చెరువులకు రూ.2,619 కోట్లతో పరిపాలనా అనుమతులు వచ్చాయి. వీటిల్లో 6,282 చెరువుల పనులకు టెండర్లు పిలవగా... 2,996 చెరువులకు ఒప్పందాలు కుదిరాయి. 1,500 చెరువుల పనులు ఆరంభమయ్యాయి. రోజుకు 500 చెరువుల చొప్పున పనులను ఆరంభించేలా నీటి పారుదల శాఖ చర్యలు తీసుకుంటోంది. దీనిపై ఇప్పటికే శాఖా మంత్రి టి.హరీశ్‌రావు అధికారులకు స్పష్టమైన ఆదేశాలిచ్చారు.