పవర్ స్ట్రోక్
- పడకేసిన పారిశ్రామిక రంగం
- కార్మికులకు ఉపాధి కరువు
- చిన్నతరహా పరిశ్రమలకు కోలుకోలేని దెబ్బ
- ఇప్పటికే సగం యూనిట్లు మూత
- గ్రేటర్‌లో రోజుకు రూ.150 కోట్ల నష్టం
ఒక ఇంటికి విద్యుత్ సరఫరా నిలిచిపోతే ఆ కుటుంబంలోని నలుగురైదుగురు సభ్యులు మాత్రమే ఇబ్బంది పడతారు. ఒక వీధికి కరెంట్ లేకపోతే పది, పన్నెండు ఇళ్ల వారు సమస్యలు ఎదుర్కొంటారు. అది కూడా పూర్తిగా వారి అవసరాలు తీర్చుకునేందుకే అవస్థలు పడాలి. కానీ ఒక పరిశ్రమకు విద్యుత్ నిలిచిపోతే... ఆ యాజమాన్యంపై ఆధారపడిన పదులు...వందల సంఖ్యలోని కార్మికులు... వారినే నమ్ముకున్న వేలాది మంది కుటుంబ సభ్యులు ఏకంగా రోడ్డున పడాల్సి వస్తుంది. వారానికి రెండు రోజులు పవర్ హాలీడే కారణంగా ప్రస్తుతం నగరంలోని అనేక మందికి ఇదే సమస్య ఎదురవుతోంది.
సాక్షి, సిటీబ్యూరో, కాటేదాన్,జీడిమెట్ల: జీడిమెట్ల ఎస్వీ కో ఆపరేటివ్ సొసైటీలోని ఆర్‌ఎస్ మాలిక్యూల్స్ పరిశ్రమ విద్యుత్ కోతల కారణంగా బ్యాంకు నుంచి తీసుకున్న రుణ వాయిదాలు చెల్లించలేక నష్టాల్లో కూరుకుపోయింది.విద్యుత్ సరఫరా సరిగా లేకపోవడంతో పరిశ్రమకు అర్డర్లు తగ్గాయి. వారానికి రెండు రోజులు పవర్‌హాలిడేతో విద్యుత్ లేక, జనరేటర్లతో పరిశ్రమను నడపలేక యాజమాన్యం చేతులె త్తేసింది. ఇటీవల వేరొకరికి లీజుకు ఇచ్చింది. కొత్తగా వచ్చిన యాజమాన్యం మీకు ఇక్కడ పనిలేదు అని చెప్పడంతో 25 మంది కార్మికులు ఒక్కసారిగా రోడ్డున పడ్డారు.
జీడిమెట్ల ఫేజ్-1లోని బీటా లాక్టమ్ ల్యాబ్స్ యూనియన్ బ్యాంకులో తీసుకున్న అప్పును చెల్లించకపోవడంతో అధికారులు ఈ పరిశ్రమను మూసివేసి, స్వాధీనం చేసుకున్నారు. దీనికి ప్రధాన కారణం విద్యుత్ సరఫరా లేక ఉత్పత్తి క్షీణించడమే.
ఎన్‌ఆర్‌ఆర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమ డీజిల్‌తో నడిపేందుకు నెలకు రూ.3 లక్షలు వెచ్చిస్తోంది. డీజిల్ ఖర్చు తడిసి మోపెడు కావడంతో బ్యాంకు లోన్లు చెల్లించలేక ఈ పరిశ్రమ దివాళా దిశగా ప్రయాణిస్తోంది.
ఇవీ గ్రేటర్ వ్యాప్తంగా పారిశ్రామిక వాడల్లో చిన్న, మధ్యతరహా, భారీ పరిశ్రమలు ఎదుర్కొంటున్న కరెంట్ కష్టాలకు కొన్ని ఉదాహరణలు. మహానగరంలో విద్యుత్ కోతలు, వారానికి రెండు రోజుల పాటు అమలు చేస్తున్న పవర్‌హాలిడే పారిశ్రామిక రంగంలో చీకట్లు నింపుతున్నాయి. కార్మికుల జీవితాల్లో వెలుగులు నింపాల్సిన విద్యుత్... వారి బతుకుల ను అంధకారంలోకి నెట్టేస్తోంది. దీనికి తోడు అనధికారిక కోతలతో చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోతున్నారు. ఒకవైపు బ్యాంకులకు వాయిదాలు చెల్లించలేక, కోతల వల్ల ఉత్పత్తులు మందగించి, అమ్మకాలు, కొనుగోళ్లు నిలిచిపోయి, అనేక మంది పరిశ్రమలను లీజుకు ఇచ్చేస్తున్నారు. కొందరు తాళాలు వేసేస్తున్నారు. వాటినే నమ్ముకున్న కార్మికులు ఉపాధి కోల్పోయి, రోడ్డున పడుతున్నారు. విద్యుత్ కోతలతో నగర పారిశ్రామిక రంగం రోజుకు రూ.150 కోట్ల మేర నష్టపోతున్నట్లు సమాచారం.
గుండె గు‘బిల్లు’
ప్లాస్టిక్, బోర్‌వెల్స్, మైనింగ్, డ్రిల్లింగ్, ప్యాకేజింగ్, టవర్స్, ఇంజినీరింగ్ వంటి పరిశ్రమలకు కేంద్రమైన చర్లపల్లిలో పెరిగిన విద్యుత్ బిల్లులతో చాలా వరకు మూతపడ్డాయి.
ఐదేళ్ల క్రితం రూ.25 వేల కరెంట్ బిల్లు చెల్లించిన వారు ఇప్పుడు రూ.లక్షకుపైగా చెల్లించాల్సి వస్తోంది. రూ 2.5 లక్షలు చెల్లించిన పరిశ్రమలపైన రూ. 5 లక్షలకు పైగా భారం పడింది.
150 హార్స్‌పవర్ విద్యుత్ వినియోగించే పరిశ్రమలను సైతం లోటెన్షన్ (ఎల్‌టీ) నుంచి హైటెన్షన్ (హెచ్‌టీ)కి మార్చడం వల్ల గతంలో ఒక కేవీఏకు రూ.150 చొప్పున చెల్లించిన వాళ్లు ఇప్పుడు రూ.350 చెల్లించాల్సి వస్తోంది.
సర్‌చార్జ్ సర్దుబాటు(ఎఫ్‌ఎస్‌ఏ) రూపంలోనూ పరిశ్రమలపై ప్రభుత్వం భారం మోపింది. నాచారంలో ఒకప్పుడు పెద్ద ఎత్తున ఆటో మొబైల్ సంబంధితవస్తువులను ఉత్పత్తి చేసి బెంగళూరుకు విక్రయించిన డ్రాగన్‌ఫోర్జ్ కంపెనీ యజమాని కేవలం విద్యుత్ సంక్షోభం కారణంగానే చేతులెత్తేశారు.
మల్లాపూర్, నాచారంల లోని వందలాది కెమికల్, ఇంజినీరింగ్, స్టీల్‌రోలింగ్, టెక్స్‌టైల్స్, ఫుడ్స్ పరిశ్రమల్లో విద్యుత్ సంక్షోభం కారణంగా దివాళా దిశగా నడుస్తున్నాయి.
రుణాలు చెల్లించలేక...
ఒకవైపు విద్యుత్ సంక్షోభం... మరోవైపు బ్యాంకులు నాన్ పెర్ఫార్మెన్స్ అకౌంట్ (ఎన్‌పీఏ) నోటీసుల పేరిట పరిశ్రమల యజమానులను బెంబేలెత్తిస్తున్నాయి. సాధారణంగా బ్యాంకు రుణాలపై 30 రోజులకు ఒకసారి వడ్డీ చెల్లించాలి. ఇలా చెల్లించ లేని పరిశ్రమలకు ఈ ఎన్‌పీఏ నోటీసులను జారీ చేస్తాయి. వరుసగా 3 సార్లు వడ్డీ చెల్లించకుండా నోటీసులు అందుకున్న పరిశ్రమలను స్వాధీనం చేసుకొనే అధికారం బ్యాంకులకు లభిస్తుంది. ప్రస్తుతం ఉన్న కోతలు, పెరిగిన చార్జీల దృష్ట్యా ఎన్‌పీఏను 90 నుంచి 120 రోజులకు పెంచాలని పరిశ్రమలు కోరుతున్నాయి.
డీజిల్‌కు డిమాండ్
విద్యుత్ కోతలతో గ్రేటర్‌లో డీజిల్ వినియోగం అనూహ్యంగా పెరుగుతోంది. మహానగర పరిధిలో ఉన్న 300 పెట్రోల్ బంకుల్లో నిత్యం 17 లక్షల లీటర్ల డీజిల్ విక్రయాలు జరుగుతుండగా.. కోతల వల్ల అది 20 లక్షల లీటర్లకు చేరింది. ముఖ్యంగా ఇండస్ట్రియల్ ఏరియాల్లో ఉన్న సుమారు వందకుపైగా బంకుల్లో డీజిల్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఆస్పత్రులు, సినిమా హాళ్లు, ఫార్మా పరిశ్రమలు, ప్రింటింగ్, హోటళ్లు, రెస్టారెంట్లు, ఇతర పరిశ్రమలు జనరేటర్ల పైనే ఆధారపడాల్సిన దుస్థితి తలెత్తింది.
30 శాతం యూనిట్లు మూత
జీడిమెట్ల, కుత్బులాలపూర్, గాజులరామారం, ఎలీప్ పారిశ్రామిక వాడల్లో 2500, చర్లపల్లిలోని ఐదు పారిశ్రామికవాడల్లో ఉన్న 851 పరిశ్రమల్లో 30 శాతం యూనిట్లు ఇప్పటికే మూతపడ్డాయి. మల్లాపూర్, నాచారం ప్రాంతాల్లోని 700 పరిశ్రమల్లో ఇప్పటికే వంద యూనిట్లు ఏదో ఒక కారణంతో మూతపడ్డాయి. పాతబస్తీలోని 60కి పైగా చిన్నతరహా పరిశ్రమలు భారంగా నడుస్తున్నాయి. ఉప్పల్‌లోని 200 పరిశ్రమల్లో 20 శాతానికిపైగా నష్టాల బాటలోనే నడుస్తున్నాయి. కాటేదాన్ పారిశ్రామికవాడలో రెండువేల పరిశ్రమల్లో సుమారు 300 మూతపడే స్థితిలో ఉన్నాయి.
కోతలతో నష్టపోతున్నాం
విద్యుత్ కోతలతో ప్రస్తుతం కార్మికుల వేతనాలు, కరెంట్ బిల్లులు చెల్లించడం కష్టతరంగా మారింది. దీనిని ఆసరాగా చేసుకుని గుజరాత్ వంటి రాష్ట్రాలు మన రాష్ట్రానికి ఉత్పత్తులను దిగుమతి చేస్తూ లాభాల బాటలో నడుస్తున్నాయి. ప్రభుత్వం విద్యుత్ కోతలను పూర్తిగా ఎత్తివేసి పరిశ్రమల నిర్వహణకు తోడ్పాటు నందించాల్సిన అవసరం ఉంది.
- శివకుమార్ గుప్తా, పారిశ్రామికవేత్త, కాటేదాన్
ఉపాధి పోయి రోడ్డున పడ్డా
నేను గత ఆరేళ్లుగా ఆర్‌ఎస్ మాలిక్యూల్స్ పరిశ్రమలో పని చేస్తున్నాను. నాకు నెలకు రూ.12 వేల జీతం వచ్చేది. ఒక్కసారిగా ప్రభుత్వం వారానికి రెండు రోజులు పరిశ్రమలకు విద్యుత్ నిలిపివేసింది. యాజమాన్యం జీతాలు చెల్లించలేకపోవడంతో మేం రోడ్డుపై పడ్డాం.
- మహమూద్, కార్మికుడు, జీడిమెట్ల
విధిలేక నడుపుతున్నాం
నాచారం పారిశ్రామికవాడలో సుమారు 500 పరిశ్రమలు ఉన్నాయి. విద్యుత్ కోతలతో ఇప్పటికే చాలా పరిశ్రమలు సంక్షోభంలో కూరుకునానయి. ఆర్డర్స్ రావడం లేదు. వచ్చిన వాటికి సకాలంలోఉత్పత్తులను అందించలేకపోతున్నాం. కార్మికులకు జీతాలు చెల్లించలేక, పరిశ్రమలను మూసుకోలేక విధిలేని పరిస్థితిలో తప్పనిసరై నడపాల్సి వస్తోంది.
- మహిపాల్‌రెడ్డి, నాచారం ఇండస్ట్రియల్ అసోసియేషన్ అధ్యక్షుడు