{పాజెక్టు కింద కోల్పోతున్న భూమికి పరిహారం!
నీటి పారుదల శాఖ నిర్ణయం
హైదరాబాద్: తెలంగాణలోని అత్యధిక జిల్లాల సాగునీటి అవసరాలను తీర్చే ప్రాణహిత-చేవెళ్ల ప్రాజెక్టు పనుల పురోగతిలో మరో ముందడుగు పడింది. ప్రాజెక్టు నిర్మాణంతో నష్టపోయే అటవీభూమికి సమానస్థాయిలో పరిహారంగా రెవెన్యూ భూమిని అందించాలని రాష్ట్ర నీటి పారుదల శాఖ నిర్ణయించింది. ఈ మేరకు నివేదికను రాష్ట్ర అటవీ శాఖకు అందజేసింది. అటవీ శాఖ దానిని పరిశీలించి కేంద్ర అటవీ, పర్యావరణ శాఖకు పంపనుంది. ఈ నివేదికకు కేంద్రం అంగీకారం తెలిపితే ప్రాజెక్టుకు జాతీయ హోదా వైపు కీలక అడుగు పడినట్లే. జాతీయ హోదాకు సంబంధించి 18 రకాల క్లియరెన్స్‌లు అవసరం ఉండగా, ఇప్పటికే 13 రకాల క్లియరెన్స్‌లు దక్కాయి. మరో 5 అంశాలకు సంబంధించి అధికారులు ముమ్మర కసరత్తు చేస్తున్నారు.
ఇందులో అటవీశాఖ అనుమతులు ముఖ్యమైనవి. ప్రాజెక్టు కింద కోల్పోతున్న 7,240 ఎకరాల అటవీ భూమికి పరిహారంగా భూమిని ప్రభుత్వం చూపించాల్సి ఉంటుంది. అటవీ భూమికి సమానవైన రెవెన్యూ భూమి కోసం అధికారులు సెప్టెంబర్ చివరి వారం నుంచే ఆయా జిల్లాల పరిధిలో సర్వే నిర్వహించారు. సుమారు 8 వేల ఎకరాల పరిహార భూమిని గుర్తించి రూపొందించిన నివేదికను రాష్ట్ర అటవీ ప్రధాన సంరక్షణ అధికారికి అందజేశారు. ఇప్పటికే ప్రాజెక్టు పరిధిలో ముంపునకు గురయ్యే గిరిజన గ్రామాల ప్రజల సమ్మతి తెలుపుతూ రాష్ట్ర గిరిజన సలహా మండలి తీర్మానం చేసి కేంద్రానికి పంపిన విషయం తెలిసిందే.
‘ప్రాణహిత’ పనుల్లో పురోగతి
Published Thu, Nov 20 2014 12:57 AM | Last Updated on Sat, Sep 2 2017 4:45 PM
Advertisement