ఎడ్లను అమ్ముకుని... | Premonmadi attack | Sakshi
Sakshi News home page

ఎడ్లను అమ్ముకుని...

Published Sun, Sep 6 2015 1:54 AM | Last Updated on Tue, Aug 21 2018 5:51 PM

ఎడ్లను అమ్ముకుని... - Sakshi

ఎడ్లను అమ్ముకుని...

 ప్రేమోన్మాది దాడిలో గాయపడిన సంధ్య కుటుంబం దీనగాథ
 
♦ ఆస్పత్రి ఖర్చుల కోసం జీవనాధారం విక్రయం
♦ తమ ఊరి నుంచి ఖమ్మంకు వెళ్లేందుకూ డబ్బులేని వైనం
♦ ఊరిలో అప్పు చేసి ఆస్పత్రికి వెళ్లిన కుటుంబసభ్యులు
♦ నిందితుడు శేఖర్‌ను అరెస్టు చేసిన పోలీసులు
 
 మంగపేట, ఇల్లందు : ప్రేమోన్మాది దాడిలో తీవ్రంగా గాయపడిన తమ కుమార్తె సంధ్యను రక్షించుకొనేందుకు ఆమె కుటుంబం జీవనాధారమైన ఎడ్లను అమ్ముకుంది. ఆ సొమ్మును తీసుకుని ఆస్పత్రికి వచ్చింది. తమ బిడ్డ పరిస్థితిని చూసి కన్నీరుమున్నీరవుతోంది. శుక్రవారం ఖమ్మం జిల్లా ఇల్లెందులో డిగ్రీ విద్యార్థిని సంధ్య తన ప్రేమను నిరాకరించిందనే కోపంతో శేఖర్ అనే యువకుడు లారీ కిందకు తోసేసిన సంగతి తెలిసిందే. ఆ ఘటనలో తీవ్రంగా గాయపడిన సంధ్యను ఖమ్మంలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. బాధితురాలు సంధ్య వరంగల్ జిల్లా మంగపేట మండలం బ్రాహ్మణపల్లి గ్రామానికి చెందిన బడి గోవిందరావు, చంద్రమ్మ దంపతుల కుమార్తె.

కనీసం వైద్యం చేయించలేని నిరుపేద గిరిజన కుటుంబం వారిది. తమ ఊరి నుంచి ఖమ్మం ఆస్పత్రికి వెళ్లేందుకు చార్జీలకు కూడా డబ్బు లేకపోవడంతో... తెలిసిన వారి వద్ద అప్పు చేశారు. కానీ ఆస్పత్రి ఖర్చుల కోసం డబ్బులేని పరిస్థితి. దీంతో సంధ్య బావ బొగ్గం సురేందర్ శనివారం తన రెండు ఎడ్లను రూ.30 వేలకు అమ్మేసి... ఆస్పత్రి ఖర్చులకోసం తీసుకువచ్చాడు. కాగా సంధ్యను లారీ కిందకు తోసేసిన శేఖర్‌ను శనివారం పోలీసులు అరెస్టు చేశారు. సంధ్యపై దాడికి పాల్పడినది జూలూరుపాడు మండలం సత్యనారాయణ గ్రామానికి చెందిన ఈసం శేఖర్ అని డీఎస్పీ వీరేశ్వర్‌రావు వెల్లడించారు. దాడికి పాల్పడ్డ అనంతరం శేఖర్ కొరగుట్ట అటవీ ప్రాంతంలోని రహదారుల మీదుగా కాలినడకన ఇల్లెందుకు చేరుకున్నాడని.. మళ్లీ అదేరోడ్డు ద్వారా ఆటోలో తన గ్రామానికి వెళ్లిపోయాడని చెప్పారు.
 
 ఎడ్లను అమ్ముకున్నాం..
 ఎన్నో ఆశలతో నా బిడ్డను పైచదువుల కోసం పంపాను. ఆమెను ఓ ప్రేమోన్మాది లారీ కిందకు తోసివేసినట్లు తెలిసి వణికిపోయాం. బిడ్డకు వైద్యం కోసం బిడ్డల్లాంటి ఎడ్లను అమ్ముకున్నాం. శేఖర్‌లాంటి రాక్షసుల్ని కఠినంగా శిక్షించాలి. ప్రేమ అంటూ ఆడపిల్లల వెంటపడే వారందరికీ అదొక హెచ్చరికలా ఉండాలి.      
 - బడి గోవిందయ్య, సంధ్య తండ్రి
 
 ఈ బాధ మరెవరికీ రావద్దు
 నేను ఖమ్మం డిగ్రీ కాలేజీలో బీజెడ్‌సీ ఫైనలియర్ చదువుతూ సెల్ఫ్ మేనేజ్‌డ్ హాస్టల్‌లో ఉంటున్నా. మూడేళ్లుగా క్లాస్‌మేట్ కృష్ణవేణి కూడా మా హాస్టల్‌లోనే ఉంటోంది. ఆమెకు వరుసకు తమ్ముడైన శేఖర్ అప్పుడప్పుడు హాస్టల్ వద్దకు వచ్చేవాడు. కొన్ని రోజులయ్యాక నన్ను ప్రేమిస్తున్నానని చెప్పాడు. నేను నిరాకరించా ను. తర్వాత చాలాకాలం అతను నాకు కనిపించలేదు. మళ్లీ రెండు నెలలుగా వెంటపడుతున్నాడు. శుక్రవారం కాలేజీ నుంచి హాస్టల్‌కు వెళుతుండగా శేఖర్ వచ్చాడు.

తనను ఎందు కు ప్రేమించడం లేదో చెప్పాలంటూ నా చేతుల్ని గట్టిగా పట్టుకున్నాడు. ఒక్కసారిగా కోపంతో నా చేతుల్ని విడిపించుకొని హాస్టల్ వైపు వెళుతున్నా. అంతే.. వెనకాలే వస్తున్న శేఖర్ నన్ను లారీ కిందకు తోసేశాడు. లారీ డ్రైవర్ అది చూసి వేగాన్ని తగ్గించాడు. లేకుంటే నేను ఆ లారీకిందే చనిపోయేదాన్ని. తలకు, ముఖానికి దెబ్బలు తగలడంతో షాక్‌లో స్పృహ తప్పిపడిపోయా.. ఇక అక్కడ ఏం జరిగిందో గుర్తులేదు. స్పృహలోకి వచ్చాక చూస్తే ఆస్పత్రిలో ఉన్నా. నాకు ఎదురైన ఇలాంటి భయంకరమైన సంఘటన మరెవరికీ రావద్దు. నన్ను చంపాలనుకున్న శేఖర్‌ను కఠినంగా శిక్షించాలి..
     - బాధితురాలు బడి సంధ్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement