విద్యార్థినులకు పంపిణీ చేయనున్న హెల్త్‌హైజీన్ కిట్లు
విద్యారణ్యపురి : విద్యార్థినుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన హెల్త్ హైజీన్ కిట్ల పంపిణీకి సర్వం సిద్ధమైంది. గత విద్యాసంవత్సరంలో కస్తూరిబాగాంధీ బాలికల విద్యాలయాల విద్యార్థినులకు, మోడల్ స్కూల్స్, రెసిడెన్షియల్ స్కూల్స్ విద్యార్థినులకు హెల్త్‌కిట్స్‌ను పంపిణీ చేసిన ప్రభుత్వం ఈ విద్యాసంవత్సరం (2018–2019)లో ప్రభుత్వ, జిల్లాపరిషత్, ఎయిడెడ్ యూపీఎస్, ఉన్నత పాఠశాలల్లోని విద్యార్థినులు, తెలంగాణ రెసిడెన్షియల్ స్కూల్స్‌లోని విద్యార్థినులకు కూడా కిట్లను పంపిణీ చేయనున్నారు.
ఈ మేరకు ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అన్ని మండల కేంద్రాలకు హెల్త్ హైజీన్ కిట్స్ చేరుకున్నాయి. ఆయా జిల్లాల విద్యాశాఖల అధికారులు ఈ పంపిణీ కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ కిట్లలో సానిటరీ న్యాప్‌కిన్స్‌తోపాటు మొత్తంగా 13 రకాల వస్తువులు ఉంటాయి. ఈ విద్యా సంవత్సరం ఆరంభంలోనే ఈ కిట్లు వస్తాయని భావించగా కొంత ఆలస్యం అయింది.
ఈ నెల 13నుంచి 15 వరకు ఆయా పాఠశాలల్లోని విద్యార్థినులకు పంపిణీ చేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని ఈ నెల 20కల్లా పూర్తి చేయాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు. ప్రభుత్వ , జిల్లాపరిషత్, ఎయిడెడ్ పాఠశాలల్లో 7 నుంచి 10తరగతి, మోడల్ స్కూల్స్‌లో 7 నుంచి 12 వతరగతి, పాత కేజీబీవీల్లో 6 నుంచి 10వ తరగతి, ఈ విద్యాసంవత్సరంలో ఇంటర్ వరకు అప్‌గ్రేడ్ అయిన కేజీబీవీల్లో 6 నుంచి ఇంటర్, టీఎస్‌ఆర్‌ఈఐఎస్‌లో 6 నుంచి 12 వతరగతి వరకు చదివే విద్యార్థినులకు ఈ కిట్స్‌ను అందజేయనున్నారు.
3 నెలలకు సరిపడా..
హెల్త్ హైజీన్ కిట్లలో ఒక్కో విద్యార్థినికీ 3 నెలలకు సరిపడా 13 రకాల వస్తువులను అందుబాటులో ఉంచారు. కిట్ బాక్స్‌లో 3 బాత్‌సోప్స్ (100 గ్రాముల చొప్పున) 3 క్లాత్‌వాష్ డిటర్జెంట్ సోపులు(100 గ్రాముల చొప్పున), ఒక షాంపో బాటిల్ (150 ఎంఎల్), 1 కోకోనట్ ఆయిల్ బాక్స్ (175 ఎంల్), 1 ఫేషియల్ ఫౌడర్ బాక్స్ (50 గ్రాములు), 1 టూత్‌బ్రష్, 1 టంగ్‌క్లీనర్, కోంబ్, టిక్లీస్ (75 నుంచి 90 వరకు), 2 నైలాన్ రిబ్బన్స్, 2 ఫ్యాబ్రిక్ ఎలాస్టిక్ హెయిర్‌బ్యాండ్స్, సానిటరీ న్యాప్‌కిన్స్ (మూడు పాకెట్లు) ఉన్నాయి. ఇలా ప్రతి మూడు నెలలకొకసారి విద్యార్థినులకు కిట్లు పంపిణీ చేస్తారు.
ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 63,069 మందికి పంపిణీ
ఉమ్మడి వరంగల్ జిల్లా పరిధిలోని ఐదు జిల్లాలో ప్రభుత్వ, జిల్లాపరిషత్, ఎయిడెడ్, కేజీబీవీ, మోడల్‌సూల్స్, టీఎస్‌ఐఈఆర్‌ఎస్‌లలో 63,069 మంది విద్యార్థినులకు ఈ కిట్లు అందించనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment