ఆద్యంతం ఆధ్యాత్మికం | President Pranab Mukherjee to visit Lakshminarasimha Swamy temple | Sakshi
Sakshi News home page

ఆద్యంతం ఆధ్యాత్మికం

Published Sun, Jul 5 2015 11:58 PM | Last Updated on Wed, Aug 8 2018 6:12 PM

ఆద్యంతం ఆధ్యాత్మికం - Sakshi

ఆద్యంతం ఆధ్యాత్మికం

 ప్రణబ్, గవర్నర్‌లకు ఘన స్వాగతం పలికిన సీఎం కేసీఆర్
 స్వామివారిని దర్శించుకుని పూజలు జరిపిన రాష్ర్టపతి
 లక్షపుష్పార్చన పూజలు నిర్వహించిన ఆర్చకులు
 రాష్ర్టపతికి పాదాభివందనం చేసి కృతజ్ఞతలు తెలిపిన సీఎం

 
 భారత ప్రథమ పౌరుడి యాదాద్రి పర్యటన..ఆద్యంతం భక్తిపారవశ్యం, కట్టదిట్టమైన భద్రత మధ్య సాగింది. భారత రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ వడాయిగూడెంలో హెలికాప్టర్ దిగింది మొదలు..లక్ష్మీనర్సింహస్వామివారి దర్శనం, పూజలు..తిరిగి వెళ్లేదాకా.. ఆధ్మాత్మిక వాతావరణం వెల్లివిరిసింది. యాదాద్రి ప్రాశస్థ్యాన్ని సీఎం కేసీఆర్ స్వయంగా రాష్ట్రపతికి పూసగుచ్చినట్లు వివరించారు. తెలంగాణ తిరుపతిగా మారబోతుండడం..ఇప్పటికే రూపొందించిన మాస్టర్‌ప్లాన్ పనులు మొదలుకావడం..ఈ నేపథ్యంలో రాష్ట్రపతి యాదగిరిగుట్టకు రావడంతో స్థానికులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు.
 
 భువనగిరి/యాదగిరిగుట్ట : యాదగిరీశుడిని భారత రాష్ర్టపతి ప్రణబ్‌ముఖర్జీ దర్శించు కున్నారు. యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనర్సింహస్వామి దేవస్థానం అభివృద్ధికి సీఎం కేసీఆర్ ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారు. దీనిలోభాగంగానే ఇక్కిడికి రాష్ర్టపతిని ఆహ్వానించారు. రాష్ర్టపతి వస్తున్న నేపథ్యంలో హరితహారం కార్యక్రమంలో ఉన్న  సీఎం హెలికాప్టర్‌లో ఉదయం 10.30 గంటలకు వడాయిగూడెం శివారులో హెలిపాడ్ వద్ద దిగారు. అక్కడే ప్రత్యేకంగా రాష్ర్టపతి కోసం ఏర్పాటు చేసి హెలిపాడ్ సమీపంలో వేచి ఉన్నారు. రాష్ర్టపతి భారత వైమానిక దళానికిచెందిన ప్రత్యేక హెలికాప్టర్‌లలో 11.22 గంటలకు వడాయిగూడెంలో రాష్ర్టపతి, గవర్నర్ నరసింహన్ దిగారు.
 
 సీఎం స్వయంగా వెళ్లి రాష్ట్రపతిని స్వాగతం పలికి ఆయన వాహనంలో 11.46 గంటలకు యాదగిరికొండపైన గల అండాళ్ గెస్ట్ హౌస్‌కు చేరుకున్నారు.  పది నిమిషాల అనంతరం రాష్ట్రపతి, గవర్నర్, సీఎంలు ఆలయంలోకి వచ్చారు. ఈ సందర్భంగా స్వామి అమ్మవార్లను దర్శించుకోవడంతో పాటు, ప్రభుత్వం యాదగిరి క్షేత్రాన్ని అభివృద్ధి చేయడానికి చేపట్టిన మాస్టర్ ప్లాన్‌ను సీఎం వివరించారు. దర్శనం, పూజల అనంతరం రాష్ర్టపతి, గవర్నర్‌లు తిరిగి అండాళ్ నిలయంలోకి వెళ్లగానే సీఎం కేసీఆర్ తిరిగి వడాయిగూడెం చేరుకున్నారు. గవర్నర్‌తో కలిసి  వచ్చిన రాష్ర్టపతికి సీఎం, మంత్రులు, జిల్లాకు చెందిన ఎంపీలు, ఎమ్యెల్యేలు, ఎమ్యెల్సీలు, వీడ్కోలు పలికారు. కలెక్టర్ సత్యానారాయణరెడ్డి, జేసీ సత్యనారాయణ, ఎస్పీ విక్రమ్ జిత్ దుగ్గల్, ఆర్డీవో మధుసూదన్, వివిధ ప్రభుత్వ శాఖల ఆధికారులు పాల్గొన్నారు.
 
 రెండుసార్లు సీఎం పాదాభివందనం
 సీఎం కేసీఆర్ రాష్ట్రపతికి రెండు సార్లు పాదాభివందనం చేశారు. హెలిపాడ్ వద్ద రాష్ట్రపతి హెలికాప్టర్ దిగగానే ఆహ్వానం పలికిన సమయంలో ఒకసారి, కొండపైన రాష్ట్రపతికి మెమొంటో ఇచ్చిన తర్వాత మరోసారి పాదాభివందనం చేసి తన కృతజ్ఞతలు తెలియజేశారు.
 
 ఆకట్టుకున్న హెలికాప్టర్‌లు
 త్రివిధ దళాలకు అధిపతి అయిన భారత రాష్ట్రపతి ప్రయాణించిన హెలిక్యాప్టర్‌ల కాన్యాయ్ ఎంతో ఆకట్టుకుంది. హైదరాబాద్‌నుంచి మూడు హెలికాప్టర్‌లు గగన మార్గానా ఇక్కడికి చేరుకున్నాయి. ముందుగా అధికారులు మూడు హెలిపాడ్‌లను సిద్ధం చేశారు. రాష్ట్రపతితో పాటు గవర్నర్ నరసింహన్, రాష్ట్రపతి కుమారుడు అభిజిత్ ముఖర్జీలు ఉన్నారు. మరో హెలికాప్టర్‌లో రాష్ట్రపతి భద్రతా సిబ్బంది ఉన్నారు. ముందుగా నిర్ణయించిన ప్రకారం ఏర్పాటు చేసిన కార్ల కాన్వాయ్‌లో రాష్ర్టపతితో సీఎం కే సీఆర్ వెళ్లారు. మరో వాహనంలో గవర్నర్ నరసింహన్, ఇతర ప్రజా ప్రతినిధులు వెళ్లారు. దర్శనానంతం రాష్ట్రపతితోపాటు, గవర్నర్  ఒకే వాహనంలో వచ్చారు. వారు హెలికాప్టర్‌లో హైదరాబాద్‌కు వెళ్లిపోయారు. రాష్ర్టపతి హెలికాప్టర్‌ల రాక స్థానికులను విశేషంగా ఆకట్టుకుంది.
 
 రాష్ట్రపతి రాకతో అడుగడుగునా ఆంక్షలు
 తుర్కపల్లి : రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ రాకతో యాదగిరిగుట్టకు వచ్చే దారులన్నీ పోలీసులు మూసివేశారు. ముఖ్యంగా వంగపల్లి, రాయగిరి నుంచి యాదగిరిగుట్టకు వచ్చేవాటితో పాటుగా తుర్కపల్లికి వెళ్లే వాహనాలను రెండు గంటల పాటు నిలిపివేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రపతికి స్వాగతం పలకడానికి గంట ముందు (10.30 గంటలకు) రావడంతో అప్పటి నుంచి పూర్తిగా ట్రాఫిక్ ఆంక్షాలు విధించారు. రాష్ట్రపతి కొండ మీదికి చేరుకున్న తరువాత బస్సులను వదిలారు. యాదిగిరిగుట్టలోని ప్రధాన రహదారికి  రెండు వైపులా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. రాష్ట్రపతి రాకతో భక్తులను అనుమతించకపోవడంతో ఆలయం పూర్తిగా నిర్మానుషంగా మారింది.
 
 హరితహారం విజయవంతం చేయాలి  : సీఎం కేసీఆర్
 భువనగిరి :  దేశ ప్రథమ పౌరుడు రా్రష్టపతి ప్రణబ్ ముఖర్జీ రాక సందర్భంగా సీఎం కేసీఆర్ ఆదివారం మూడు గంటల పాటు యాదగిరిగుట్టలో గడిపారు. ఈ సందర్భంగా హరితహారంపై సమీక్షించారు. వడాయిగూడెం హెలిపాడ్ వద్ద శాసనమండలి వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్,రా్రష్ట మంత్రులు ఎ. ఇంద్రకరణ్‌రెడ్డి, గుంటకండ్ల జగదీష్‌రెడ్డి, ఎంపీ డాక్టర్ బూరనర్సయ్యగౌడ్, ప్రభుత్వ విప్  గొంగిడి సునితా మహేందర్‌రెడ్డి, ఎమ్మెల్యేలు పైళ్ల శేఖర్‌రెడ్డి, కె.ప్రభాకర్‌రెడ్డి, జి.కిషోర్, వి. వీరేశం, ఎమ్మెల్సీలు పల్లారాజేశ్వర్‌రెడ్డి, పూల రవీందర్‌లతో కలిసి హరితహారంపై సమీక్షించారు. మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉద్యమంలా ముందుకు తీసుకుపోవాలని చెప్పారు. ప్రభుత్వ విప్ గొంగిడి సునిత తన నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.5 కోట్లు కావాలని కేసీఆర్‌ను కోరారు.
 
 మినిట్ టు మినిట్
 భువనగిరి : భారత రాష్ర్టపతి ప్రణబ్ పర్యటన యాదగిరిగుట్టలో 1.43 గంటలపాటు సాగింది. ముందుగా రూపొందించిన షెడ్యుల్ ప్రకారం 11.10 నిమిషాలకు రావాల్సి ఉండగా 12 నిమిషాలు అలస్యంగా వచ్చారు. తిరుగు ప్రయాణం మాత్రం నిర్ణీత సమయంలోనే సాగింది.
     ఉదయం 11.22 గంటలకు వడాయిగూడెం హెలిపాడ్ వద్ద ల్యాండ్ అయిన రాష్ట్రపతి హెలికాప్టర్
     11.32 గంటలకు వడాయిగూడెం నుంచి కొండపైకి కాన్వాయ్ ప్రారంభం
     11.34  శ్రీవారి పాదాల వద్దకు చేరింది.
     11.35 చెక్‌పోస్ట్ వద్దకు..
     11.36 ఘాట్ రోడ్డు ప్రారంభమైంది
     11.37 ఘాట్ రోడ్డుపై మొదటి మలుపు తిరిగింది
     11.38 హరిత హోటల్‌వద్దకు చేరుకుంది.
     11.39 దేవాలయం ఆర్చీ..
     11.40 ఆండాళ్ నిలయం (గెస్ట్‌హౌస్) వద్దకు వచ్చింది.
     11.50 గంటలకు ఆలయంలోకి దర్శనానికి వెళ్లారు.
     12.24 ఆలయం నుంచి బయటకు వచ్చారు.
     12.50 గుట్టపై నుంచి కాన్వాయ్ తిరుగు ప్రయాణం
     12.58  వడాయిగూడెం హెలిపాడ్ వద్దకు చేరుకుంది
     1.05 గంటలకు బయలుదేరిన రాష్ర్టపతి హెలికాప్టర్
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement