
'ప్రైవేటు కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలి'
వరంగల్: విద్యార్ధులకు ప్రైవేటు కళాశాలల్లో నాణ్యతా ప్రమాణాలతో కూడిన విద్యనందించాలని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. ఆదివారం నగరంలోని రంగశాయిపేట గణపతి ఇంజనీరింగ్ కళాశాలలో తెలంగాణ ప్రైవేటు డిగ్రీ, పీజీ కళాశాలల నూతన సంవత్సర డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో పాల్గొన్న సందర్భంగా ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ డిగ్రీ, పీజీ కళాశాలల అధ్యక్షులు సంగంరెడ్డి సుందర్‌రాజు అధ్యక్షత వహించారు. ఈ సందర్బంగా డిప్యూటీ సీఎం శ్రీహరి మాట్లాడుతూ.. తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ప్రైవేటు విద్యా సంస్థల పాత్ర ఎంతో ఉందన్నారు. కళాశాలలకు రావాల్సిన పాత బకాయిలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. అంతేకాకుండా కళాశాలల సమస్యల పరిష్కారంలో అండగా ఉంటానని కడియం శ్రీహరి హామీనిచ్చారు. అదే విధంగా నల్గొండ-వరంగల్-ఖమ్మం పట్ట భద్రుల నియోజక వర్గం టీఆర్‌ఎస్ ఎమ్మెల్సీ అభ్యర్ధి పల్లా రాజేశ్వర్‌రెడ్డిని గెలిపించాలని కోరారు.
(కరీమాబాద్)