
సాక్షి, కరీంనగర్ : తెలంగాణలో ప్రైవేట్ స్కూల్స్ వర్సెస్ గవర్నమెంట్ స్కూల్స్ వార్ రోజు రోజుకు ముదురుతోంది. బుధవారం కరీంనగర్‌లో తెలంగాణ రికగ్నైస్డ్ స్కూల్ మేనేజ్‌మెంట్ అసోసియేషన్ (ట్రాస్మా) సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ట్రాస్మా అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, కార్యదర్శి శేఖర్ రావు మీడియాతో మాట్లాడుతూ.. ప్రైవేట్ స్కూల్స్‌పై ప్రభుత్వ కక్షసాధింపు చర్యలకు పాల్పడుతోందని ఆరోపించారు.
సమస్యలను పదిరోజుల్లో పరిష్కరించకుంటే ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేయాలని నిర్ణయించుకున్నామని తెలిపారు. ప్రైవేట్ స్కూల్స్‌ను నడపడమే నేరం అన్నట్లుగా ప్రభుత్వం వ్యవహరిస్తోందని విమర్శించారు. ప్రైవేట్ పాఠశాలలపై దుష్ప్రచారం మానుకోవాలని కోరారు. గ్రామీణ ప్రాంతాల్లోకి ప్రవేట్ పాఠశాలల బస్సులు రాకుండా అడ్డుకుంటున్న ప్రభుత్వ పాఠశాలల టీచర్లు, తమ పిల్లలను ప్రెవేట్ స్కూల్స్‌కు ఎందుకు పంపిస్తున్నారని ప్రశ్నించారు.
ప్రైవేటు పాఠశాలలకు అనవసరమైన నిబంధనలను ఫైర్ పోలీసులు నోటీసులను ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలపై ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే విద్యార్థుల తల్లిదండ్రుల సమ్మతితో ప్రైవేట్ పాఠశాలలను బంద్ చేస్తామని వారు హెచ్చరించారు.