సాక్షి, హైదరాబాద్: రాజసం ఉట్టిపడే కళ... వందేళ్ల చారిత్రక నేపథ్యం... పన్నెండు వందల ఎకరాల విస్త్రీర్ణం... న్యాక్ ఏ ప్లస్ గుర్తింపు... 700పైగా అనుబంధ కాలేజీలు... 12 ఫ్యాకల్టీలు, 54 కోర్సులు... నాలుగు వేల మంది సిబ్బంది... ఇరవై రెండు హాస్టళ్లు, ఏడు వేల మందికిపైగా విద్యార్థులు... ఇదీ మన ఉస్మానియా యూనివర్సిటీ నేపథ్యం. ఉన్నత విద్యలో ఒకప్పుడు అంతర్జాతీయంగా ఓ వెలుగు వెలిగిన ఈ విద్యాకుసుమం ప్రస్తుతం పలు సమస్యలతో కునారిల్లుతోంది. పాలకులు చూపుతున్న వివక్ష, అధికారుల అలసత్వం వల్ల వందేళ్ల ప్రతిష్టకు మసకబారుతోంది. వర్సిటీలో 1,264 అధ్యాపక పోస్టులకు 732 ఖాళీగా ఉన్నాయి. 12 విభాగాల్లో ఒక్క రెగ్యులర్ ప్రొఫెసరూ లేరు. కోటి ఆశలతో కొంగొత్త ఆశయాలతో తొలిసారిగా యూని వర్సిటీలోకి అడుగుపెట్టబోతున్న కొత్త(పీజీ ఫస్ట్ ఇయర్)విద్యార్థులకు అనేక సమస్యలు స్వాగతం పలుకుతున్నాయి.
నియామకాల్లేవు...
వర్సిటీలోని అన్ని విభాగాల్లో దాదాపు 60 శాతం పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ప్రతి విభాగంలో ప్రొఫె సర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టులను 1ః2ః4 నిష్పత్తిలో భర్తీ చేయాల్సి ఉంది. వర్సిటీ చరిత్రలో దాదాపు పదిహేనేళ్లుగా నియామకాల్లేవు. ఇరవై ఏళ్ల క్రితం వర్సిటీలో దాదాపు 1,264 మంది అధ్యాపకులు పనిచేసేవారు. ప్రస్తుతం వీరి సంఖ్య 532కి చేరింది. 732 పోస్టులు ఖాళీలుగా ఉన్నాయి. 12 విభాగాల్లో రెగ్యులర్ అధ్యాపకులే లేరు. తమిళం, మరాఠి, కన్నడ, ఫ్రెంచ్, రష్యన్, పర్షియన్, థియేటర్ ఆర్ట్స్ కోర్సులు మూతపడే పరిస్థితికి చేరుకున్నాయి. బయోటెక్నాలజీ, జెనెటిక్స్, ఎన్విరాన్‌మెంటల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్, జియో ఇన్‌ఫర్మేటిక్స్, కాంపిటీషనల్ జియోఫిజిక్స్, ఫుడ్ అండ్ టెక్స్‌టైల్స్ కోర్సుల్లో రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో అకాడమిక్ కన్సల్టెంట్లతో నెట్టుకొస్తున్నారు. అధ్యాపకుల కొరత వల్ల పరిశోధన అభ్యర్థులకు సీటు దొరకని పరిస్థితి నెలకొంది. గతంలో 17 వేల మందికిపైగా పీహెచ్‌డీ ప్రవేశ పరీక్ష రాయగా, వీరిలో కనీసం 300 మందికైనా సీటు ఇవ్వలేని దుస్థితి ఏర్పడింది. పరీక్షల విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా వేధిస్తోంది. ఈ విభాగంలో 300 మందికిపైగా కాంట్రాక్టు ఉద్యోగులు పనిచేస్తున్నారు.
కిక్కిరిసిపోతున్న హాస్టళ్లు...
ఉస్మానియా విద్యార్థులను వసతిగృహాల సమస్య తీవ్రంగా వేధిస్తోంది. 22 హాస్టళ్లు ఉండగా, వీటిలో నాలుగువేల మందికి వసతి కల్పించాలి. కానీ, ఏడు వేలమందికిపైగా ఉంటున్నారు. సరిపడే బాతురూముల్లేక ఆరుబయటే స్నానాలు చేయాల్సి వస్తోందని పీజీ సెకండ్ ఇయర్ విద్యార్థి కిరణ్ ఆవేదన వ్యక్తం చేశారు. మంచాలు, కుర్చీలు, స్టడీ టేబుళ్లు, ర్యాక్‌లు సరిపడా లేవు. నిజాం కళాశాల, సైఫాబాద్ పీజీ కాలేజ్, సికింద్రాబాద్ పీజీ కాలేజీ విద్యార్థినులతోపాటు పేమెంట్ కోటాలో జాయిన్ అయినవారికి వసతి దొరకడం గగనంగా మారింది.
తొలి విడతలో 15,800 సీట్లు భర్తీ
ఉస్మానియా యూనివర్సిటీ పరిధిలో 17,500 పీజీ సీట్లు ఉన్నాయి. మొదటి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటివరకు 15,800 సీట్లు భర్తీ చేశారు. జూలై 28లోగా వీరంతా ఆయా కాలేజీల్లో చేరాల్సి ఉంది. మిగిలిన సీట్లను ఆగస్టు మొదటి వారంలో నిర్వహించనున్న రెండో విడత కౌన్సెలింగ్‌లో భర్తీ చేయనున్నారు. ఎన్‌ఆర్‌ఐ, ఇతర కోటాల కింద చేరే విద్యార్థులకు వసతి కష్టంగా మారింది. దీంతో వారంతా వర్సిటీ బయటే ఉండాల్సి వస్తోంది.
వందేళ్ల వెలుగు.. సమస్యల్లో నలుగు
Published Mon, Jul 23 2018 1:06 AM | Last Updated on Sun, Apr 7 2019 3:35 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment