
వానాకాలం చదువులు
నిండా సమస్యలతో కొట్టుమిట్టాడుతున్న ప్రభుత్వ పాఠశాలలు
♦ టీచర్లుంటే సౌకర్యాలుండవు.. సౌకర్యాలుంటే టీచర్లుండరు!
♦ తరగతి గదులు, మౌలిక సదుపాయాలు కరువు
♦ శిథిలమైన భవనాలతో ప్రమాదకరంగా పరిస్థితి
♦ ఎప్పుడు కూలిపడతాయో తెలియని దుస్థితి
♦ ఆరుబయట, చెట్ల కిందే తరగతులు
♦ అనేక చోట్ల వర్షమొస్తే బడికి సెలవే
♦ కనీసం టాయిలెట్లు, మంచినీరూ కరువే
♦ ఏటా వేల కోట్లు ఖర్చు.. అయినా ఫలితం శూన్యం
సాక్షి, హైదరాబాద్ : మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం కంఠాయపాలెం గ్రామ పాఠశాలలో 262 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ తెలుగు, ఇంగ్లిష్ మీడియంలకు కలిపి 10 తరగతి గదులు అవసరంకాగా.. 3 గదులే ఉన్నాయి. పాత గదులు శిథిలావస్థకు చేరి కూలిపోయాయి. దాంతో విద్యార్థులు చెట్ల కిందే చదువుకుంటున్నారు.
⇒ జయశంకర్ జిల్లా గొర్లవీడు ప్రాథమిక పాఠశాలలో 116 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ఇక్కడ ఉన్న ఏడు తరగతి గదులన్నీ కూడా శిథిలావస్థకు చేరుకు న్నాయి. ఎప్పుడు కూలిపడతాయో తెలియని పరిస్థితుల్లో విద్యార్థులు బిక్కుబిక్కుమంటూ చదువుతున్నారు.
⇒ జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం నిడిగొండ హైస్కూల్‌లో 205 మంది విద్యార్థులున్నారు. ఇక్కడ పది తరగతి గదులు ఉండగా.. ఇందులో ఆరు శిథిలావస్థకు చేరాయి. మిగతా నాలుగు గదుల్లోనే తరగతులు జరుగుతున్నాయి.
⇒ వనపర్తి జిల్లా కేంద్రంలోని బండార్‌నగర్ యూపీఎస్‌లో తరగతి గదులు శిథిలావస్థకు చేరి.. చిన్న వాన కురిసినా పైకప్పు నుంచి నీరు కారుతోంది. ఆ వర్షపు నీటిలో కూర్చొని చదువుకోవాల్సి వస్తోంది.
..ఇవి ప్రభుత్వ పాఠశాలల్లో నెలకొన్న సమస్యలకు కొన్ని ఉదాహరణలు మాత్రమే. రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలల్లో విద్యార్థులు నిత్యం సమస్యలతో సహవాసం చేస్తున్నారు. తరగతి గదులే కాదు టాయిలెట్లు, మంచినీటి వసతి కూడా లేక ఇబ్బందులు పడుతున్నారు. ఏటా దాదాపు రూ.10 వేల కోట్ల బడ్జెట్ కలిగిన విద్యాశాఖ.. స్కూళ్లలో వసతుల కల్పనకే దాదాపు రూ.2 వేల కోట్లు వెచ్చిస్తున్నా ఈ పరిస్థితి నెలకొనడం గమనార్హం. ప్రతి ప్రభుత్వ పాఠశాలనూ ఏదో ఒక సమస్య పట్టి పీడిస్తోంది. టీచర్లున్న స్కూళ్లలో మౌలిక సదుపాయాలు ఉండవు. మౌలిక సదుపాయాలున్న చోట టీచర్లు ఉండరు. ఇక ప్రతి ఉన్నత పాఠశాలలో సైన్స్ ల్యాబ్ కచ్చితంగా ఉండాలి. కానీ 50 శాతానికి పైగా ఉన్నత పాఠశాలల్లో ల్యాబ్‌లు లేవు.
పట్టించుకోని ప్రజాప్రతినిధులు!
పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం ఎంత ప్రయత్నిస్తున్నా ఆచరణలో ఫలితం కనిపించడం లేదు. ప్రతి నియోజకవర్గంలో రూ.5 కోట్లతో ప్రభుత్వ బడు ల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సర్కారు యోచించింది. ఒక్కో ఎమ్మెల్యే లేదా ఎమ్మెల్సీ తమ నియోజకవర్గ అభివృద్ధి నిధుల నుంచి రూ.కోటి ఇస్తే జిల్లా కలెక్టర్ క్రూషియల్ ఫండ్స్ నుంచి మరో రూ.కోటి, పాఠశాల విద్యా శాఖ రూ.3 కోట్లు కలిపి.. రూ.5 కోట్లతో పాఠశాలలను అభివృద్ధి చేసేలా డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి ప్రణాళికలు సిద్ధం చేశారు. కానీ అందుకు ప్రజా ప్రతినిధులు సహకరించడం లేదు. రాష్ట్రంలోని 119 మంది ఎమ్మెల్యేలలో.. ఇప్పటివరకు సగం మంది కూడా తమ నియోజకవర్గాల్లోని పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ముందుకు రాలేదు.
కనీస వసతులూ లేవు..
అనేక ప్రభుత్వ పాఠశాలల్లో తరగతి గదులు శిథిలావస్థకు చేరుకున్నాయి. పైకప్పు పెచ్చులూడిపోతూ విద్యార్థులకు ప్రమాదకరంగా మారాయి. దీంతో విద్యార్థులకు ఆరుబయటే చదువు చెబుతున్నారు. వర్షం వస్తే చాలా చోట్ల పాఠశాలలకు అప్రకటిత సెలవులు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. పలు చోట్ల టాయిలెట్లు లేక, ఉన్నా కూడా నీటి వసతి లేక విద్యార్థులు ఇబ్బంది పడు తున్నారు. చివరకు కిచెన్ షెడ్లు లేకపోవడంతో 8,112 పాఠశాలల్లో వర్షం వస్తే అంతే సంగతులు. వర్షాకాలం వచ్చిందంటే చాలు కిచెన్ షెడ్లు లేని ఆ పాఠశాల ల్లో వంట చేయడం కుదరక విద్యార్థులకు మధ్యాహ్న భోజనం సరిగ్గా పెట్టలేని పరిస్థితి ఏర్పడుతోంది. ఇవేకాదు తరగతి గదులు, ఫర్నిచర్, విద్యుత్తు సదుపా యం, లైబ్రరీ, కాంపౌండ్ వాల్ వంటివి లేక సమస్యలు తప్పడం లేదు.
ఎన్నెన్నో సమస్యలు..
రాష్ట్రంలోని 25,183 పాఠశాలలకు పక్కా భవనాలుండగా.. 348 పాఠశాలలకు ఇప్పటికీ సొంత భవనాలు లేవు. 7,093 పాఠశాలలకు అదనపు తరగతి గదులు అవసరమని విద్యాశాఖ లెక్కలు వేసింది. ఇందుకు రూ.589 కోట్లు అవసరమని అంచనా వేసింది.
⇔ ప్రతి 40 మంది విద్యార్థులకు ఒక టాయిలెట్ ఉండాలన్న నిబంధన ప్రకారం పాఠశాలల్లో ఇంకా 27,644 టాయిలెట్లు నిర్మించాల్సి ఉంది. ఇందులో బాలురకు 15,236 టాయిలెట్లు, బాలికల కోసం 12,408 టాయిలెట్లు అవసరం.
⇔ రాష్ట్రంలో సగానికిపైగా పాఠశాలల్లో విద్యార్థులు చేతులు శుభ్రం చేసుకునేందుకు కూడా నీటి సదుపాయం లేదు. ఇక 10,768 పాఠశాలల్లో తగిన నీటి సదుపాయం ఉండగా.. 14,763 పాఠశాలల్లో రన్నింగ్ వాటర్ సదుపాయం లేదు.
⇔ 23,329 పాఠశాలలకు విద్యుత్ సరఫరా ఉండగా.. 2,202 పాఠశాలలకు లేదు.
⇔15,649 పాఠశాలలకు ప్రహరీ గోడలు ఉండగా.. 9,882 పాఠశాలలకు ప్రహరీ గోడలు నిర్మించలేదు.
⇔ రాష్ట్రంలోని దాదాపు సగం ప్రభుత్వ స్కూళ్లలో ఆట స్థలాలు లేకపోవడం గమనార్హం. దీంతో విద్యార్థుల శారీరక ఎదుగుదలకు అవసరమైన ఆటలు ఆడించే పరిస్థితి లేకుండా పోయింది.
⇔ మధ్యాహ్న భోజనం వండిపెట్టేందుకు, వంట సామగ్రిని భద్రపరిచేందుకు అవసరమైన కిచెన్ షెడ్లు 17,419 పాఠశాలల్లో ఉన్నాయని.. మరో 8,112 పాఠశాలలకు లేవని విద్యాశాఖ లెక్కలే చెబుతున్నాయి.