మహా.. ప్రసాదం
భక్తులకందని రాములోరి ఫలహారం
♦ లడ్డూ ప్రసాదాల విక్రయానికి ఒకటే కౌంటర్
♦ ‘తానీషా’ మండపం వద్ద భక్తుల పడిగాపులు
♦ పోలీసు ఆంక్షలతో సవాలక్ష ఇబ్బందులు
♦ దేవస్థానం ఆదాయూనికి భారీ గండి
♦ 8 రోజులకు 7.50 లక్షల లడ్డూలే విక్రయం
♦ లడ్డూ తయారీపై ఆచితూచి అడుగులు
భద్రాచలం నుంచి సాక్షి బృందం : గోదావరి పుష్కర స్నానం చేసేం దుకు భద్రాచలం వచ్చిన భక్తులకు రాముడి ప్రసాదం కరువైంది. రాములోరి దర్శనం అనంతరం స్వామి వారి లడ్డూ ప్రసాదాలను తీసుకుందామని గుడి చుట్టూ తిరిగినా...విక్రయశాలలు కనిపించటం లేదు. స్థానిక తానీషా కల్యాణ మండపం వద్ద ఒకే ఒక్క కౌంటర్ ఏర్పాటు చేయడంతో లక్షలాదిగా వచ్చిన భక్తులకు లడ్డూ ప్రసాదాలు అందటం లేదు. రోజుకు 2.50 లక్షలకు పైగా భక్తులు భద్రాచలం వస్తున్నారని తెలిసినా, అధికారులు దీనిపై ఏమాత్రం దృష్టి సారించటం లేదు. ఉన్న ఒకే కౌంటర్ వద్దనే పోలీసుల బందోబస్తును ఏర్పాటు చేసి లడ్డూలను విక్రయిస్తున్నారు. మంగళవారం లడ్డూ విక్రయ కౌంటర్ వద్ద భక్తుల మధ్య తోపులాట జరిగింది. మండు టెండలో పంచాయితీ కార్యాలయం వరకూ క్యూ లైన్‌లో వేచి ఉండి భక్తులు లడ్డూలను కొనుగోలు చేశారు.
ఎందుకిలా జరుగుతోంది..?
గోదావరి పుష్కరాల 12 రోజుల పాటు ఒక్క భద్రాచలానికే 50 లక్షల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేశారు. ఈ నేపథ్యంలోనే 20లక్షల లడ్డూలను విక్రయించి సుమారుగా రూ.3 కోట్ల ఆదాయాన్ని సముపార్జించాలని భావించారు. ఇందుకోసం భద్రాచలంలో టీటీడీ, శ్రీ రామనిలయం, సీతానిలయం, తానీషా కల్యాణ మండపం, శ్రీరామ సద నం, సౌమిత్రి సదనం, కల్యాణ మండపం ఏరియా, రూ.200 క్యూలైన్, శ్రీఆంజనేయస్వామి వారి ఆలయం వద్ద కౌంటర్‌లు ఏర్పాటు చేశారు. మొదటి మూడు రోజుల పాటు ఈ కౌంటర్‌ల ద్వారానే లడ్డూ ప్రసాదాల ను విక్రరుుంచారు. భక్తులు ఎక్కువగా ఈ కేంద్రాల వద్ద వేచి ఉండటం వల్ల జనం గుమిగూడుతున్నారని పోలీసుల వీటిని తొలగించాల్సిందిగా దేవస్థానం అధికారులకు సూచించారు. పోలీసుల ఆంక్షలతో కేవలం ఒక్క తానీషా కల్యాణ మండపం వద్దనే కౌంటర్‌ను ఏర్పాటు చేసి ప్రసాదాలను విక్రరుుస్తుండటంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
8 రోజులకు 7.50 లక్షల లడ్డూల విక్రయం
పుష్కరాలు ప్రారంభమైన నాటి నుంచి మంగళవారం వరకు 7.50 లక్షల లడ్డూలను విక్రయించారు. అధికారులు ముందుగా వేసిన లెక్కల ప్రకారం రోజుకు 1.50 లక్షలకు పైగా విక్రయించాల్సి ఉంది. కానీ భక్తులకు అందుబాటులో కౌంటర్‌లు లేకపోవటంతో లడ్డూల విక్రయం ఆశించిన స్థాయిలో లేదు. పుష్కరాల ప్రారంభమైన తొలిరోజున 1.30 లక్షల లడ్డూలను విక్రయించారు. 15వ తేదీన 61 వేలు, 16న 67 వేలు, 17న 54 వేలు, 18న 1.75 లక్షలు, 19న 1.14 లక్షలు, 20న 88 వేలు, 21వ తేదీన 70 వేల లడ్డూలను అమ్మారు. పోలీసుల ఆంక్షలతో లడ్డూలు ఆశించిన స్థాయిలో విక్రయించే పరిస్థితి లేక తయారీ విషయంలో దేవస్థానం అధికారులు ఆలోచనలో పడ్డారు. మొదటి నాలుగు రోజుల పాటు తగిన రీతిలో విక్రయాలు లేకపోవటంతో, రెండు రోజుల పాటు లడ్డూ తయారీని పూర్తిగా నిలిపివేశారు.
ఆదాయానికి భారీ గండి
ఓ పక్క ఆర్జిత సేవలను పూర్తిగా నిలిపివేయటంతో టిక్కెట్ల విక్రయాల ద్వారా వచ్చే ఆదాయాన్ని దేవస్థానం పూర్తిగా కోల్పోవాల్సి వచ్చింది. లడ్డూ ప్రసాదాలను కూడా అమ్ముకోనివ్వకుండా పోలీసులు ఇలా ఆంక్షలు విధిస్తుండటంపై దేవస్థానం అధికారులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. గోదావరి పుష్కరాలపై ‘కోట్ల’ ఆశలు పెట్టుకున్న దేవస్థానం అధికారులకు ఈ పరిణామాలు మింగుడుపడటం లేదు. ఇదే పరిస్థితి కొనసాగితే మిగిలిన నాలుగు రోజుల్లో మరో 4 లక్షలకు మించి లడ్డూలమ్మలేమని వాపోతున్నారు.