నీళ్లు సరే.. నియామకాలు ఏవీ?
జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం
తూప్రాన్ /రామాయంపేట: నిరుద్యోగులకు ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని జేఏసీ చైర్మన్ ప్రొఫెసర్ కోదండరాం అన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ లో విలేకరులతో, రామాయంపేటలో సభలో ఆయన మాట్లాడారు. నియామకాలను ప్రభుత్వం విస్మరించిందని, ఇందుకోసం జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని అన్నారు. రాష్ట్రంలో 2 లక్షల ఉద్యోగ ఖాళీలుంటే ప్రభుత్వం కేవలం 15 వేలే భర్తీ చేసిందన్నారు. ఉద్యమంలో త్యాగాలు చేసిన యువతను విస్మరించిందని మండిపడ్డారు.
ఉద్యోగ కల్పన కోసం ఈ నెల మూడో వారంలో హైదరాబాద్‌లో నిరుద్యోగులతో కలసి భారీ ర్యాలీ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. త్వరలోనే తేదీ ఖరారు చేస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఉద్యోగాలు భర్తీ చేయాలన్నారు. కేంద్ర బడ్జెట్ ఆశాజనకంగా లేదని విమర్శించారు. జిల్లాలు, డివిజన్లు, మండలాల ఏర్పాటు అసంబద్ధంగా జరిగిందని ఆరోపించారు.