ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా రమేష్
- దేశంలో ఒక్కరికే దక్కిన అవకాశం
- వృత్తి-విద్యకు అనుసంధానంగా రెండేళ్ల పరిశోధనలు
కేయూ క్యాంపస్, న్యూస్‌లైన్ : కాకతీయ యూనివర్సిటీ విద్యావిభాగం రిటైర్డ్ ప్రొఫెసర్ ఘంటా రమేష్ కు అరుదైన గౌరవం దక్కింది. యూజీసీ ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ మేరకు కేయూ విద్యావిభాగంలో రెండేళ్ల పాటు ఆయన వృత్తి-విద్యకు అనుసంధానంగా పరిశోధనలు చేయనున్నారు. విద్యావిభాగంలో దేశవ్యాప్తంగా రమేష్ ఒక్కరే ఎమిరిటస్ ప్రొఫెసర్‌గా నియమితులు కావడం విశేషం. దీం తో ఆయనకు వృత్తికి, విద్యకు అనుసంధానం చేసే ఒకేషనలైజేషన్ అంశాలకు సం బంధించి విస్తృత పరిశోధనలు చేసే అవకాశం లభించింది. రెండేళ్ల పాటు ఆయన నెలకు రూ.50వేల చొప్పున కాంటింజెన్సీ ఫెలోషిప్‌ను యూజీసీ నుంచి అందుకుంటారు.
కేయూలో ఉద్యోగ విరమణ
కాకతీయ యూనివర్సిటీలో విద్యావిభాగంలో ప్రొఫెసర్ పనిచేసిన ఘంటా రమేష్ గత ఏడాది జూలైలో ఉద్యోగ విరమణ పొందారు. అదే ఏడాది డిసెంబర్ నుంచి హైదరాబాద్‌లోని మౌలానా ఆజాద్ జాతీ య ఉర్దూ యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా విధులు నిర్వర్తిస్తున్న రమేష్.. ఆ యూనివర్సిటీ పరిధిలో మూడు బీఎడ్ కళాశాలలు, రెండు ఎంఈడీ కళాశాలల స్థాపనకు విశేష కృషి చేశారు. అంతకుముందు రమేష్ ఒకేషనలైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్ అంశంపై కొంతకాలం క్రితం లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సులో పరిశోధన పత్రం సమర్పించారు. అదేసమయంలో అక్కడికి వచ్చిన అనేక దేశాల విద్యావేత్తలతో వృత్తివిద్యపై విస్తృతంగా చర్చలు జరిపారు.
విద్యారంగంలో విశేషమైన కృషి
ఖమ్మం జిల్లా అశ్వాపురం మండలం నెల్లిపాక బంజర అనే మారుమూల గ్రామంలో జన్మించిన ఘంటా రమేష్ కాకతీయ యూనివర్సిటీలో విద్యావిభాగంలో ప్రొఫెసర్‌గా పనిచేస్తూ హన్మకొండలోనే స్థిరపడిపోయారు. ఆయన ఉద్యోగం చేసిన సమయంలో అనేక బాధ్యతలు నిర్వర్తించడమే కాకుండా పలు అవార్డులు అందుకున్నారు. కాకతీయ యూనివర్సిటీ విద్యావిభాగం అధిపతిగా, బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్‌గా, డీన్‌గా బాధ్యతలు నిర్వహించారు.
గతం లో అమెరికా ప్రభుత్వం నుంచి పుల్‌బ్రైట్ విజిటింగ్ ఫెలోగా అవార్డు పొందిన రమేష్ కేయూ విద్యావిభాగం ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ స్టడీస్ ఇన్ ఎడ్యుకేషన్(ఐఏఎన్‌ఈ) ఉన్నతీకరణకు విశేష కృషి చేశారు. రాష్ట్రంలోనే మొదటిసారిగా బీఈడీలో కామన్ సిలబస్, అకడమిక్ క్యాలెండర్ రూపకల్పన చేసి పలువురి ప్రశంసలు అం దుకున్నారు. జాతీయ ఉపాధ్యాయ విద్యామండలి(ఎన్‌సీటీఈ) దక్షిణ ప్రాంత కమి టీ సభ్యుడిగా, యూజీసీ, న్యాక్, రాష్ట్ర జాతీయ కమిటీల్లో సభ్యులుగా కొనసాగిన రమేష్ విద్యాభివృద్ధికి తనవంతు కృషి చేశారు.
రాష్ట్రంలో నాలుగు సార్లు ఎడ్‌సెట్ సమర్థవంతంగా నిర్వహించారు. ఖమ్మం జిల్లా భద్రాచలంలో గిరిజన ఆది వాసీల విద్యాభివృద్ధి కోసం ఐటీడీఏ నేతృత్వంలో బీఈడీ కళాశాలను ఏర్పాటుచేయడంలో కూడా రమేష్‌దే కీలకపాత్ర.
విద్యా విభాగంలో మూడు దశాబ్దాల కు పైగా సేవలందించిన ఆయనకు 1997 లో రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపక అవార్డు, 2009 సంవత్సరంలో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేటర్ సంస్థ నుంచి జాతీయ ఉత్తమ అధ్యాపక అవార్డు లభించింది. వయోజన విద్యలో విశేషమైన కృషి చేసినందుకు 2010లో భారత ప్రభు త్వ మానవ వనరుల మంత్రిత్వ శాఖ నుం చి ఉత్తమ రాష్ట్ర రిసోర్స్ సెంటర్ అవార్డును కూడా అందుకున్నారు.
యువతకు ఉపాధి లభించేలా పరిశోధనలు
గతంలో లండన్‌లో జరిగిన అంతర్జాతీయ సదస్సుకు వెళ్లినప్పుడు అనేక దేశాల విద్యావేత్తలతో చర్చించే అవకాశం లభించింది. ఆ అనుభవం ఇప్పుడు నా పరిశోధనకు ఉపయోగపడుతుంది. ఇంటర్మీడియట్ స్థాయిలో ప్రభుత్వాలు ఒకేషనల్ కోర్సులు నిర్వహిస్తున్నా అనుకున్న స్థాయిలో విజయవంతం కావడం లేదు. వృత్తివిద్య అనేది ఉపాధికి మార్గంగా ఉండాలి. ఉన్నత విద్యను కూడా వృత్తికి అనుసంధానం చేసి విద్యార్థుల్లోకి తీసుకెళ్లేలా పరిశోధనలు చేసి వాటి ఫలితాలను అమలు చేస్తే యువతకు ఉపాధి లభిస్తుంది. ఈ మేరకు రెండేళ్ల పాటు పరిశోధనలు చేయనున్నాం.
- ఘంటా రమేష్