ప్రాజెక్టుల కోసం మరో మారు ఆమరణ దీక్ష చేయనున్నట్టు కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు.
మునుగోడు : ప్రాజెక్టుల కోసం మరో మారు ఆమరణ దీక్ష చేయనున్నట్టు కాంగ్రెస్ శాసనసభ పక్ష ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మునుగోడులో విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ వస్తే ఈ ప్రాంతానికి సాగు నీరందుతుందని రైతులు ఎంతో ఆశపడ్డారని, కానీ ముఖ్యమంత్రి కేసీఆర్ తీరుచూస్తే నిరాశ కలుగుతోందన్నారు. ఇచ్చిన మాట ప్రకారం నక్కలగండి ప్రాజెక్టును పూర్తిచేసి నల్లగొండ జిల్లాను అభివృద్ధి చేయాలని కోరారు. రాష్ట్రంలో అవసరాలకు సరిపడా బడ్జెట్ ఉండటంతోపాటు మిగిలిన బడ్జెట్‌ను ముఖ్యమంత్రి ముందుచూపు లేకుండా విచ్చలవి డిగా ఖర్చు చేస్తున్నారని మండిపడ్డారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం రైతుల సంక్షేమాని పూర్తిగా విస్మరించిందని విమర్శించారు.
రైతులు పం డించిన ధాన్యాన్ని కొనుగోలు చేయకుండా లెవీని ఎత్తివేయడం సరికాదన్నారు. ఈ ఏడాది పంటల దిగుబడులు రాక ఆత్మహత్యలకు పాల్పడిన రైతులను ఆదుకునేందుకు ఎక్స్‌గ్రేషియా అందిచాలని కోరారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న నిరుద్యోగులకు నెలకు రూ . 2వేల చొప్పున నిరుద్యోగభృతి అందించాలన్నారు. కేసీఆర్ అధికారంలోకి వచ్చి 11 నెలలు కావస్తున్నా నేటికీ పేదల సంక్షేమం కోసం ఎలాంటి అభివృద్ధి పనులు చేపట్టలేదన్నారు. సమావేశంలో నల్లగొండ మున్సిపల్ మాజీ చైర్మన్ పుల్లెంల వెంకటనారాయణగౌడ్, మాజీ ఎంపీపీ పోలగొని సత్యంగౌడ్, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు జాల వెంకన్నయాదవ్, మండల పరిషత్ కోఆప్షన్ సభ్యుల సంఘం నియోజకవర్గ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నాయకులు పాలకూరి యాదయ్యగౌడ్, జంగిలి నాగరాజు పాల్గొన్నారు.