సాక్షి, హైదరాబాద్: నగరాలు, పట్టణాల్లో ఇకపై ప్రతి నెలా ఆస్తి పన్ను సవరణలు జరపాలని మునిసిపాలిటీలను పురపాలక శాఖ ఆదేశించింది. కొత్తగా నిర్మించిన, పునర్ నిర్మాణం చేసిన, విస్తరించిన భవనాలు, కట్టడాలను ఎప్పటికప్పుడు పన్ను పరిధిలోకి తీసుకురావాలని స్పష్టం చేసింది. భవనాల నిర్మాణం పూర్తయితే 30 రోజుల్లోగా, పూర్తికాకున్నా గృహ ప్రవేశం చేస్తే తక్షణమే పన్ను పరిధిలోకి తీసుకురావాలని తెలిపింది. భవన యజమాని మారినా, భవన వినియోగం (గృహ, వాణిజ్య) మారినా సవరణలు జరపాలని పేర్కొంది.
పురపాలక శాఖ డైరెక్టర్ టీకే శ్రీదేవి అధ్యక్షతన ఇటీవల సమావేశమైన తెలంగాణ స్టేట్ ప్రాపర్టీ ట్యాక్స్ బోర్డు.. ఆస్తి పన్ను వసూళ్లలో మునిసిపాలిటీలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. పన్ను సవరణల కోసం బిల్ కలెక్టర్లు, రెవెన్యూ ఇన్‌స్పెక్టర్లు, క్షేత్ర స్థాయిలో పని చేసే ఇతర సిబ్బందిని ప్రత్యేకంగా నియమించాలని సూచించింది. మునిసిపాలిటీల్లోని అన్ని గృహాలు, భవనాలకు సంబంధించిన ఆస్తి పన్నుల జాబితాలను యజమానుల ఆధార్ నంబర్‌తో అనుసంధానం చేయాలని పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)ను ఆదేశించింది.
మునిసిపాలిటీలకు జారీ చేసిన ఆదేశాలివే..
- కొత్తగా ఏర్పాటైన బాదెపల్లి మునిసిపాలిటీలో ఆస్తి పన్ను పెంపును ఏప్రిల్ 1 నుంచి, దుబ్బాక మునిసిపాలిటీలో సెప్టెంబర్ 1 నుంచి అమలు చేయాలి.
- కొత్తగా ఏర్పాటవనున్న 68 పురపాలికల పరిధి లో వసూలు చేస్తున్న ఆస్తి పన్నుల వివరాలను ఆయా గ్రామ పంచాయతీల నుంచి పు రపాలక శాఖ పన్నుల విభాగం ముందస్తుగా సేకరించాలి. (మునిసిపాలిటీలుగా ఏర్పడిన తర్వాత ఆ చట్టాలకు అనుగుణంగా ఆస్తి పన్నుల పెంపును చేపట్టేందుకు ఈ నిర్ణయం తీసుకున్నారు)
- 72 పురపాలికల్లో ఉన్నఆస్తులను జీఐఎస్ పరిజ్ఞానంతో మ్యాపింగ్ జరిపించి ఆస్తి పన్నుల జాబితాలోని ఆస్తుల సమాచారాన్ని పోల్చి చూడగా 50% తక్కువగా పన్నులు వసూలైనట్లు వెల్లడైంది. దీంతో ఈ నెల 15 లోగా ఆస్తి పన్నుల జాబితాను సవరించాలని మునిసిపల్ కమిషనర్లను పురపాలక శాఖ ఆదేశించింది.
- ఆన్‌లైన్‌లో భవన నిర్మాణ అనుమతులు జారీ చేసే సమయంలోనే బిల్డింగ్ నమూనా ఆధారంగా ఆస్తి పన్ను గణన చేసేందుకు కొత్త విధానం తీసుకురావాలి.
- ఆస్తి పన్నుల సవరణలపై భవన యజమానుల నుంచి వచ్చిన 4,292 అభ్యంతరాలు ముని సిపల్ కమిషనర్ల వద్ద పెండింగ్‌లో ఉన్నాయి. వాటిని తక్షణమే పరిష్కరించాలి.
- అనుమతి లేకుండా నిర్మించిన.. ప్రైవేటు, ప్రభు త్వ, వక్ఫ్, దేవాదాయ, ఇతర భూములను కబ్జా చేసి నిర్మించిన భవనాలపై అదనంగా 100% ఆస్తి పన్నును జరిమానాగా విధించాలని గతం లో ఇచ్చిన ఉత్తర్వులను మునిసిపాలిటీలు అమ లు చేయాలి. పన్నుల డిమాండ్ నోటిసులో ‘భవ న యజమాని’పేరుకు బదులు ‘భవనాన్ని అధీనంలో పెట్టుకున్న వ్యక్తి పేరు’అని రాయాలి.
Comments
Please login to add a commentAdd a comment