
కర్ణాటక–తెలంగాణ సరిహద్దులో మహబూబ్‌నగర్ జిల్లా కృష్ణా మండలం ముడుమాల్ గ్రామశివారులో ఉన్న 3,000 ఏళ్ల నాటి ఆదిమానవుల ఖగోళ పరిశోధనశాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ ప్రాంతంలో పరిశోధనలు జరిపి వివరాలు క్రోడీకరించి ఆధారసహితంగా నిరూపించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే రైతుల నుంచి ఆ ప్రాంతానికి సంబంధించి భూమి సేకరించిన ప్రభుత్వం.. ఆ ప్రదేశాన్ని దాన్ని రక్షిత ప్రాంతంగా గుర్తించనుంది. అక్కడ తవ్వకాలు జరిపి.. అది ఏ కాలానికి చెందిందో, నాటి ఖగోళ పరిశోధనాలయంగా ఎలా వినియోగించారో రూఢి చేసే ఆధారాల కోసం పరిశోధకులు అన్వేషిస్తారు. వాటి ఆధారంగా ఆ ప్రాంత ప్రత్యేకతను ప్రపంచవ్యాప్తంగా విశ్వవిద్యాలయాల్లో జరిగే సదస్సుల్లో పేపర్ రూపంలో సమర్పించి ప్రాచుర్యం కల్పిస్తారు. – సాక్షి, హైదరాబాద్
సప్తర్షి మండలమే ప్రత్యేకత..
వాతావరణ మార్పులు, రుతువుల గమనం, ఉపద్రవాలను ముందుగా గుర్తించే ఆనవాళ్లను నక్షత్రాల గమనం ద్వారా తెలుసుకునే అవకాశం ఉంది. ఇలాంటి వాటిల్లో సప్తర్షి మండలంగా పిలిచే నక్షత్ర సమూహాలది కీలక భూమిక. పూర్వకాలంలో వాటి ద్వారా వాతావరణ మార్పులు గుర్తించేవారు. ఈ రాళ్లకు సమీపంలో ఆ సప్తర్షి మండలం (ఉర్సామెజర్) చిత్రించిన రాయి ఉండటం విశేషం. ఈ విషయాన్ని ఇప్పటికే బెల్జియం, అమెరికా, ఈజిప్టుల్లో జరిగిన పలు సదస్సుల్లో పత్రాల రూపంలో సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్ పుల్లారావు సమర్పించారు. దీంతో ఆ ప్రాంతానికి విదేశీ పరిశోధకులు, విద్యార్థుల తాకిడి పెరిగింది. ఇటీవలే కొరియా బృందం పరిశీలించి వెళ్లింది. ఆ ప్రాంతానికి అంతర్జాతీయంగా ప్రచారం కల్పిస్తే విదేశీ పర్యాటకులు, పరిశోధకులూ పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉంది.
వచ్చే ఏడాది తవ్వకాలు
‘ప్రస్తుతం సేకరించిన భూమిలో కంచె ఏర్పాటు చేసి ఆ రాళ్లకు రక్షణ కల్పిస్తాం. అక్కడ తవ్వకాల కోసం ప్రభుత్వానికి ప్రతిపాదిస్తున్నాం. వచ్చే ఏడాది తవ్వకాలు మొదలవుతాయి. అరుదైన ఇలాంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేసి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తాం’ – విశాలాచ్చి, పురావస్తు శాఖ డైరెక్టర్
సప్తర్షి మండల రాయికీ రక్షణ
‘సప్తర్షి మండలం చిత్రించిన రాయికి ఎంతో ప్రాధాన్యం ఉంది. అది నిలువు రాళ్లకు కొంత దూరంలో ఉంది. ఆ స్థలంలోనే దాన్ని పరిరక్షించి మరిన్ని పరిశోధనలు చేయాలి. రవాణా వసతి కల్పిస్తే పర్యాటకులు వస్తారు. ఇది యునెస్కో గుర్తింపు పొందేందుకు అర్హతలున్న ప్రాంతం’ – పుల్లారావు, సెంట్రల్ వర్సిటీ ప్రొఫెసర్
దశాబ్దాల క్రితమే..
14 అడుగుల ఎత్తున్న నిలువు రాళ్లను క్రమపద్ధతిలో పాతిన ఈ ప్రాంతాన్ని కొన్ని దశాబ్దాల క్రితమే పురావస్తు శాఖ గుర్తించింది. అయితే అవి బృహత్ శిలాయుగానికి చెందిన మానవుల సమాధులుగా మాత్రమే అప్పట్లో పేర్కొన్నారు. తర్వాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ కె.పుల్లారావు ఆధ్వర్యంలో జరిపిన పరిశోధనల్లో నాటి ఖగోళ పరిశోధనశాలగా తేలింది. దీన్ని రూఢి చేసే ఆధారాలను ఆ బృందం గుర్తించింది.
గతేడాది అక్టోబర్‌లో ఆ పరిశోధన వివరాలు ఉటంకిస్తూ ‘సాక్షి’ప్రత్యేక కథనాన్ని ప్రచురించింది. సాక్షి కథనం తర్వాత ఆ ప్రాంత ప్రాధాన్యాన్ని గుర్తించిన ప్రభుత్వం.. ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని నిర్ణయించింది. అయితే పొడవైన నిలువు రాళ్లున్న ప్రాంతంతో రైతులు సాగుచేస్తుండటంతో ఆ భూమిని సేకరించి అభివృద్ధి చేయాలని అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదించారు. తాజాగా ఆ ప్రక్రియ కొలిక్కి వచ్చింది. తొలుత నాలుగున్నర ఎకరాల భూమిని రైతుల నుంచి ప్రభుత్వం సేకరించింది. మరో వారం, పది రోజుల్లో పరిహారం డబ్బులూ రైతులకు ఇవ్వనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment