ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. శనివారం కోదాడలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన
కోదాడరూరల్ : ప్రజా సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని సీపీఎం జిల్లా కార్యదర్శి నంద్యాల నర్సింహారెడ్డి విమర్శించారు. శనివారం కోదాడలోని సీపీఎం కార్యాలయంలో జరిగిన ఆ పార్టీ డివిజన్‌స్థాయి కార్యకర్తల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నల్లధనాన్ని వెలికితీస్తామని ఎన్నికల సమయంలో చెప్పిన కేంద్రం ప్రభుత్వం.. ఇప్పుడు అందుకు కావాల్సిన సమాచారం తమ దగ్గరలేదనడం పెట్టుబడిదారులకు ఒత్తాసు పలుకడమేనన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడంలో నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపించారు. కుటుంబ సమగ్ర సర్వేలో ప్రజల నుంచి పూర్తి సమాచారం సేకరించిన ప్రభుత్వం.. ఆహారభద్రత కార్డులు, సామాజిక పింఛన్లు, ఫాస్టు పథకానికి మళ్లీ దరఖాస్తు చేసుకోవాలని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు.
అధికారంలోకి వస్తే వ్యవసాయానికి 8 గంటల నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తామని చెప్పిన మాటలు కోతలేనని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలు చేస్తున్న యాత్రలు తమ ఉనికిని కాపాడుకోవటానికే తప్ప ప్రజా సమస్యలపై కాదని విమర్శించారు. పార్టీ ఆధ్వర్యంలో డిసెంబర్ 27, 28, 29 తేదీలలో సూర్యాపేటలో జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. ఫిబ్రవరి 26, 27, 28, మార్చి 1న హైదబాద్‌లో రాష్ట్ర మహాసభలు, ఏప్రిల్‌లో విశాఖపట్నంలో ఆలిండియా మహాసభలు జరుగుతాయని వివరించారు. సమావేశంలో సీపీఎం డివిజన్ కార్యదర్శి జుట్టుకొండ బసవయ్య, గట్టు వెంకట్రామయ్య, కుక్కడపు ప్రసాద్, వెంకటేశ్వరరావు, యలమంచి, బెల్లంకొండ సత్యనారాయణ స్టాలిన్‌రెడ్డి, కొరట్ల శ్రీను, సూర్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.