సాక్షి,సిటీబ్యూరో: భూ క్రమబద్ధీకరణకు దరఖాస్తు చేసుకున్న స్థలాల్లో తిరస్కరణకు గురైన భూముల రుసుం తిరిగి రాబట్టుకునేందుకు పేదలు అగచాట్లు పడుతున్నారు. భూ క్రమబద్ధీకరణ దరఖాస్తుదారుల్లో తిరస్కరణకు గురైన స్థలాల యజమానులు దాదాపు రూ.21.53 కోట్లు చెల్లించారు. ప్రభుత్వం కల్పించిన వెసులుబాటుతో అనధికార ఇళ్ల భూములను క్రమబద్ధీకరించేకునేందుకు అప్పులు చేసి మరీ దరఖాస్తు చేసుకున్న పేదల ఆశలు అడియాసలయ్యాయి. దరఖాస్తుదారులు తాము చెల్లించిన రుసుం కోసం ఏడాదిగా తహసీల్దార్ అఫీసుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం ఖాజానా నింపుకునేందుకు అక్రమిత స్ధలాల క్రమబద్ధీకరణ పేరుతో పెద్ద ఎత్తున ఆదాయం పెంచుకున్నా.. తిరస్కరణ గురైన వాటి రుసుం మాత్రం వెనక్కి ఇచ్చేందుకు అధికారులు పెద్దగా ఆసక్తి చూపడం లేదు. పేదల నుంచి తహసీల్దార్లపై ఒత్తిళ్లు రావడంతో జిల్లా యంత్రాంగం ప్రభుత్వానికి లేఖ రాసి మిన్నకుండి పోయింది.
ఇదీ పరిస్థితి
ప్రభుత్వం రెండేళ్ల క్రితం జీవో 59 కింద ఆక్రమిత ఇళ్ల భూ క్రమబద్ధీకణ కోసం దరఖాస్తులు ఆహ్వానించగా పేదలు పెద్ద సంఖ్యలో దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 6172 దరఖాస్తులు రాగా, అందులో 809 దరఖాస్తులు తిరస్కరణకు గురయ్యాయి. మరో 873 దరఖాస్తులు పెండింగ్‌లో ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం దరఖాస్తుదారులు మార్కెట్ ధర ప్రకారం 125 గజాలకు 10 శాతం, 125 గజాలకు మించితే 25 శాతం చెల్లించాల్సి ఉంటుంది. జిల్లా యంత్రాంగం భూ క్రమబద్ధీకరణ ద్వారా రూ. 100 కోట్ల ఆదాయం రావచ్చునని అంచనా వేయగా, దానికి మించి రూ.153 కోట్లకు పైగా ఆదాయం సమకూరింది. అందులో తిరస్కరణకు గురైన స్ధలాలకు సంబధించిన రుసుం రూ.21.53 కోట్లపైనే, భూములు క్రమబద్ధీకరించని కారణంగా ఆయా మొత్తాలను దరఖాస్తుదారులకు తిరిగి ఇవ్వాల్సి ఉంది. అయితే ప్రభుత్వ ఖాజానాలో జమచేయడంతో చెల్లింపులు అంత సులభం కాదు. ఇందుకు ప్రభుత్వం నుంచి ప్రత్యేక ఉత్తర్వులు జారీ కావాల్సి ఉంది. ఇప్పటి వరకు తిరస్కరణ స్థలాల రుసుం చెల్లింపుపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment