కృష్ణా తీరం.. భక్తజన సాగరం
• నాలుగో రోజు 13.5 లక్షల మందికిపైగా పుణ్యస్నానాలు
• కిటకిటలాడిన పుష్కర ఘాట్లు
• మహబూబ్‌నగర్‌లో 9.5 లక్షలు.. నల్లగొండలో 4 లక్షలపైనే..
• ఒక్క నాగార్జునసాగర్‌లోనే 2 లక్షల మంది..
• ఏర్పాట్లను పరిశీలించిన మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి
సాక్షి, మహబూబ్‌నగర్/నల్లగొండ : కృష్ణా పుష్కరాల్లో వరుసగా నాలుగోరోజు భక్తజన ప్రవాహం కొనసాగింది. సోమవారం కూడా సెలవు రోజు కావడంతో శని, ఆదివారాల మాదిరే లక్షల్లో జనం తరలివచ్చారు. పోటెత్తిన భక్తులతో పుష్కర ఘాట్లు కిటకిటలాడాయి. మొత్తమ్మీద సోమవారం మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాలోని పుష్కర ఘాట్లలో 13.5 లక్షలకుపైగా భక్తులు పుణ్యస్నానాలు ఆచరించారు. మహబూబ్‌నగర్ జిల్లాలోనే 9.5 లక్షలకుపైగా స్నానాలు చేశారు. అలంపూర్‌లోని జోగుళాంబ దేవాలయానికి భక్తులు పెద్దఎత్తున తరలివచ్చారు. గొందిమళ్ల పుష్కరఘాట్‌లో దాదాపు లక్ష మందికిపైగా భక్తులు పుణ్యస్నానమాచరించారు.
సోమశిల, రంగాపూర్, బీచుపల్లి, పస్పుల, నది అగ్రహారం, కృష్ణా పుష్కర ఘాట్లు కూడా కిక్కిరిసిపోయాయి. మంత్రులు ఇంద్రకరణ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, ఎంపీ జితేందర్‌రెడ్డి, పలువురు శాసనసభ్యులు బీచుపల్లి, రంగాపూర్, సోమశిల పుష్కర ఘాట్లను సందర్శించి ఏర్పాట్లను పరిశీలించారు. సోమశిలలో ఎమ్మెల్యే ఆల వెంకటేశ్వర్‌రెడ్డి సతీసమేతంగా స్నానమాచరించారు. అలాగే తంగిడి పుష్కరఘాట్‌లో సినీనటుడు కోట శంకర్‌రావు పుణ్యస్నానం చేశారు.
నల్లగొండలో నాలుగు లక్షలపైనే..
నల్లగొండ జిల్లాలో నాలుగు లక్షల మందికి పైగా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించారు. ఒక్క నాగార్జునసాగర్‌లోనే అత్యధికంగా రెండు లక్షల మంది స్నానాలు చేశారు. సాగర్ జలాశయంలో కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతుండడంతో శివాలయం ఘాట్‌లో దాదాపు లక్షన్నర మంది భక్తులు, పక్కనే ఉన్న సురికి ఆంజనేయస్వామి ఘాట్‌లో 50 వేల మందికి పైగా భక్తులు స్నానమాచరించారు. వాడపల్లిలో కూడా స్వయంభు శివాలయం ఉండడంతో అక్కడ కూడా స్నానాలు చేసిన వారి సంఖ్య లక్ష దాటింది. మట్టపల్లికి కూడా భక్తుల తాకిడి ఎక్కువగానే కనిపించింది. ఇక్కడ దాదాపు 50 వేల మంది స్నానం చేసి ఉంటారని అంచనా. జిల్లాలోని మిగిలిన ఘాట్‌లలో పరిస్థితి యథావిధిగా ఉంది.
కనగల్, మట్టపల్లి మార్కండేయ ఘాట్‌లకు నీళ్లు రాకపోవడంతో భక్తులెవరూ స్నానాలు చేయలేదు. సాగర్ బ్యాక్‌వాటర్ కింద ఏర్పాటు చేసిన మూడు ఘాట్లలో కలిపి స్నానాలు చేసినవారి సంఖ్య 5 వేలకు మించలేదు. మేళ్లచెరువు మండలంలోని ఘాట్‌లకు కూడా పెద్దగా భక్తుల తాకిడి కనిపించలేదు. వరుస సెలవులు పూర్తవడంతో భక్తులు స్వస్థలాల బాట పట్టడంతో నల్లగొండ జిల్లా నుంచి వివిధ ప్రాంతాలకు వెళ్లే దారులన్నీ నిండిపోయాయి. భక్తుల సంఖ్య తగ్గుతుండడంతో పోలీసులు కూడా నిబంధనలను కొంతమేర సడలిస్తున్నారు. కిలోమీటర్ల మేర నడిచి ఘాట్‌లకు వెళ్లాల్సిన పరిస్థితి లేకుండా వాహనాలను అనుమతిస్తుండడంతో భక్తులకు కొంత ఉపశమనం కలుగుతోంది.