ప్రచార లోగోను ఆవిష్కరిస్తున్న డాక్టర్ రఘురామ్, సింధు, జయేష్ రంజన్
సాక్షి, హైదరాబాద్: రొమ్ము కేన్సర్ మహిళల పాలిట ఓ మహమ్మారిగా మారింది. దేశంలో ఏటా కొత్తగా 1.62 లక్షల కేసులు నమోదువుతుండగా, ప్రతి పదినిమిషాలకు ఒకరు ఈ వ్యాధితో ప్రాణాలు కోల్పోతున్నారు. రొమ్ము ఆరోగ్యంపై మరింత అవగాహన కల్పించేందుకు ఉషాలక్ష్మి రొమ్ము కేన్సర్ ఫౌండేషన్ మరో వినూత్న కార్యక్రమాన్ని చేపట్టింది. ఇందులో భాగంగా ఇప్పటికే అందుబాటులోకి తెచ్చిన ‘ఏబీసీ ఆఫ్ కేన్సర్ యాప్’లో ప్రముఖ క్రీడాకారణి పీవీ సింధూతో ప్రచారానికి శ్రీ కారం చుట్టింది. ఈ మేరకు సోమవారం హోటల్ పార్క్ హయత్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ‘ఎర్లీ డిటెక్షన్ ఆఫ్ బ్రెస్ట్ కేన్సర్’ పేరుతో రూపొందించిన లైఫ్ సైజ్ అగ్మంటేన్ రియాల్టీ వీడియో క్యాంపెయిన్‌ను పీవీ సింధు, యూబీసీఎఫ్ సలహాదారు జయేష్ రంజన్, యూబీసీఎఫ్ సీఈఓ డాక్టర్ పి.రఘురామ్ ప్రారంభించారు.
ఆశా వర్కర్లు, ఔత్సాహికులు తమ చేతిలోని స్మార్ట్‌ఫోన్‌లోని ప్లేస్టోర్ ద్వారా ఈ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి. రౌండ్‌గా ఉన్న యాస్ మార్క్‌ను ఉన్న ప్రదేశాన్ని స్కాన్ చేస్తే.. పీవీ సింధు ప్రచార వీడియో ప్లే అవుతుంది. పీవీ సింధూ అభిమానులు దీన్ని ఫొటో కూడా తీసుకోవచ్చు. గ్రామీణ మహిళలకు రొమ్ము కేన్సర్‌పై అవగాహన కల్పించేందుకు అవంత్రి టెక్నాలజీ సహాయంతో దీన్ని ప్రత్యేకంగా రూపొందించినట్లు డాక్టర్ రఘురామ్ చెప్పారు. రఘురామ్‌తో కలిసి రొమ్ము కేన్సర్‌పై మహిళలకు అవగాహన కల్పించడం తనకెంతో సంతోషంగా ఉందని ఈ సందర్భంగా సింధు పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment