నాణ్యమైన విద్యతోనే బంగారు తెలంగాణ
డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి
బెల్లంపల్లి : నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించినప్పుడే బంగారు తెలంగాణ సాధ్యమవుతుందని రాష్ట్ర డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం బెల్లంపల్లి తహసీల్దార్ కార్యాలయ ఆవరణలో ఏర్పాటు చేసిన సభలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. రాష్ట్రంలో అమలు జరుగుతున్న పథకాలు, ప్రగతిపథంలో పరుగెడుతున్న సంక్షేమ రంగాన్ని చూసి దేశం యావత్తు సీఎంను పొగుడ్తుంటే ప్రతిపక్షాలు ఆరోపణలు చేయడం విడ్డూరంగా ఉందన్నారు.
ఇప్పటికైనా ప్రతిపక్షాలు కళ్లు తెరవాలని హితవుపలికారు. సభలో మంత్రి జోగు రామన్న రాష్ట్ర ప్రభుత్వ విప్ నల్లాల ఓదెలు, ఎంపీ జి.నగేశ్, ఎమ్మెల్సీ పురాణం సతీశ్, ఎమ్మెల్యేలు దుర్గం చిన్నయ్య, ఎన్.దివాకర్‌రావు, జెడ్పీ వైస్ చైర్మన్ రాజిరెడ్డి, మున్సిపల్ చైర్‌పర్సన్ పి.సునీతారాణి, టీఆర్‌ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఎస్.నర్సింగం, ఆర్.ప్రవీణ్, డీసీసీబీ చైర్మన్ దామోదర్‌రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
అభివద్ధి పనులు ప్రారంభం
రాష్ట్ర డెప్యూటీ సీఎం కడియం శ్రీహరి సోమవారం బెల్లంపల్లిలో అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రారంభించారు. బెల్లంపల్లి మున్సిపాలిటీ పరిధి బెల్లంపల్లి బస్తీలో కొత్తగా రూ.3 కోట్ల అంచనాతో నిర్మించిన ప్రభుత్వ సాంఘిక సంక్షేమ సమీకృత బాలికల వసతి గృహాన్ని ప్రారంభించారు. ఆతర్వాత గురిజాలకు వెళ్లే రహదారి పక్కన రూ.13 కోట్లతో నిర్మాణం పూర్తై రాష్ట్ర సాంఘిక సంక్షేమ బాలుర గురుకుల ఉన్నత పాఠశాల భవనాన్ని డెప్యూటీ సీఎం ప్రారంభించారు. పాఠశాల ఆవరణలో డెప్యూటీ సీఎం మొక్కలు నాటారు.
ఘనస్వాగతం పలికిన టీఆర్‌ఎస్ శ్రేణులు
బెల్లంపల్లికి తొలిసారిగా విచ్చేసిన డెప్యూటీ సీఎం కడియం శ్రీహరికి టీఆర్‌ఎస్ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. మంచిర్యాల నుంచి కాన్వాయితో బెల్లంపల్లికి వచ్చిన డెప్యూటీ సీఎంకు రైల్వేస్టేషన్ వద్ద ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, మున్సిపల్ చైర్‌పర్సన్ పి.సునీతారాణి, ఇతర నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. రైల్వేస్టేషన్ నుంచి బజార్ ఏరియా వరకు టీఆర్‌ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో టీఆర్‌ఎస్ జిల్లా సీనియర్ నాయకులు ఎస్.నర్సింగం, ఆర్.ప్రవీణ్, పట్టణ అధ్యక్షుడు బొడ్డు నారాయణ తదితరులు పాల్గొన్నారు.
నీటి వాట కోసం పోరాటం చేస్తాం
మంచిర్యాల టౌన్ : ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తరువాత కూడా నీటి వాటా విషయంలో తెలంగాణకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోబోమని, ట్రిబ్యునల్‌కి వెళ్లి తమ వాటాను తాము కచ్చితంగా సాధిస్తామని డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి అన్నారు. సోమవారం మంచిర్యాలకు విచ్చేసిన డిప్యూటీ సీఎం పట్టణంలోని ఐబీ గెస్ట్‌హౌజ్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. నీటికోసమే తమ పోరాటమన్నారు. ఇందుకోసమే తెలంగాణలోని ప్రాజెక్టులను రీడిజైన్ చేయడంతో పాటు, ప్రాజెక్టులను నదులపై చేపడుతున్నామని స్పష్టం చేశారు. అన్ని పార్టీలు నిపుణులతో కలిసి అధ్యయనం చేసి, నీటి కోసం పోరాడేందుకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. అటవీశాఖా మంత్రి జోగు రామన్న, ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు, మున్సిపల్ చైర్ పర్సన్ మామిడిశెట్టి వసుంధర రమేశ్, టీఆర్‌ఎస్ నాయకులు, స్థానిక కౌన్సిలర్లు పాల్గొన్నారు.