వినోభానగర్‌లో వివరాలు సేకరిస్తున్న అధికారులు
సాక్షి, సిటీబ్యూరో: కొద్ది రోజులుగా ఖాళీగా ఉన్న క్వారంటైన్ కేంద్రాలు అనుమానితులతో మళ్లీ రద్దీగా మారుతున్నాయి. లాక్‌డౌన్ నిబంధనలు సడలించిన తర్వాత జనం ఒక్కసారిగా రోడ్లపైకి రావడం, మాస్క్‌లు లేకుండా భౌతిక దూరం పాటించకుండా మార్కెట్లు, వైన్‌షాపుల వద్ద గుంపులుగా గుమిగూడటంతో వైరస్ విస్తరిస్తోంది. ఇప్పటికే కరోనా పాజిటివ్ నిర్ధారణ అయిన కేసులకు సన్నిహితంగా మెలిగిన కుటుంబ సభ్యులు సహా బంధువులను ఇక్కడికే తీసుకొచ్చి పరీక్షలు నిర్వహిస్తున్నారు. దీంతో నాలుగైదు రోజులుగా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుండటం ఆందోళన కలిగిస్తోంది. ప్రస్తుతం నగరంలో తొమ్మిది ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్లు ఉండగా, వీటిలో ఏడు సెంటర్లలో అనుమానితులు ఉన్నారు. ఆది, సోమవారాల్లో(రెండు రోజుల్లో) 450 మంది అనుమానితులు ఆయా కేంద్రాల్లో అడ్మిట్ అయ్యారు. వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చిన 198 మందిని డిశ్చార్జి చేసి హోం ఐసోలేషన్‌కు తరలించారు. ప్రస్తుతం 201 మంది అనుమానితుల రిపోర్టులు రావాల్సి ఉంది. మరో 51 మందికి కరోనా ఉన్నట్లు నిర్ధారణ కావడంతో వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి, చికిత్సలు అందిస్తున్నారు.
హోటల్ క్వారంటైన్‌లో తప్పని తిప్పలు..
అమెరికా, యూకే, అబుదాబీల నుంచి స్వదేశానికి తిరిగి వచ్చిన వారితో పాటు దేశంలోని మహారాష్ట్ర, గుజరాత్, కర్ణాటక, ఢిల్లీ సహా ఇతర రాష్ట్రాల్లో చిక్కుకుపోయిన వారిని ఇక్కడికి తీసుకొస్తున్నారు. విమానం దిగిన తర్వాత వారికి మరోసారి స్క్రీనింగ్ నిర్వహించి, 14 రోజుల క్వారంటైన్‌లో ఉంచుతున్నారు. వీరికి నగరంలోని షెర్టాన్, నోవాటెల్, వైష్ణవి హోటళ్లలో బస ఏర్పాటు చేశారు. ఒక్క తెలంగాణ జిల్లాల వాసులే కాకుండా ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారిని కూడా ఇక్కడే ఉంచుతున్నారు. ఇలా ఇప్పటి వరకు ఆయా దేశాల నుంచి 300 మందికిపైగా రాగా వారందరినీ నగరంలోని వివిధ హోటల్లో ఉంచారు. వీరిలో దగ్గు, జ్వరం, జలుబు వంటి లక్షణాలు కన్పిస్తే.. వెంటనే వారిని ప్రభుత్వ క్వారంటైన్ సెంటర్‌లోని శాంపిల్స్ కలెక్షన్ కేంద్రాలకు తరలిస్తున్నారు. వారి నుంచి స్వాబ్ సేకరించి, వ్యాధి నిర్ధారణ పరీక్షల్లో పాజిటివ్ అని తేలితే వారిని గాంధీ ఆస్పత్రికి తరలించి అక్కడే చికిత్సలు అందజేస్తున్నారు. విదేశాల నుంచి హోటల్ క్వారంటైన్‌లో ఉన్న వారి నుంచి వసూలు చేస్తున్న చార్జీకి.. వారి ఇస్తున్న ఆహారం, కల్పిస్తున్న మౌలిక సదుపాయాలకు అసలు పొంతనే ఉండటం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి భారీగా బిల్లులు వసూలు చేస్తున్న హోటళ్లు తమకు కనీసం కడుపు నిండా భోజనం కూడా పెట్టడం లేదని వాపోతున్నారు.
క్వారంటైన్‌కు 8 మంది తరలింపు
లాలాపేట: లాలాపేటలోని వినోభానగర్‌లో 42 ఏళ్ల మహిళకు కరోనా సోకినట్లు ఆదివారం నిర్ధారణ అయింది. కుషాయిగూడలో ఉండే తన తండ్రి డయాలసిస్ పేషెంట్. కరోనాతో ఇటీవలే చనిపోయారు. గతంలో ఆయనను చూడానికి తరచుగా వెళ్లేది. ఈ క్రమంలో ఆయన ద్వారా ఆమెకు కరోనా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారణ అయింది. దీంతో ఆమె భర్త సహా ఇద్దరు పిల్లలకు పరీక్షలు నిర్వహించారు. నెగిటివ్ రావడంతో వారిని హోం క్వారంటైన్‌లో ఉంచారు. పాజిటివ్ బాధితురాలు నివాసం ఉంటున్న భవనంలో మరో 8 మందిని క్వారంటైన్‌కు తరలించారు. ఆమె ఇంటి సమీపంలో వ్యక్తుల ఆరోగ్యంపై లాలాపేట పట్టణ ఆరోగ్య కేంద్రం ఆధ్వర్యంలో సర్వే నిర్వహిస్తున్నారు. ఆ ఇంటి పరిసరాలలో ప్రజల రాకపోకలను నిలిపివేశారు.
Comments
Please login to add a commentAdd a comment