
కాజీపేట రూరల్ : కరోనా వైరస్ బారిన పడిన వారికి చికిత్స అందజేసేందుకు రైల్వే శాఖ అధికారులు రైళ్లనే క్వారంటైన్ కేంద్రాలుగా రూపొందిస్తున్నారు. ఇప్పటికే 10 బోగీలతో సిద్ధమైన ప్రత్యేక రైలును సికింద్రాబాద్ నుంచి కాజీపేటకు శనివారం తీసుకొచ్చారు. ఈ రైలులో ఒక్కో బోగీలో ఎనిమిది క్యాబిన్లు, క్యాబిన్‌కు మూడు పడకలు సిద్ధం చేశారు. రైలు మొత్తంగా 240 బెడ్లు ఉండగా.. ప్రతీ బెడ్ వద్ద వెంటిలేటర్ ఇత్యాది సౌకర్యాలు కల్పించినట్లు అధికారులు తెలిపారు. ఇక బోగీ కిటికీల ద్వారా దోమలు రాకుండా జాలీ బిగించారు. అవసరమైతే కాజీపేట జంక్షన్ నుంచి డోర్నకల్ జంక్షన్‌కు కూడా వెళ్లి అక్కడ అవసరమైన వారికి క్వారంటైన్‌లో చికిత్స అందజేస్తామని తెలిపారు.