అద్దె ఇల్లు దొరికితే ఖాళీ చేస్తా..
మంత్రుల క్వార్టర్ ఖాళీ చేయడంపై పొన్నాల
హైదరాబాద్, న్యూస్‌లైన్: మంత్రి పదవి కోల్పోయి రెండు నెలలు గడుస్తున్నా.. టీ పీసీసీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్య మంత్రుల నివాస సముదాయంలో తన క్వార్టర్‌ను ఖాళీ చేయడం లేదు. క్వార్టర్‌ను ఖాళీ చేయాలని ఆర్ అండ్ బీ అధికారులు ఇప్పటికి మూడుసార్లు నోటీసులు జారీ చేసినా పొన్నాల పట్టించుకోలేదు. గత నెల 31 నాటికి తప్పనిసరిగా క్వార్టర్ ఖాళీ చేయాలని అధికారులు చివరి అస్త్రంగా రెడ్ నోటీసులు జారీ చేశారు.
ఇందుకు స్పందించిన పొన్నాల జూన్ నెలాఖరు వరకు గడువు కావాలని, తనకు అద్దె ఇల్లు దొరకడం లేదని సమాధానం ఇచ్చారు. బంజారాహిల్స్ మంత్రుల నివాస సముదాయంలోని క్వార్టర్ నంబర్ 12లో పొన్నాల లక్ష్మయ్య ఉంటున్నారు. 2004 నుంచి వరుసగా రెండుసార్లు మంత్రి అయిన పొన్నాల ఇదే క్వార్టర్‌ను అట్టిపెట్టుకున్నారు. గత మార్చిలో మంత్రి పదవి పోవడం, రాష్ర్టపతి పాలన విధించడం తెలిసిందే. అదే సమయంలో మంత్రుల క్వార్టర్లను మాజీలందరూ ఖాళీ చేయాలని అధికారులు నోటీసులు జారీ చేయగా, కొంత మంది అప్పటికప్పుడు స్పందించారు. ఇటీవలే బొత్స సత్యనారాయణ కూడా క్వార్టర్‌ను ఖాళీ చేసి అప్పగించారు. పొన్నాల మాత్రం తనకు సౌకర్యవంతమైన అద్దె ఇల్లు దొరకడం లేదని.. అప్పటిదాకా ఇక్కడే ఉంటానంటూ భీష్మించుకూర్చున్నారు.