ప్రభుత్వానికి ఆర్.కృష్ణయ్య విజ్ఞప్తి
సాక్షి, హైదరాబాద్: వచ్చే బడ్జెట్‌లో బీసీలకు రూ. 10వేల కోట్లు కేటాయించాలని బీసీ సంక్షేమ సంఘం నాయకుడు, తెలుగుదేశం ఎమ్మెల్యే ఆర్ కృష్ణయ్య ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆర్. కృష్ణయ్య, ర్యాగ అరుణ, జె. శ్రీనివాస్‌గౌడ్, వై సత్యనారాయణ, గుజ్జకృష్ణ, నీల వెంకటేశ్ లతో కూడిన బృందం మంగళవారం సచివాలయంలో ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ను కలసి విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా టీఆర్‌ఎస్ ఎన్నిల మేనిఫెస్టోలో బీసీలకు రూ. 10వేల కోట్లు కేటాయిస్తామని హామీనిచ్చిన విషయాన్ని వారు గుర్తు చేశారు.
బీసీలకు ఫీజు రీయింబర్స్‌మెంట్‌తో పాటు బీసీ స్టడీ సర్కిల్ బడ్జెట్‌ను రూ. 150 కోట్లకు పెంచి పోటీ పరీక్షలకు శిక్షణ ఇచ్చేలా కృషి చేయాలన్నారు. కొత్తగా 100 బీసీ కాలేజీ హాస్టళ్లు మంజూరు చేయాలన్నారు. కులాంతర వివాహాలు చేసుకొనే వారి పారితోషికంతో పాటు కల్యాణలక్ష్మి పథకం మొత్తాన్ని రూ. లక్షకు పెంచాలని వివరించారు. దీనిపై సీఎంతో చర్చించి బడ్జెట్‌లో నిధులు పెంచుతామని ఆర్థిక మంత్రి ఈటల హామీ ఇచ్చారని బీసీ నేతలు పేర్కొన్నారు.