బీసీ నేతకు ఘనవిజయం
- ఎల్‌బీనగర్‌లో కృష్ణయ్యకు 12,761 ఓట్ల మెజారిటీ
- రెండోస్థానంలో టీఆర్‌ఎస్ అభ్యర్థి రాంమోహన్‌గౌడ్
- సిట్టింగ్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి మూడోస్థానం
ఎల్‌బీనగర్/హస్తినాపురం, న్యూస్‌లైన్: సార్వత్రిక ఎన్నికల్లో ఎల్‌బీనగర్ నియోజకవర్గంలో హోరాహోరీగా జరిగిన పోరులో బీసీ నేత, టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య తన సమీప టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. రాంమోహన్‌గౌడ్‌పై 12,761 ఓట్ల మెజారిటీతో ఘన విజయం సాధించారు. శుక్రవారం సరూర్‌నగర్ ఇండోర్ స్టేడియంలో నిర్వహించిన ఓట్ల లెక్కింపులో మొదటి రౌండ్ నుంచి చివరి వరకు ఆర్.కృష్ణయ్య ఆధిక్యతను కొనసాగించారు. మొత్తం 35 రౌండ్‌లలో 10 రౌండ్‌లలో టీఆర్‌ఎస్ అభ్యర్థి ముద్దగౌని రాంమోహన్‌గౌడ్ ఆధిక్యతను ప్రదర్శించినప్పటికి చివరి వరకు నిలవలేకపోయారు.
టీడీపీ అభ్యర్థి ఆర్.కృష్ణయ్య మొత్తం 84,124 ఓట్లు సాధించగా.. సమీప ప్రత్యర్థి టీఆర్‌ఎస్ అభ్యర్థి ఎం. రాంమోహన్‌గౌడ్ 71,363 ఓట్లు సాధించారు. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 56,156 ఓట్లతో మూడవస్థానంలో నిలిచారు. వైఎస్సార్‌సీపీ అభ్యర్థి పుత్తా ప్రతాప్‌రెడ్డికి 19,329 ఓట్లు రాగా, లోక్‌సత్తా అభ్యర్థి దోసపాటి రాముకు 8,861 ఓట్లు లభించాయి.
కొత్తపేట, హయత్‌నగర్, వనస్థలిపురం, చంపాపేట, పీఅండ్‌టీ కాలనీ, గడ్డిఅన్నారం డివిజన్‌లలో టీడీపీ సత్తా చాటింది. మరికొన్ని డివిజన్‌లలో టీఆర్‌ఎస్, టీడీపీ హోరాహోరీగా పోటీపడ్డాయి. కర్మన్‌ఘాట్ డివిజన్‌లో టీఆర్‌ఎస్‌కు అత్యధికంగా ఓట్లు పోలయ్యాయి. ఆర్.కృష్ణయ్యను తెలంగాణకు సీఎం అభ్యర్థిగా టీడీపీ అధ్యక్షులు చంద్రబాబునాయుడు ప్రకటించడం.. బీసీ అభ్యర్థి కావడం.. మోడీ ప్రభంజనం తోడు కావడం ఆయనకు కలిసొచ్చింది.
కాంగ్రెస్ ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకత, రాష్ట్రం వీడిపోయిన నేపథ్యంలో సెటిలర్ల ఓట్లు టీడీపీకి బలం చేకూర్చాయి. ఆర్.కృష్ణయ్యకు ఉద్యోగులు, మేధావులు, బడుగు బలహీనవర్గాలు, యువ ఓటర్లు, విద్యార్థి సంఘాల నాయకులు, వివిధ కుల సంఘాలు ఆయన విజయానికి కృషి చేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే అయిన దేవిరెడ్డి సుధీర్‌రెడ్డికి స్థానికంగా వ్యతిరేక పవనాలు వీయడం కృష్ణయ్యకు దోహదపడింది.