5 అంత వీజీ కాదు!  | Not East for political parties in the 5 constituencies | Sakshi
Sakshi News home page

5 అంత వీజీ కాదు! 

Published Thu, Nov 2 2023 3:20 AM | Last Updated on Thu, Nov 2 2023 3:20 AM

Not East for political parties in the 5 constituencies - Sakshi

రాష్ట్రంలోని అసెంబ్లీ నియోజకవర్గాల్లో సగటున ఓటర్ల సంఖ్య 2.5లక్షల నుంచి 3 లక్షల వరకు ఉంటుంది. ఆ మేరకు ఓటర్లున్న చోట గెలిచేందుకు అభ్యర్థులు అన్నిరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ రాష్ట్రంలోని ఓ ఐదు నియోజకవర్గాల్లో మాత్రం అభ్యర్థులు అందరికన్నా ఎక్కువగా తంటాలు పడక తప్పని పరిస్థితి. ఎందుకంటే అవి రాష్ట్రంలోనే ఎక్కువ మంది ఓటర్లున్న సెగ్మెంట్లు. వీటిలో ఓటర్ల సంఖ్య 5 లక్షలపైనే.

ఇందులోనూ రెండింటిలో అయితే ఆరు లక్షలపైనే ఓటర్లు ఉన్నారు. అంటే రెండు, మూడు సాధారణ నియోజకవర్గాలతో సమానం అన్నమాట. ఇవన్నీ హైదరాబాద్‌ నగరం, శివారు ప్రాంతాల్లో విస్తరించి ఉన్నవే. వీటిలో శేరిలింగంపల్లి (6.98 లక్షలు), కుత్బుల్లాపూర్‌ (6.69 లక్షలు), ఎల్బీనగర్‌ (5.66 లక్షలు), రాజేంద్రనగర్‌ (5.52 లక్షలు), మహేశ్వరం (5.17 లక్షలు) ఉన్నాయి.

ఇవన్నీ నియోజకవర్గాల పునర్విభజనతో 2009లో కొత్తగా ఏర్పడినవే కావడం గమనార్హం. ఎక్కువ మంది ఓటర్లేకాదు.. బస్తీల నుంచి గేటెడ్‌ కమ్యూనిటీల దాకా, అత్యంత సంపన్నుల నుంచి కూలీపని చేసుకునేవారి దాకా విభిన్న వర్గాలు, కులాలు, వివిధ మతాల ప్రజలు వీటిలో ఉన్నారు. వీరందరినీ ఆకట్టుకుని ఓట్లుగా మలచుకోవడం ఆషామాషీ కాదు. ఖర్చు కూడా ఎక్కువగా పెట్టాల్సిన పరిస్థితి. ఈ నియోజకవర్గాల గురించి ఒక్కసారి తెలుసుకుందామా.. 

శేరిలింగంపల్లి టాప్‌ 
రాష్ట్రంలో ఎక్కువ ఓటర్లున్న నియోజకవర్గం శేరిలింగంపల్లి. ఇక్కడ 6,98,133 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడ 2009లో కాంగ్రెస్‌ నుంచి పోటీచేసిన బీసీ నేత భిక్షపతియాదవ్‌.. టీడీపీ అభ్యర్థి మొవ్వ సత్యనారాయణపై 1,327 ఓట్ల తేడాతో గెలిచారు. 2014లో టీడీపీ, బీజేపీ కూటమి తరఫున కమ్మ సామాజికవర్గ నేత అరికపూడి గాందీ.. బీఆర్‌ఎస్‌ అభ్యర్థి శంకర్‌గౌడ్‌పై 75,904 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2018 ఎన్నికల్లో అరికపూడి గాంధీ బీఆర్‌ఎస్‌ తరఫున బరిలోకి దిగి.. టీడీపీ అభ్యర్థిపై భవ్య ఆనంద్‌పై 44,194 ఓట్ల తేడాతో విజయం సాధించారు. 

కుత్బుల్లాపూర్‌ బీసీ నేతలదే.. 
ఓటర్ల సంఖ్యలో రెండో స్థానంలో ఉన్న కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో 6,69,361 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడి జనం తొలి నుంచీ బీసీ నేతలకు మద్దతుగా నిలుస్తున్నారు. 2009లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌పై స్వతంత్ర అభ్యరి్థగా పోటీచేసిన కూన శ్రీశైలంగౌడ్‌ 23,219 ఓట్లతో గెలిచారు. 2014లో బీఆర్‌ఎస్‌ నేత కె.హన్మంతరెడ్డిపై టీడీపీ తరఫున బరిలోకి దిగిన కేపీ వివేకానందగౌడ్‌ 39,021 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన వివేకానంద.. 2018 ఎన్నికల్లో ఆ పార్టీ తరఫున పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై 41,500 ఓట్ల తేడాతో గెలిచారు. 

ఎల్బీనగర్‌లో ఖాతా తెరవని బీఆర్‌ఎస్‌ 
ఎక్కువ మంది ఓటర్లున్న నియోజకవర్గాల్లో మూడోదైన ఎల్బీనగర్‌లో 5,66,866 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో టీడీపీ అభ్యర్థి ఎన్‌వీ కృష్ణప్రసాద్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుదీర్‌రెడ్డి 13,142 ఓట్ల మెజారిటీతో గెలిచారు. 2014లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామ్మోహన్‌గౌడ్‌పై టీడీపీ అభ్యర్థి ఆర్‌.కృష్ణయ్య 12,525 ఓట్లతో విజయం సాధించారు. 2018లో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి రామ్మోహన్‌పై కాంగ్రెస్‌ అభ్యర్థి దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి 17,251 ఓట్లతో గెలిచారు. తర్వాత కొద్దిరోజులకే ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. 

బీసీలకే రాజేంద్రనగర్‌ మద్దతు 
ఓటర్ల సంఖ్య ఎక్కువగా ఉన్న సెగ్మెంట్లలో నాలుగో స్థానంలోని రాజేంద్రనగర్‌లో 5,52,455 మంది ఓటర్లు ఉన్నారు. 2009లో ఏర్పాటైనప్పటి నుంచీ బీసీ నేత ప్రకాశ్‌గౌడ్‌ వరుసగా గెలుస్తూ వస్తున్నారు. 2009, 2014 ఎన్నికల్లో టీడీపీ నుంచి పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్‌.. కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన జ్ఞానేశ్వర్‌పై విజయం సాధించారు. తర్వాత ఆయన బీఆర్‌ఎస్‌లో చేరారు. 2018 ఎన్నికల్లో బీఆర్‌ఎస్‌ తరఫున పోటీ చేసిన ప్రకాశ్‌గౌడ్‌.. టీడీపీ అభ్యర్థి గణేశ్‌పై 57,331 ఓట్లతో భారీ మెజారిటీతో గెలిచారు. ఈ ఎన్నికల్లో మూడో స్థానంలో నిలిచిన ఎంఐఎం అభ్యర్థి మీర్జా రహమత్‌కు 46 వేలకుపైగా ఓట్లు రావడం గమనార్హం. 

ఐదో స్థానంలోని మహేశ్వరంలో.. 
మహేశ్వరం నియోజకవర్గం ఎక్కువ ఓటర్ల జాబితాలో ఐదో స్థానంలో ఉంది. 2009లో టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డిపై కాంగ్రెస్‌ తరఫున పోటీ చేసిన పి.సబితా ఇంద్రారెడ్డి 7,833 ఓట్లతో గెలిచారు. ఉమ్మడి ఏపీ చరిత్రలో తొలి మహిళా హోంమంత్రిగా వైఎస్సార్‌ కేబినెట్‌లో బాధ్యతలు చేపట్టారు.

ఇక 2014లో ఇక్కడ కాంగ్రెస్‌ అభ్యర్థి ఎం.రంగారెడ్డిపై టీడీపీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డి 30,784 ఓట్ల తేడాతో విజయం సాధించారు. తర్వాత బీఆర్‌ఎస్‌లో చేరిన కృష్ణారెడ్డి 2018లో ఆ పార్టీ తరఫున బరిలోకి దిగగా.. ఆయనపై కాంగ్రెస్‌ నుంచి బరిలో ఉన్న సబితా ఇంద్రారెడ్డి 9,227 ఓట్లతో గెలిచారు. తర్వాత ఆమె బీఆర్‌ఎస్‌లో చేరి విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 

-గౌటే దేవేందర్‌ 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement
 
Advertisement
 
Advertisement