
మహేశ్వరంలో వడగళ్ల వాన
హైదరాబాద్ : మహేశ్వరం మండల పరిధిలోని పలు గ్రామాల్లో గురువారం కురిసిన అకాల వర్షానికి చేతికొచ్చిన పంటలు, కూరగాయ పంటలు, పండ్ల తోటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. వర్షంతో పాటు వడగళ్లు పడడంతో వరి గింజలు రాలిపోయాయి. మండల పరిధిలోని మహేశ్వరం, కేసీ తండా, ఎన్డీ తండా, కేబీ తండా, తుమ్మలూరు, మోహబ్బత్‌నగర్, మన్సాన్‌పల్లి తదితర గ్రామాల్లో వడగళ్ల వాన బీభత్సం సృష్టించింది. వడగళ్లు కుప్పలు తెప్పలుగా పడ్డాయి. ఎటు చూసిన మల్లేపూలు వలే వడగళ్లు దర్శనమిస్తున్నాయి.
అరుగాలం కష్టించి పండించిన రైతుల నోట్లో మట్టికొట్టినట్లుయిందని కేసీ తండాకు చెందిన రవినాయక్, తుమ్మలూరుకు చెందిన రామచంద్రారెడ్డిలు అవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుండి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి వడగళ్ల వర్షానికి నష్టపోయిన పంటలను పరిశీలించి రైతులను అదుకోని నష్టపరిహారం అందించాలని కోరారు. మండలంలోని పలు గ్రామాల్లో వడగళ్ల వర్షానికి నష్టపోయిన రైతులు దుఃఖ సాగరంలో మునిగిపోయారు. రైతులను అదుకోవాలని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ నాయకులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు.
కందుకూరులో...
కందుకూరు: మండల పరిధిలోని పలు గ్రామాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం గురువారం కురిసింది. మండలంలోని పలు గ్రామాల్లో సాయంత్రం నుండి రాత్రి వరకు ఎడతెరుపు లేకుండా వర్షం కురిసింది. వర్షానికి చేతికొచ్చిన పంటలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ప్రధానంగా వరి, మొక్కజోన్న, కూరగాయ పంటలు, ఆకుకూరలు, పండ్ల తోటలు వర్షానికి దెబ్బతిన్నాయి. అకాల వర్షం రావడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని పలువురు రైతులు అవేదన వ్యక్తం చేస్తున్నారు. నష్టపోయిన పంటలకు ప్రభుత్వం తగిన పరిహారం అందజేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.