
వర్షం..చెత్త సమస్య తీవ్రం!
- మురికి కూపాలుగా మారిన కాలనీలు
- డస్ట్‌బిన్‌లలో వర్షం నీరు కలిసి దుర్గంధం...
- ప్రజలకు తప్పని అవస్థలు
సాక్షి, సిటీబ్యూరో: పారిశుద్ధ్య కార్మికుల సమ్మె కారణంగా నగరంలో ఏ వీధి చూసినా చెత్తతో నిండిపోయింది. రోడ్ల పక్కన గుట్టలు గుట్టలుగా పేరుకుపోయిన చెత్త దుర్గంధం వెదజల్లుతోంది. ఇక మంగళవారం కురిసిన వర్షం కారణంగా ఈ సమస్య మరింత తీవ్రమైంది. చెత్తక్పుల్లో వర్షం నీరు చేరి రొచ్చుగా మారడంతో వాసన భరించలేకపోతున్నామని ఆయా కాలనీల ప్రజలు వాపోతున్నారు. తొమ్మిదిరోజులుగా సమ్మెలో ఉన్న జీహెచ్‌ఎంసీ కార్మికులు రోడ్లను ఊడ్చకపోవడమే కాక.. ఇంటింటినుంచీ తరలించిన చెత్తను వేసేందుకు చెత్తడబ్బాలు ఖాళీ లేక ఎక్కడ పడితే అక్కడ రోడ్లపైనే కుమ్మరించారు.
చెత్తలోని ప్లాస్టిక్ వ్యర్థాలు.. కుళ్లిన పదార్థాలతో పరిస్థితి మరింత భయంకరంగా మారింది. వర్షపునీరు రోడ్లపై పేరుకుపోయిన చెత్తతో కలగలసి మురుగునీటిని తలపించింది. జీహెచ్‌ఎంసీ ప్రత్యామ్నాయ చర్యలు.. మంగళవారం కార్మికులు విధుల్లోకి రావడంతో 3 వేల మెట్రిక్ టన్నుల చెత్తను తరలించగలిగినప్పటికీ, వారం రోజులుగా పేరుకుపోయిన చెత్తాచెదారాలు దాదాపు 30 వేల మెట్రిక్ టన్నులపైనే ఉంది. కాగా, సమ్మె జరుగుతున్నప్పటికీ మొదటి రెండు రోజులు మినహాయించి ప్రతిరోజూ 3 వేల టన్నుల చెత్తను డంపింగ్‌యార్డుకు తరలించినట్లు కమిషనర్ పేర్కొన్నారు.
సమ్మె వెనుక రాజకీయం..
జీహెచ్‌ఎంసీ కార్మికుల ప్రయోజనాల పేరిట సమ్మెకు ఉసిగొల్పుతున్న వారికి జీహెచ్‌ఎంసీకి సంబంధంలేదని, వారి రాజకీయ ప్రయోజనాల కోసం..ఇతరత్రా స్వప్రయోజనాల కోసం సమ్మె కొనసాగిస్తున్నారని జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్ అభిప్రాయపడ్డారు. మల్కాజిగిరి, చార్మినార్ ప్రాంతాల్లో కొందరు చెత్తను తెచ్చి రోడ్లపై వేయడం వంటి ఘటనలకు పాల్పడ్డారని చెప్పారు. వీటిని ప్రభుత్వానికి చెడ్డపేరు తెచ్చే చర్యలుగా భావిస్తున్నామన్నారు. వాటిపై విచారణ జరిపిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కొంతమంది కార్మికుల వేతనాలు కూడా పూర్తిగా వారికందడంలేదని, ఈ పరిస్థితిని నివారించేందుకు అవసరమైన పకడ్బందీ చర్యలు తీసుకోనున్నట్లు తెలిపారు. మంగళవారం 70 శాతానికి పైగా కార్మికులు విధులకు హాజరయ్యారని చెప్పారు.
జీహెచ్‌ఎంఈయూ ర్యాలీ..
జీహెచ్‌ఎంఈయూ అధ్యక్షుడు యు. గోపాల్‌పై జరిగిన దాడికి నిరసనగరా ఆ సంఘం నాయకులు మంగళవారం జీహెచ్‌ఎంసీ ప్రధాన కార్యాలయంలో ర్యాలీ నిర్వహించారు. అనంతరం గోపాల్‌పై దాడి జరిపిన వారిపై తగుచర్యలు తీసుకోవాల్సిందిగా కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు. కమిషనర్‌ను కలిసిన వారిలో యూనియన్ నాయకులు ఎంఏ జబ్బార్, బాలనర్సింగరావు, విఠల్‌రావు కులకర్ణి ఉన్నారు.