సాక్షి, హైదరాబాద్: ఈశాన్య రుతుపవనాల ప్రభావంతో రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. రుతుపవనాలు ఒకేసారి విస్తరించడంతో రాష్ట్రవ్యాప్తంగా అనేకచోట్ల వర్షాలు కురిశాయి. 24 గంటల్లో వరంగల్ రూరల్ జిల్లా పరకాలలో ఏకంగా 19 సెం.మీ. కుండపోత వర్షం కురవగా.. అదే జిల్లా నర్సంపేటలో 15 సెం.మీ. అతి భారీ వర్షం నమోదైంది. మహబూబాబాద్ జిల్లా కొత్తగూడలో 12 సెం.మీ., వరంగల్ రూరల్ జిల్లా నల్లబెల్లిలో 11 సెం.మీ. చొప్పున భారీ వర్షం కురిసింది. మద్నూరులో 10 సెం.మీ., ఖానాపూర్, మాచిరెడ్డి, డిచ్ పల్లిలో 9 సెం.మీ., ఘన్‌పూర్, జుక్కల్, హన్మకొండలలో 8 సెం.మీ., చొప్పున వర్షపాతం నమోదైంది.
ఈ సీజన్ ప్రారంభమైన ఈ నెల 1వ తేదీ నుంచి శనివారం వరకు రాష్ట్రంలో కురవాల్సిన సాధారణ వర్షపాతం 66.4 మిల్లీమీటర్లు కాగా, 89.4 మిల్లీమీటర్లు నమోదైందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. అంటే 35% అధికంగా వర్షపాతం కురిసింది. ఇదిలావుండగా తూర్పు, ఆగ్నేయం నుంచి గాలులు వీస్తున్నాయి. దీంతో ఆది, సోమవారాల్లో కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతోపాటు తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు, ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారి రాజారావు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment