నల్లగొండ అగ్రికల్చర్ : రైతులకు వ్యవసాయ పెట్టుబడి అందించాలన్న సదుద్దేశంతో సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రైతుబంధు పథకం చెక్కుల పంపిణీకి రంగం సిద్ధమైంది. జిల్లా వ్యాప్తంగా సాగుకు యోగ్యమైన భూములు, రైతుల వివరాలు, ఖాతాల సేకరణ వంటి కార్యక్రమాన్ని ఆరెడు నెలలుగా రెవెన్యూ, వ్యవసాయ శాఖ అధికారులు క్షేత్ర స్థాయిలో సర్వే నిర్వహించారు. జిల్లాలో సుమారు 12 లక్షల ఎకరాల సాగుకు యోగ్యమైన భూమి ఉన్నట్లు గుర్తించారు. వారికి ఎకరానికి రూ.4 వేల చొప్పున ఖరీఫ్ సీజన్‌కు రూ.480 కోట్ల అవసరమవుతాయని నిర్ధారించి రాష్ట్ర ప్రభుత్వానికి నివేదించారు. దాని కనుగుణంగా రైతులకు పెట్టుబడి కింద నగదు రూపంలో కాకుండా చెక్కులు అందించడానికి ప్రభుత్వం నిర్ణయించింది. ప్రత్యేకంగా చెక్కులను కూడా ముద్రించింది. జిల్లాలో మొత్తం 566 గ్రామాలు ఉండగా మొదటి దశలో 173 గ్రామాల్లోని రైతులకు ఖరీఫ్ పెట్టుబడి కోసం రైతుబంధు పథకం చెక్కులను పంపిణీ చేయనున్నారు.
ఎకరానికి రూ.4వేల చొప్పున అందించేందుకు అవసరమైన రూ.117.78 కోట్ల విలువ గల చెక్కులను వ్యవసాయ శాఖ అధికారులు జిల్లాకు తీసుకువచ్చారు. ఆ చెక్కులను మొదటి దశలో 1,10,823 మంది రైతులకు అందించడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. జిల్లాకు తీసుకువచ్చిన చెక్కులను ఆయా మండలాల్లోని పోలీస్‌స్టేషన్లలో వ్యవసాయ శాఖ అధికారులు భద్రపరిచారు.రాష్ట్ర ప్రభుత్వం ఈ నెల 20వ తేదీ నుంచి రైతులకు పంపిణీ చేయాలని నిర్ణయించినప్పటికీ అధికారికంగా తేదీని ప్రకటించిన వెంటనే ఆయా గ్రామాల్లో చెక్కులను పంపిణీ చేయడానికి అవసరమైన ఏర్పాట్లను జిల్లా రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖలు ఏర్పాట్లు చేస్తున్నాయి.
గ్రామ సభల్లో పంపిణీ
రాష్ట్ర ప్రభుత్వం తేదీని ప్రకటించిన వెంటనే ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన గ్రామ సభల్లో చెక్కులను రైతులకు పంపిణీ చేయనున్నారు. అందులో రెవెన్యూ, వ్యవసాయ, పోలీసు శాఖ సిబ్బందితో పాటు ప్రజాప్రతినిధులు, రైతు సమన్వయ సమితి సభ్యులను భాగస్వామలను చేయనున్నారు. ఏ రైతు పేరున ఉన్న చెక్కును ఆ రైతుకు మాత్రమే అందజేయనున్నారు. ఒకేవేళ రైతు అనారోగ్యానికి గురై గ్రామ సభలకు రాని పరిస్థితి ఉంటే రైతు వద్దకే అధికారులు వెళ్లి చెక్కును అందజేయనున్నారు. వేరే వారికి ఎట్టి పరిస్థితులలో చెక్కులను అందించవద్దని ప్రభుత్వం స్పష్టం చేయడంతో అధికారులు ముందస్తు జాగ్రత్తలను తీసుకుంటున్నారు.
మిగతా రైతులకు రెండు విడతల్లో..
మిగిలిన రైతులకు పది రోజులకు రెండవ దశలో, మరో పది రోజుల్లో మూడోదశలో రైతులకు చెక్కులను పంపిణీ చేయనున్నారు. మూడుదశల్లో జరిగే పంపిణీ కార్యక్రమాన్ని మొత్తం నెల రోజుల్లో పూర్తి చేయడానికి అధికారులు చర్యలు తీసుకుంటున్నారు.
పారదర్శకంగా చెక్కుల పంపిణీ
రైతుబంధు చెక్కులను పారదర్శకంగా పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నాం. ఎక్కడ కూడా తప్పుదోవ పట్టడానికి అవకాశం ఉండదు. ఎవరి పేరున ఉన్న చెక్కును ఆ రైతుకు మాత్రమే అందజేస్తాం. గ్రామ సభలను ఏర్పాటు చేసి సభలో మాత్రమే చెక్కులను పంపిణీ చేస్తాం. చెక్కుల పంపిణీకి రెవెన్యూ, పోలీసు శాఖల సహకారాన్ని తీసుకుంటున్నాం. రాష్ట్ర ముఖ్యమంత్రి తేదీని ప్రకటించమే తరువాయి.వెంటనే చెక్కులను పంపిణీ చేస్తాం.–బి.నర్సింహారావు, జిల్లా వ్యవసాయాధికారి
Comments
Please login to add a commentAdd a comment