సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో కొత్తగా ఏర్పడ్డ గ్రామ పంచాయతీల్లోనూ రేషన్ షాపులు ఏర్పాటు చేయా లని పౌర సరఫరాల శాఖ మంత్రి ఈటల రాజేందర్ నేతృత్వంలోని కేబినెట్ సబ్ కమిటీ నిర్ణయించింది. రేషన్ కార్డుల సంఖ్య ఆధారంగా షాపులను క్రమబద్ధీకరించాలనే నిర్ణయానికి వచ్చింది. దీనిపై త్వరలోనే సీఎం కేసీఆర్‌తో చర్చించి తుది నిర్ణయం తీసుకోనుంది. రేషన్ డీలర్ల సమస్యలపై ఏర్పాటైన కేబినెట్ సబ్ కమిటీ శుక్రవారం ఈటల అధ్యక్షతన సమావేశమైంది.
హైదరాబాద్‌లోని మంత్రి లక్ష్మా రెడ్డి ఇంట్లో జరిగిన ఈ సమావేశానికి మంత్రులు హరీశ్‌రావు, జోగు రామన్న, పౌర సరఫరాల శాఖ కమిషనర్ అకున్ సబర్వాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా కొత్త రేషన్ షాపుల ఏర్పాటు, రేషన్ డీలర్ల కమీషన్ పెంపుపై చర్చించారు. రాష్ట్రంలో ప్రస్తుతం క్వింటాల్ బియ్యానికి డీలర్లకు రూ.20 చెల్లిస్తున్నారని, ఆహార భద్రతా చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత కేంద్రం కమీషన్‌ను రూ.87కు పెంచిందని అకున్ స బర్వాల్ తెలిపారు. వివిధ రాష్ట్రాల్లో క్వింటాల్‌కు రూ. 250కి పైగా చెల్లిస్తున్నారని, డీలర్లు రూ.300 వరకు డిమాండ్ చేస్తున్నారని చెప్పారు. దీంతో డీలర్లు కోరిన మేర కమీషన్ పెంచి తే ఎంతభారం అవుతుందన్న దానిపై సమగ్ర నివేదిక తయారు చేయాలని అధికారులను మంత్రివర్గ ఉపసంఘం కోరింది.
రూ.300 కమీషన్ ఇవ్వాలి
రాష్ట్ర డీలర్ల సంఘం అధ్యక్షుడు నాయకోటి రాజు ఆధ్వర్యంలో డీలర్లు ఈటలను సచివాలయంలో కలిశారు. ఇతర రాష్ట్రాల కన్నా ఆదర్శంగా, గౌరవంగా డీలర్లకు క్వింటాల్‌పై రూ.300 కమీషన్ ఇవ్వాలని విన్నవించారు.
Comments
Please login to add a commentAdd a comment