* మాఫీపై టీ సర్కారుకు తేల్చి చెప్పిన ఆర్‌బీఐ గవర్నర్
* ముందుగా రైతులు రుణాలు చెల్లించేలా చూడాలి
* తర్వాత ప్రభుత్వం వాయిదాల్లో రైతులకు ఇవ్వాలి
* బ్యాంకులను భాగస్వాములను చేయొద్దు
* ఆరేడేళ్లలో వడ్డీతో సహా చెల్లిస్తామన్న ప్రభుత్వ ప్రతిపాదనకు నో
* ఇలాంటి చర్యలు బ్యాంకుల ఆర్థిక స్థితిని దిగజార్చుతాయన్న ఆర్‌బీఐ
సాక్షి, హైదరాబాద్: రైతు రుణాల మాఫీ విషయంలో తెలంగాణ సర్కారుకు ఆర్‌బీఐ షాక్ ఇచ్చింది! ఈ అంశంపై రిజర్వ్ బ్యాంక్ తన వైఖరిని ఏమాత్రం సడలించలేదు. రుణ మాఫీ నిర్ణయం ప్రభుత్వ ఇష్టమని, ఇందులో బ్యాంకులను భాగస్వాములను చేయరాదని తేల్చి చెప్పింది. రైతులు ముందుగా బ్యాంకులకు రుణాలు చెల్లించేలా చర్యలు తీసుకుని, ఆ మొత్తాన్ని తర్వాత రైతులకు ప్రభుత్వం వాయిదాల్లో చెల్లించుకోవాలని సూటిగా స్పష్టం చేసింది.
లక్ష రూపాయల్లోపు రైతు రుణాలను మాఫీ చేస్తామని ఎన్నికల్లో ఇచ్చిన ప్రధాన హామీని అమలు చేసేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ విషయంలో అనుసరించే విధానంపై ఆర్‌బీఐ అనుమతి తీసుకోవాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ఆర్థిక సలహాదారు జీఆర్ రెడ్డి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి డాక్టర్ రాజీవ్ శర్మ, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆ శాఖ ప్రత్యేక కార్యదర్శి రామకృష్ణా రావుతో కూడిన బృందం శుక్రవారం ముంబైలో ఆర్‌బీఐ గవర్నర్ రఘురాం రాజన్‌తో భేటీ అయింది.
రుణ మాఫీపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను ఈ సందర్భంగా తెలంగాణ అధికారులు వివరించారు. దీనికి ఆమోదం తెలపాలని, మాఫీ మొత్తాన్ని ఆరేడు సంవత్సరాల్లో బ్యాంకులకు వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని ప్రతిపాదించినట్లు సమాచారం. అయితే ఇందుకు ఆర్‌బీఐ గవర్నర్ నుంచి సానుకూల స్పందన రానట్లు తెలిసింది. ‘రుణ మాఫీ అంశంలో బ్యాంకులను భాగస్వాములను చేయకండి. ముందుగా రైతులు తీసుకున్న రుణాలను చెల్లించేలా చర్యలు తీసుకోండి. ఆ మొత్తాన్ని తర్వాత ప్రభుత్వం నుంచి ఎన్ని వాయిదాల్లో అయినా రైతులకు వెనక్కి ఇవ్వండి(రీయింబర్స్). ఇలాంటి(రుణ మాఫీ) చర్యలు బ్యాంకుల ఆర్థిక పరిస్థితిని దిగజారుస్తాయి’ అని వ్యాఖ్యానించినట్లు తెలంగాణ ప్రభుత్వ ఉన్నతస్థాయి వర్గాలు తెలిపాయి.
ఆర్‌బీఐ నుంచి ఊహించని సమాధానం రావడంతో రాష్ర్ట ప్రభుత్వానికి మింగుడుపడటం లేదు. తొలుత రుణ మాఫీతో రాష్ర్ట ప్రభుత్వంపై రూ. 17 వేల కోట్ల మేర భారం పడుతుందని, 25 లక్షల మంది రైతులు ప్రయోజనం పొందే అవకాశముందని అధికారులు అంచనా వేశారు. మాఫీ మొత్తాన్ని తిరిగి చెల్లించే విషయంలో ఆర్థికంగా ఇబ్బందులు తలెత్తనున్న దృష్ట్యా ఈ భారాన్ని రూ. పదివేల కోట్లకే పరిమితం చేయాలని సర్కారు భావించింది. రుణాలకు ఏడాది పరి మితి విధించనున్నట్లు ప్రభుత్వం ఏర్పడిన కొత్తలోనే సంకేతాలు కూడా ఇచ్చింది. అయితే రైతులు, రాజకీయపక్షాల నుంచి వ్యతిరేకత రావడంతో వెనక్కి తగ్గింది.
బంగారం తాకట్టు రుణాలు సహా ఎలాంటి పరిమితి లేకుండా లక్షలోపు రుణాలను మాఫీ చేస్తామని సీఎం కేసీఆర్ అసెంబ్లీ వేదికగా ప్రకటించారు. దీంతో రుణాల చెల్లింపు మార్గాలపై, నిధుల సమీకరణపై ప్రభుత్వ వర్గాలు తీవ్ర కసరత్తు చేస్తున్నాయి. రైతులకు భారం లేకుండా రుణాలను ఆరేడు సంవత్సరాలకు రీ-షెడ్యూల్ చేయాలని, ఆ వాయిదాల మొ త్తాన్ని వడ్డీతో సహా ప్రభుత్వం చెల్లిస్తుందని బ్యాంకులకు ప్రతిపాదిస్తున్నాయి. అవసరమైతే ప్రభుత్వ భూములను తనఖా పెడతామని, ప్రభుత్వ ఖాతాలను పూర్తిగా ఈ బ్యాంకుల్లోనే ఉంచుతామని కూడా అధికారులు పేర్కొంటున్నారు.
అయితే బాండ్ల జారీ, రుణాల రీ షెడ్యూల్ వంటివి చేపట్టడం అసాధ్యమని బ్యాంకులు తేల్చి చెబుతున్నాయి. ఇలాంటి వాటితో తమ ఆర్థిక పరిస్థితి తలకిందులవుతుందని ఇప్పటికే ఒకట్రెండు ప్రభుత్వ బ్యాంకులు బాహాటంగానే ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ నేపథ్యంలోనే ఈ విషయంలో పాటించే విధానాన్ని ఖరారు చేసుకునేందుకు ఆర్‌బీఐ గవర్నర్‌తో రాష్ర్ట ప్రభుత్వ వర్గాలు భేటీ అయ్యాయి. అయితే రుణ మాఫీని గవర్నర్ నేరుగా తిరస్కరించకుండా... అది ప్రభుత్వ బాధ్యతేనని, తమకు సంబంధం లేదన్న సంకేతాలిచ్చారు.
రుణభారం మీదే
Published Sat, Jul 5 2014 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 9:48 AM
Advertisement
Advertisement