అభ్యర్థుల గుండెల్లో రె'బెల్స్‌' | Rebels Are Worrying TRS, Congress Candidates | Sakshi
Sakshi News home page

అభ్యర్థుల గుండెల్లో రె'బెల్స్‌'

Published Fri, Nov 16 2018 12:26 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Rebels Are Worrying TRS, Congress Candidates - Sakshi

ముందస్తు అసెంబ్లీ ఎన్నికల్లో అభ్యర్థులను రెబెల్స్‌ వెంటాడుతున్నాయి. టీఆర్‌ఎస్, కాంగ్రెస్, పార్టీల అభ్యర్థులను రెబల్స్‌ ఆందోళనకు గురి చేస్తున్నారు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో పలు నియోజకవర్గాల్లో ఈ రెండు ప్రధాన పార్టీల అభ్యర్థులకు రెబల్స్‌ బెడద ఉంది. ఈ నెల 19న నామినేషన్లకు చివరి తేదీ కాగా, 20న నామినేషన్ల పరిశీలన, 22వ తేదీన నామినేషన్ల ఉప సంహరణకు గడువు ఉంది. టికెట్ల కేటాయింపు, అభ్యర్థుల ఖరారు, నామినేషన్ల హడావుడిలో మునిగిన ప్రధాన పార్టీలు.. ఇప్పటివరకు రెబల్స్, అసంతృప్తుల నామినేషన్లపై దృష్టి పెట్టలేదు. రెబల్స్‌ బరిలో ఉంటే మాత్రం అభ్యర్థుల గెలుపోటములపై ప్రభావం చూపనున్నాయన్న భయం ప్రధాన పార్టీల అభ్యర్థులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఉపసంహరణకు ఇంకా గడువు ఉన్నా బుజ్జగింపులకు శుక్రవారం నుంచి శ్రీకారం చుట్టే అవకాశం ఉంది.  

సాక్షి, కరీంనగర్‌: పెద్దపల్లిలో సీహెచ్‌ విజయరమణారావుకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఇవ్వడంతో టిక్కెట్‌ ఆశించి భంగపడ్డ సురేష్‌రెడ్డి, సవితారెడ్డి, చేతి ధర్మయ్య తదితరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సురేష్‌రెడ్డి కాంగ్రెస్‌ రెబల్‌గా నామినేషన్‌ సైతం వేశారు. వేములవాడలో ఆది శ్రీనివాస్‌కు కాంగ్రెస్‌ టిక్కెట్‌ దక్కడంతో ఏనుగు మనోహర్‌రెడ్డి అనుచరవర్గం ఆందోళన వ్యక్తం చేస్తూ మూకుమ్మడిగా పార్టీకి రాజీనామా చేసేందుకు సిద్ధమై భవిష్యత్తు కార్యాచరణ రూపొందించే పనిలో నిమగ్నమయ్యారు. చొప్పదండిలో రేవంత్‌రెడ్డితో టీడీపీ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మేడిపల్లి సత్యంకు కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఖరారు చేయడంతో మాజీ మంత్రి సుద్దాల దేవయ్య, ప్రజాసంఘాల జేఏసీ నాయకులు గజ్జెల కాంతం అగ్గిమీద గుగ్గిలమై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. 

పొన్నం ప్రభాకర్‌ వల్లే చొప్పదండి టిక్కెట్‌ తనకు దక్కలేదని సుద్దాల దేవయ్య ఆరోపిస్తున్నారు. కోరుట్ల నుంచి కాంగ్రెస్‌ పోటీ చేయనుండగా అక్కడ కొమిరెడ్డి రామ్‌లు, జువ్వాడి నర్సింగారావు మధ్య గట్టి పోటీ నెలకొంది. ఈ నేపథ్యంలో ఇంకా ఎవరికీ టికెట్‌ కేటాయించకపోగా.. మాజీ మంత్రి రత్నాకర్‌రావు తనయుడైన నర్సింగారావుకే అధిష్టానం, మహాకుటమి నేతల ఆశీస్సులు ఉన్నట్లు ప్రచారం. హుజూరాబాద్‌లో కాంగ్రెస్‌ అభ్యర్థిత్వం ఖరారు కాకపోయినా టిక్కెట్‌ ఆశిస్తున్న పాడి కౌశిక్‌రెడ్డి నామినేషన్‌ వేసి.. అధికారికంగా ప్రకటించే విధంగా ఢిల్లీకి వెళ్లి లాబీయింగ్‌ చేస్తున్నట్లు పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. 

ఇదే సమయంలో కౌశిక్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వొద్దంటూ ఆశావహులు పరిపాటి రవీందర్‌రెడ్డి, తుమ్మేటి సమ్మిరెడ్డి, ప్యాట రమేష్‌ తదితరులు సైతం గురువారం ఢిల్లీ పెద్దలను కోరారు. కౌశిక్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే తాము రెబల్‌గా పోటీ చేస్తామని తుమ్మేటి సమ్మిరెడ్డి తదితరులు బహిరంగంగానే చెప్తున్నారు. హుస్నాబాద్‌ స్థానాన్ని పొత్తులో భాగంగా సీపీఐకి మహాకూటమి కేటాయించినా కాంగ్రెస్‌ టిక్కెట్‌ ఆశిస్తున్న మాజీ ఎమ్మెల్యే అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి నామినేషన్‌ దాఖలు చేశారు. ఇలా పలుచోట్ల అభ్యర్థుల ప్రకటనపై నిరసనలు వ్యక్తమవుతున్నాయి. 

టీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు రెండుచోట్ల.. చొప్పదండిలోనూ తలనొప్పే..
టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలకు రెబెల్స్, అసంతృప్తుల బెడద తప్పడం లేదు. ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో మొత్తం 13 అసెంబ్లీ స్థానాలకు టీఆర్‌ఎస్‌ దశల వారీగా అన్నింటా అభ్యర్థులను ప్రకటించింది. రామగుండం, వేములవాడ స్థానాల అభ్యర్థులకు మొదటి నుంచి అసమ్మతి తలనొప్పిలా మారింది. రామగుండం నుంచి సిట్టింగ్‌ ఎమ్మల్యే సోమారపు సత్యనారాయణకే మళ్లీ టికెట్‌ కేటాయించగా, కోరుకంటి చందర్‌ రెబల్‌గా నామినేషన్‌ వేసి బరిలో నిలిచారు. అదేవిధంగా వేములవాడ సిట్టింగ్‌ ఎమ్మెల్యే చెన్నమనేని రమేష్‌బాబును అసంతృప్తివాదులు వెంటాడుతున్నారు. ఏకంగా తిరుగుబాటు చేసి పోటీ సభలు కూడా నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. 

చొప్పదండి నియోజకవర్గం నుంచి పార్టీ సిట్టింగ్‌ ఎమ్మెల్యే బొడిగె శోభకు టికెట్‌ నిరాకరించగా, ఆమె గురువారం అనుచరులతో కలిసి హైదరాబాద్‌లో బీజేపీలో చేరారు. దీంతో టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా బరిలో దిగనున్న సుంకె రవిశంకర్‌కు.. శోభ బీజేపీ నుంచి రంగంలోకి దిగడం ఒక రకంగా రెబెల్‌ అభ్యర్థిగా ట్రీట్‌ చేయవచ్చంటున్నారు. రెండుచోట్ల స్పష్టంగా అసంతృప్తి, రెబెల్స్‌ బెడద కనిపిస్తుండగా, చొప్పదండిలోనూ శోభ బీజేపీ నుంచి బరిలోకి దిగుతుండటం టీఆర్‌ఎస్‌ పార్టీ అభ్యర్థికి తలనొప్పేనని అంటున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement