
సాక్షి, గోదావరిఖని(రామగుండం) : సంక్రాతి వేడుకల్లో భాగంగా 500 మంది మహిళలు ‘రామగుండం ముంగిట్లో రంగుల హరివిల్లు’ పేరుతో వేసిన ముగ్గు.. ‘ప్రపంచంలోనే అతిపెద్దది’గా రికార్డులకెక్కింది. పెద్దపల్లి జిల్లా గోదావరిఖని సింగరేణి స్టేడియంలో శనివారం ఈ అతి పెద్ద ముగ్గువేశారు. 500 మంది మహిళలు భాగస్వామ్యమై.. 800 చదరపు అడుగుల్లో.. 1,939 చుక్కలతో ముగ్గువేశారు.
తెలుగు సంవత్సరాది అయిన శాలివాహన శకాన్ని గుర్తు చేస్తూ.. మధ్యాహ్నం ఒంటిగంట నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ముగ్గు వేశారు. ప్రపంచంలోనే పెద్దముగ్గుగా వండర్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు చెప్పారు. పోలీస్ హౌసింగ్ కార్పొరేషన్ చైర్మన్ కోలేటి దామోదర్, ఏసీపీ అపూర్వరావు, కార్పొరేటర్లు పాల్గొన్నారు.